అడుగడుగునా సైకిల్‌కు పంక్చర్లే…! చంద్రబాబు కిం కర్తవ్యం?
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఏడాది అయింది. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా.. [more]
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఏడాది అయింది. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా.. [more]

టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఏడాది అయింది. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా.. చంద్రబాబు మాత్రం నైతికంగా తమదే విజయమని చెబుతున్నారు. అంతెందుకు.. ఇప్పుడు ప్రజలు .. చంద్రబాబును ఎందుకు గెలిపించుకోలేక పోయామా ? అని తల పట్టుకుంటున్నారట! (బాబుగారే చెప్పుకొంటున్నారు). మరి ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ పరిస్థితి ఇప్పటికిప్పుడు ఎలా ఉంది? అనే విషయం ఆసక్తిగా మారింది. గత ఏడాది ఎన్నికల్లో ఈ జిల్లాల్లో చంద్రబాబు ఒక్కరే గెలుపు గుర్రం ఎక్కారు. అది కూడా ఆయనకు 2014 ఎన్నికలతో పోల్చితే మెజారిటీ బాగా తగ్గిపోయింది.
లైవ్ లేకుండా…..
ఇక, మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం పార్టీ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నియోజకర్గాల వారీగా చూసుకుంటే.. చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో ఒక్కదానిలో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. మిగిలిన నియోజకవర్గాల్లో సీనియర్లు పోటి చేసినా.. మట్టి కరిచారు. అందునా.. నగరి నుంచి జూనియర్ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ కుమారుడు గాలి భానుప్రకాష్ నాయుడు పోటీ చేశారు. ఈయన కేవలం 2000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మిగిలిన వారు మాత్రం భారీ తేడాతో ఓటమి చవిచూశారు. పైగా ఓడిపోయిన నాయకులు ఇప్పుడు లైవ్‌లో ఎక్కడా మనకు కనిపించడం లేదు. దీంతో ఇక్కడ పార్టీ పరిస్థితి ఏంటనేది ఆసక్తిగా మారింది. ఒక్కసారి నియోజకవర్గాల వారిగా పార్టీ పరిస్థితి విశ్లేషిస్తే ఎంత దీనస్థితిలో టీడీపీ ఉందో తెలుస్తోంది.
గంగాధర నెల్లూరు: ఇక్కడ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ పోటీ చేశారు. ఈయన 45 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు కనీసం ఎక్కడా కనిపించడం కూడా లేదు. పైగా ఆయన పార్టీ మారిపోతారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
పూతలపట్టు: ఇక్కడ నుంచి టీడీపీ సీనియర్ నాయకురాలు.. వరుసగా ఓటమిపాలవుతున్న లలిత కుమారి పోటీ చేశారు. ఈమె కూడా 29 వేల ఓట్ల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక, అప్పటి నుంచి యాక్టివ్‌గా లేరు.
నగరి: ఇక్కడ నుంచి గాలి భానుప్రకాష్ పోటీ చేశారు. ఆయన కేవలం 2000 వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయినా.. పార్టీలో ఆయనకు కుటుంబం నుంచే సహకారం లేకపోవడంతో మౌనం పాటిస్తున్నారు. కాస్తో కూస్తో జిల్లాలో టీడీపీకి ఆశ ఉన్న ఒకటి రెండు నియోజకవర్గాల్లో నగరి పేరు మాత్రమే వినిపిస్తోంది. అది కూడా వైసీపీలో లుకలుకలే ఇక్కడ పార్టీకి ప్లస్.
శ్రీకాళహస్తి: ఇక్కడ నుంచి మాజీ మంత్రి బబొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేశారు. ఈయన కూడా 38 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈయన కూడా తన వ్యాపారాల్లో మునిగితేలుతున్నారు. పార్టీని పట్టించుకోవడం లేదు.
చిత్తూరు: ఏఎస్ మనోహర్ టీడీపీ తరఫున పోటీ చేశారు. 39 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈయన పార్టీ మారిపోవడంతో ఇక్కడ పార్టీ జెండా పట్టుకునే నాథుడు కూడా కనిపించడం లేదు. మాజీ ఎమ్మెల్యే డీకే. సత్యప్రభ చంద్రబాబును తనను బలవంతంగా రాజంపేట ఎంపీగా పోటీ చేయించారని ఫైర్ అవ్వడంతో పాటు పార్టీకి దూరంగా ఉన్నారు.
చంద్రగిరి: ఎన్నికల సమయంలో భారీ హడావుడి చేసిన పులవర్తి వెంకట మణిప్రసాద్ ఉరఫ్ నాని పోటీ చేశారు. దాదాపు 41 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈయన కూడా ఇప్పుడు కనిపించడం లేదు. పైగా ఇది చంద్రబాబు సొంత నియోజకవర్గం. కమ్మ వర్గానికి చెందిన నాని ఇప్పుడు బయటకు వస్తే చేతి చమురు వదలడం తప్పా ఉపయోగం ఉండదని అనుచరులతో చెపుతున్నారట.
పలమనేరు: మాజీ మంత్రి ఎన్. అమరనాథ్‌రెడ్డి పోటీ చేసి.. 31 వేల ఓట్ల తేడాతో సైకిల్పైనుంచి పడిపోయారు. అప్పుడప్పుడు హడావుడి చేసినా.. ఈయన పార్టీ మారిపోవడంపై దృష్టి పెట్టడంతో టీడీపీ ఛాయలు ఇక్కడ కూడా కనిపించడం లేదు. పైగా అమర్నాథ్ బెంగళూరులో వ్యాపారాల్లో బిజీ అయ్యారు.
పుంగనూరు: ఎన్. అనుషారెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 43 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో పరిస్థితి స్తబ్దుగా ఉంది. అసలు అనీషారెడ్డి అన్ని విధాలా దెబ్బతినడంతో ఆమె రాజకీయాలు చేసే పరిస్థితి కూడా లేదు.
పీలేరు: మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిశోర్‌కుమార్ రెడ్డి టీడీపీ గుర్తుపై పోటీ చేసి 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన కూడా సైలెంట్ అయ్యారు. అయితే ఉన్నంతలో ఇక్కడ ఆ ఫ్యామిలీకి ఉన్న పట్టు నేపథ్యంలో నల్లారి ఫ్యామిలీ యాక్టివ్ అయితే పరిస్థితిలో కాస్త మార్పు రావచ్చు.
మదనపల్లె: దొమ్మాలపాటి రమేష్ పోటీ చేసి 29 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన కూడా ఎక్కడా కనిపించడం లేదు.
తంబళ్లపల్లె: శంకర్‌యాదవ్ టీడీపీ తరఫున పోటీకి దిగారు. అయితే, 46 వేల పైచిలుకు ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. పైగా ఇక్కడ శంకర్ యాదవ్ మాకొద్దు టీడీపీ కేడర్ చెపుతోంది.
తిరుపతి: సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇక్కడ నుంచి టీడీపీ గుర్తుపై పోటీ చేసినా.. 708 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే, ఇప్పుడు వయోసంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆమె గడప దాటడం లేదు. మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న సొంత జిల్లాను చంద్రబాబు ఎలా లైన్లో పెడతారో చూడాలి.

