Sun Dec 08 2024 16:22:17 GMT+0000 (Coordinated Universal Time)
అందలమే దిగివచ్చి అవకాశమిస్తుంటే.. ఆకాశానికి నిచ్చెనేస్తానన్నట్టు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా ఉన్న మరో పెద్ద అంశం బీసీ నాయకత్వ లోపం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మహర్దశ పట్టింది. వచ్చే ఎన్నికలలో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు పేరెన్నిన నాయకులు ఎందరో నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. రోజురోజుకీ చేరికలతో అన్ని ప్రాంతాల్లోనూ బలంగా పుంజుకుంటోంది హస్తం పార్టీ. నేతలు, కార్యకర్తలు అందరూ మాంచి జోష్ మీద కనిపిస్తున్నారు. ఇక మిగిలింది రోజులు గడవడమే అన్నంత కాన్ఫిడెన్స్‌తో కనిపిస్తున్నారు.
మరి ఈ స్పీడ్ ఇలాగే కొనసాగితే సరిపోతుందా? కాంగ్రెస్ పార్టీ గెలుపుకి అడ్డంకులే లేవా?.. ఉన్నాయి....
గెలుపు తమదే అనే ఫుల్ హోప్స్‌తో సాగుతోన్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ చాలా అంశాల్లో ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. మొదటిగా.. తెలంగాణ రాష్ట్రం కోస నిర్దిష్ట మేనిఫెస్టో! కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ప్రజలకు ఏ పథకాలను అమలు చేస్తారు? అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకు ధీటుగా లేదా వాటిని మరిపించే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపొందాలి. ఏడాది క్రితం వరంగల్ వేదికగా వరంగల్ డిక్లరేషన్, నల్గొండలో నిరుద్యోగుల సభ మంచి బజ్ క్రియేట్ చేశాయి. అలాంటి మరికొన్ని కొత్త స్ట్రేటజీలని కాంగ్రెస్ పార్టీ రూపొందించాలి. ఇవాళ ప్రకటించిన ఐదు పాయింట్ల మేనిఫెస్టోతో పాటు మరికొన్ని వినూత్న ఆలోచనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా ఉన్న మరో పెద్ద అంశం బీసీ నాయకత్వ లోపం. రాష్ట్ర పార్టీలో బిసీ వర్గాన్ని పోలరైజ్ చేసే నేతలు కరువయ్యారు అనిపిసదతోంది. అధికార బీఆర్ఎస్ పార్టీలో బీసీ నేతలకు కొదవ లేదు. బీసీలకు లక్ష రూపాయిల బీసీ బందు పథకాన్ని ప్రకటించిన కేసీఆర్.. ఓ మోస్తరు బీసీ ఓట్లను సెక్యూర్ చేసుకున్నారు. బిజేపిలో ఇటీవల కాలంలో ఈటల రాజేందర్‌కు ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ పదవి అందించి.. బీసీ వర్గంలో మంచి నమ్మకాన్ని చూరగొంది ఆ పార్టీ. బీసీల్లో 52 శాతం ఉన్న ముదిరాజ్ వర్గం ఈటల వెంట నిలబడుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బిసీ సామాజిక వర్గంలో పేరొందిన లీడర్లందరూ బీఆర్ఎస్, బిజేపి పార్టీలలోనే కనిపిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అర్వింద్ ధర్మపురి, బండి సంజయ్ కుమార్‌లు ప్రస్తుతం బిజేపికి స్టార్ క్యాంపేయినర్లనే చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్లో శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎల్ రమణ, స్వామి గౌడ్ వంటి చరిష్మాటిక్ లీడర్లు ఉన్నారు. ఈ నేతల నడుమ బీసీ ఓట్లను సమీకరించగలిగిన సత్తా ఉన్న బీసీ నేత కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బిసి ఓట్ బ్యాంక్ హస్తం పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. గాంధీ భవన్ లో రోజూవారి జరుగుతున్న మీటింగ్‌లో ఈ అంశం పై పార్టీ పెద్దలు తర్జనభర్జనలు పడుతున్నా ఆపన్నహస్తంలా ఎవరూ తారసపడటం లేదు. మొన్నామధ్య ఎమ్మెల్సీ పాడికౌశిక్ రెడ్డి కి బీసీలకు రేగిన వివాదంలో కాంగ్రెస్ పార్టీ పోరాడలేకపోయింది. బీసీల మన్నన పొందడానికి వచ్చిన అవకాశాన్ని చేజేతులా కోల్పోయింది. ఒకప్పుడు పార్టీలో బలంగా ఉన్న నేత వీ హనుమంత్ రావ్ ప్రస్తుతం వీక్ అయ్యారు. పొన్నం ప్రభాకర్, అనిల్ కుమార్ యాదవ్ వంటి లీడర్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతి నుండి యాక్టివ్ గా లేని లీడర్లుగా మిగిలిపోయారు. పార్టీ ఈ సమస్యను అధిగమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
మహిళలు, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో టీపీసీసీ మరింత ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ మీద విపరీతమైన అసంతృప్తితో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆకట్టుకోలేకపోతోంది. కేసీఆర్ విలీనం చేసిన వీఆర్ఏ, టీఎస్ఆర్టీసీ వ్యవస్థల పై కాంగ్రెస్ పార్టీ పోరాడగల అంశాలు ఉన్నాయి. గ్రామస్థాయిలో ఇటు ప్రజలకు, అటు అధికారలుకు సమన్వయకర్తలుగా వ్యవహరించిన వీఆర్ఏ లు ఈరోజు ఊళ్ళను ఒదులుకుని తెలీని వ్యవస్థలలో బలవంతంగా చొచ్చబడ్డారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీని ఎదురుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. అలానే విలీనం చేస్తానంటోన్న టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్పొరేషన్ తాలూకా ఆస్తుల కోసం పోరాటం చేయవచ్చు. మిగతా రంగాల్లోని అసంతృప్తితో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా కల్పించే మేనిఫెస్టోని ప్రకటించగలిగితే బాగుంటుందేమో!
వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, మహిళల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న పథకాలకు ధీటుగా పథకాలను రచించగలిగితేనే ఆ వర్గాల సపోర్ట్ కాంగ్రెస్ కు దక్కుతుంది. ఇది కూడా ఆ పార్టీ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతున్న భయం.. ఆ పార్టీలోని నాయకుల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం. గెలిచి అధికారం లోకి ఎలా రావాలో అనే ఆలోచన వదిలేసి.. ఎవరికి వారు పార్టీ మీద పెత్తనం చలాయించాలనే దృక్పదంతో ఉన్నారు. బాహాటంగానే సీఎమ్ రేస్‌లో తామున్నామని సంకేతాలిస్తున్నారు. దీంతో పార్టీలో విబేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టకపోతే కార్యవర్గంతో పాటు, కార్యకర్తల వరకూ చీలికలు ఏర్పడే ప్రమాదం ఉంది ఇంతటి మంచి తరుణం మరోసారి లభించదు అని గ్రహించి సీనియర్ లీడర్లు అందరూ కలిసి సమన్వయంగా సాగాల్సిందే.
Next Story