సుజనా , రమేష్ ఏడాది ముందస్తు బుకింగ్ ?
అందరూ చంద్రబాబు నాయుడు వైపే వేలు చూపుతున్నారు. ఇప్పుడు బీజేపీలోకి జంప్ అయిన ఎంపీల్లో ఎవరికైనా ప్రజలతో సంబంధం ఉందా? లేకుండా అంతటి పెద్ద పదవులు ఎలా [more]
అందరూ చంద్రబాబు నాయుడు వైపే వేలు చూపుతున్నారు. ఇప్పుడు బీజేపీలోకి జంప్ అయిన ఎంపీల్లో ఎవరికైనా ప్రజలతో సంబంధం ఉందా? లేకుండా అంతటి పెద్ద పదవులు ఎలా [more]

అందరూ చంద్రబాబు నాయుడు వైపే వేలు చూపుతున్నారు. ఇప్పుడు బీజేపీలోకి జంప్ అయిన ఎంపీల్లో ఎవరికైనా ప్రజలతో సంబంధం ఉందా? లేకుండా అంతటి పెద్ద పదవులు ఎలా కట్టబెట్టారు? అందుకే వెళ్లిపోయారంటూ అధినేతనే తప్పుపడుతున్నారు. అయితే ఇంత పెద్దపరిణామంపైనా రాజకీయంగా పెద్ద స్పందన రాకపోవడం విచిత్రంగా కనిపిస్తుంది. ప్రజలు అంతగా బండబారిపోయారా? లేకపోతే ఇది సర్వసాధారణమే కదా? అని అలవాటు పడిపోయారా? ఎవరేమనుకుంటే మనకేం? అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే కదా? అవసరాలు చూసుకుందామనుకుంటున్నారు మన ప్రజాప్రతినిధులు. ఏకంగా పార్టీ చట్టసభల పక్షాలనే అధికారపార్టీల్లో విలీనం చేసేస్తున్నారు. అయితే విచిత్రమేమిటంటే ఎక్కడ్నుంచీ పెద్దగా ప్రతిఘటన కనిపించడం లేదు. అటు పార్టీ కార్యకర్తలు, ఇటు ప్రజలు పట్టించుకోవడం లేదు. మీడియా విశ్లేషణలు మినహా పౌరసమాజంలో స్పందనే కరవైంది. అన్నిపార్టీలు అంతేకదా? అన్న ఉదాసీన, నిర్లిప్త భావమే ఇందుకు కారణం. లొసుగుల కారణంగా చట్టాలే నేతలకు చుట్టాలుగా రక్షణనిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ ఉదంతం నుంచి పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? అన్న చర్చ తాజాగా మొదలైంది.
చట్టమే చుట్టం ….
చట్టసభల సభ్యులు ఇష్టారాజ్యంగా పార్టీలు మారకుండా కట్టడి చేసేందుకు రాజ్యాంగంలోని పదోషెడ్యూల్ లో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తెచ్చారు. దీని ప్రకారం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరేని పాల్పడితే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది. కానీ సభ్యులు గంపగుత్తగా ఫిరాయిస్తే చట్టం చెల్లుబాటు కాదు. మూడింట రెండు వంతుల సభ్యులు తమ పార్టీ సభాపక్షాన్ని ఎందులోనైనా వీలీనం చేసుకునే అధికారాన్ని కలిగి ఉంటారు. అంటే పార్టీకి ఓటేసిన ప్రజలతో, టిక్కెట్లిచ్చిన పార్టీ అధిష్ఠానంతో సంబంధం ఉండదు. దీనిని ఆసరా చేసుకునే తెలంగాణలో టీఆర్ఎస్ ఇతర పార్టీల సభాపక్షాలను కలిపేసుకుంటోంది. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ సైతం అదే ఎత్తుగడలను ప్రోత్సహిస్తోంది. మూడింట రెండు వంతుల మంది తిరుగుబాటు చేయకపోతే ఫిరాయింపుల విషయాన్ని పరిష్కరించకుండా నాన్చడం ద్వారా అధికారపక్షాలు జాగ్రత్త వహిస్తున్నాయి. మొత్తమ్మీద ఎవరిమీదా వేటు పడకుండా అధికారపార్టీయే జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు వైసీపీకి చెందిన 23 మంది సభ్యుల విషయంలో అదే జరిగింది. రాజకీయాలు పూర్తిగా కార్పొరేటీకరణ చెందాయి. పెట్టుబడి సాధనాలుగా మారిపోయాయి. రాజకీయవ్యాపారవేత్తలు అధికారం చుట్టూ మూగుతున్నారు. ఆర్థిక అవసరాలకోసం వారినే పార్టీలు అందలం ఎక్కిస్తున్నాయి.పవర్ పాయింట్ మారగానే పారిశ్రామిక , వ్యాపార సంబంధాలున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పక్షంలోకి జంప్ అయిపోతున్నారు.
వరస వైఫల్యాలు…
రెండేళ్లుగా చంద్రబాబు నాయుడు ఎత్తుగడల్లో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే తిరిగి తెలుగు దేశం పార్టీని ఆయన పునరుజ్జీవింప చేయగలరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 40 శాతం ఓటు బ్యాంకు ఉందని కొందరు నాయకులు సర్ది చెప్పుకుంటున్నారు. కానీ అది శాశ్వతం కాదు. తెలంగాణలో 2014 ఎన్నికల్లో 15శాతం పైచిలుకు ఓటు బ్యాంకు తెచ్చుకున్న టీడీపీ 2019 వచ్చే నాటికి అడ్రస్ గల్లంతయ్యింది. అందువల్ల గాలివాటాన్ని బట్టే రాజకీయాలు నడుస్తుంటాయి. దానిని కనిపెట్టడంలో చంద్రబాబు నాయుడు విఫలమవుతున్నారని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా మోడీ కి బలమైన ఆదరణ ఉన్నప్పటికీ ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని ప్రస్తుతం పార్టీని విషమ స్థితికి తెచ్చారని విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పొలిటికల్ పొరపాట్లకు పార్టీ భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోంది. తెలంగాణలో కాంగ్రెసు పొత్తుతో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. తెలంగాణలో చంద్రబాబు ప్రచారంతో టీఆర్ఎస్ అదనపు లాభం పొందింది. కేంద్రంలో బీజేపీతో తెగతెంపులు చేసుకుని తప్పు చేశారని పార్టీలో కొందరు నాయకులు రగిలిపోతున్నారు. ఎన్డీఏ తో దూరం తో కేంద్రంలో ప్రాధాన్యం కోల్పోయింది టీడీపీ. పైపెచ్చు కాంగ్రెసును భుజాన వేసుకోవడంతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మళ్లీ నిర్ణయాల్లో స్థిరత్వాన్ని కనబరచకుండా పల్టీలు కొట్టారు. రివర్స్ గేర్ వేశారు చంద్రబాబు. అటు ఎన్డీఏ, యూపీఏలకు సమదూరం అంటూ తటస్థ వాదన మొదలు పెట్టారు.
సుజనా ముందస్తు బుకింగ్…
రాజ్యసభ ఎంపీలుగా టీడీపీ రెండేసి సార్లు అవకాశం కల్పించిన వ్యాపారవేత్తలు సుజనా చౌదరి, సీఎం రమేశ్ లు రాజకీయ వాతావరణాన్ని ముందుగానే పసిగట్టారు. బీజేపీతో విడిపోవడం తమకు ఇష్టం లేదని కమలనాథులకు ఏడాది క్రితమే చెప్పేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వస్తే మరోసారి పొత్తుకు వారి ద్వారా మార్గం సుగమం అవుతుందని బీజేపీ భావించింది. నిజానికి ఎన్నికల్లో పార్టీకి నిధుల సమకూర్చే బాధ్యత వారిదే. కానీ ఎన్నికల ముందు ఆదాయపన్ను, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల దాడులతో వారు పైసా బయటికి తీయలేదు. కానీ పెద్దగా కేసులు నమోదు కాలేదు. ఇది కేంద్రానికి, వారికి మధ్య ముందస్తుగా కుదిరిన అవగాహన పలితమనే అనుమానాలున్నాయి. అందువల్లనే తెలుగుదేశానికి చాకచక్యంగా నిధులు అందకుండా చేశారు. అధినేత వద్ద ఈ ఎంపీలు తామేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు కనిపించారు. దీంతో చంద్రబాబు నాయుడు ఆక్రోశంతో కేంద్రంపైనే విమర్శలు, ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయింది. దాంతో ఆ పార్టీ అవసరం ఎంపీలకు తీరిపోయింది. ముందస్తుగానే చెప్పినట్లు టీడీపీతో కలిసి నడవలేమంటూ బిచాణా ఎత్తేశారు. బీజేపీ సాదరంగా ఆహ్వానించింది. ఒక పార్టీలో ఉంటూ వేరే పార్టీకి ముందస్తుగా బుక్ చేసుకోవడం అంటే ఇదే. ఒకవేళ తెలుగుదేశం గెలిచి కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితి వచ్చి ఉంటే వీరే రాజ్యం చేసేవారు. పరాజయం పాలయినప్పటికీ తమ భవిష్యత్తుకు బెంగ లేకుండా చేసుకోగలిగారు.

