అప్పలరాజు లాక్కోలేక.. పీక్కోలేక?
బీసీలకు దేవుడుగా సర్దార్ గౌతు లచ్చన్నను చెప్పుకోవాలి. లచ్చన్న అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి ఎదిగి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే నాయకుడి స్థాయికి చేరుకున్నారు. [more]
బీసీలకు దేవుడుగా సర్దార్ గౌతు లచ్చన్నను చెప్పుకోవాలి. లచ్చన్న అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి ఎదిగి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే నాయకుడి స్థాయికి చేరుకున్నారు. [more]

బీసీలకు దేవుడుగా సర్దార్ గౌతు లచ్చన్నను చెప్పుకోవాలి. లచ్చన్న అత్యంత వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి ఎదిగి దేశ రాజకీయాలను ప్రభావితం చేసే నాయకుడి స్థాయికి చేరుకున్నారు. ఆయన ఎపుడూ అధికార పార్టీల విధానాలనే తెగనాడేవారు. ఇక లచ్చన్న జీవితం మొత్తం బడుగు బలహీనుల కోసం అంకితం చేసిన నేత. అటువంటి లచ్చన్న మరణించి చాలా కాలమే అయినప్పటికీ ఆయన్ని అంతా బీసీ నేతగా కొలుస్తారు. అయితే తాజాగా ఆయన్ని రాజకీయాల్లోకి తెచ్చి వాడుకోవడం ద్వారా టీడీపీ అసలైన ట్రంప్ కార్డునే బయటకు తీస్తోంది.
కబ్జాలపై కన్నెర్రతో…..
మంత్రి పదవి దక్కాక శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీదరి అప్పలరాజు ఒక రేంజిలో జోరు పెంచేశారు. ఆయన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుతో పాటు జిల్లాలో పెద్ద నాయకులనే టార్గెట్ చేశారు. భూ కబ్జాల విషయంలో జిల్లాలో మంత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అక్రమార్కుల భరతం పడతామని చెప్పడమే కాదు, గౌతు లచ్చన్న విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే టీడీపీ నేతలు పాల్పడిన భూ దందాలను కూడా వెలికి తీస్తామని హెచ్చరించారు. అయితే ఈ క్రమంలో ఆయన గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూడా అక్కడ తొలగిస్తామనడం మాత్రం టీడీపీకి అంది వచ్చిన అస్త్రమైంది. దాంతో గౌతు లచ్చన్న వంటి బీసీ నేతను అవమానిస్తారా అంటూ అచ్చెన్నాయుడుతో సహా టీడీపీ నేతలంతా మంత్రి అప్పలరాజు మీద హాట్ హాట్ విమర్శలు చేస్తున్నారు.
టీడీపీ మనిషిగానే….
గౌతు లచ్చన్న ఎపుడూ అధికార పార్టీలో చేరలేదు. ఆయన విపక్షంలోనే కొనసాగారు. ఆయన తనయుడు గౌతు శ్యామసుందర శివాజీ, మనవరాలు గౌతు శిరీష టీడీపీలో ఉన్నారు. దాంతో ఇపుడు లచ్చన్నను కూడా టీడీపీ మనిషిగా తమ వాడిగా చేసుకుని మరీ టీడీపీ చేస్తున్న రాజకీయ రచ్చ సిక్కోలులో బీసీల మధ్య చిచ్చు పెట్టేలా ఉంది అంటున్నారు. అచ్చెన్నాయుడు అయితే బీసీల మీద వైసీపీకి అసలు గౌరవం లేదని గట్టిగానే మాట్లాడారు. గౌతు లచ్చన్న వంటి బీసీ నేతల విగ్రహాల మీద చేయి వేస్తే ఏపీలో జగన్ సర్కార్ ఉండదు అన్నంతగా బిగ్ సౌండ్ చేశారు. దాంతో ఆక్రమణల కధ పక్కకు పోగా బీసీ కార్డుని వైసీపీ మీదకు ఎగదోసే సరికొత్త రాజకీయానికి టీడీపీ స్కెచ్ వేసింది.
డెఫెన్స్ లో మంత్రి ….
జగన్ ఇచ్చిన ప్రోత్సాహంతో దూకుడుగా సాగుతున్న మంత్రి అప్పలరాజు టీడీపీ కబ్జాలను వెలికితీసే క్రమంలో నోరు జారడంతో ఇపుడు గౌతు లచ్చన్న పేరిట బీసీ అస్త్రంతో టీడీపీ రెడీ అయింది. దీంతో మంత్రికి పొలిటికల్ మైలేజ్ మాట దేముడెరుగు బీసీలను వైసీపీకు వ్యతిరేకంగా చేస్తున్నారన్న నిందలు కూడా వస్తున్నాయి. మరో మంత్రిగా జిల్లాలో ఉన్న ధర్మాన కృష్ణ దాస్ అయితే ఈ విషయంలో మౌనమే పాటిస్తున్నారు. ఇంకో వైపు జిల్లాలో కబ్జాల బాగోతాలు వెనక్కు పోయాయి. ఇపుడు గౌతు లచ్చన్న ఆయుధంతో టీడీపీ ముందుకు వస్తూంటే లాక్కోలేక పీక్కోలేక మంత్రి గారు తెగ సతమతమవుతున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయి మంత్రి అయిన అప్పలరాజుకు ఇపుడు టీడీపీ చుక్కలు చూపిస్తోంది అంటున్నారు. దీని నుంచి మంత్రి ఎలా బయటపడతారో.

