ఈయన జగన్ పరువు తీస్తున్నారే
ఏదో గాలివాటంగా గెలిచారు కానీ వైసీపీకి అంత క్యాడరేదీ, లీడర్లేరీ అంటూ ఈ మధ్యనే టీడీపీ అధినాయకుడు చంద్రబాబు భారీ సెటైర్లు వేశారు. కాలం కలిసొచ్చి వైసీపీ [more]
ఏదో గాలివాటంగా గెలిచారు కానీ వైసీపీకి అంత క్యాడరేదీ, లీడర్లేరీ అంటూ ఈ మధ్యనే టీడీపీ అధినాయకుడు చంద్రబాబు భారీ సెటైర్లు వేశారు. కాలం కలిసొచ్చి వైసీపీ [more]

ఏదో గాలివాటంగా గెలిచారు కానీ వైసీపీకి అంత క్యాడరేదీ, లీడర్లేరీ అంటూ ఈ మధ్యనే టీడీపీ అధినాయకుడు చంద్రబాబు భారీ సెటైర్లు వేశారు. కాలం కలిసొచ్చి వైసీపీ గెలిచిందని జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అనేశారు. మిగిలిన పార్టీలు కూడా వైఎస్ జగన్ ఏదో చేస్తాడన్న మోజులో మాత్రమే గెలిపించారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే వైసీపీలో దమ్మున్న నాయకులు, సమర్ధులు లేరని చాలా పార్టీల అభిప్రాయంగా తోస్తుంది. అక్కసులో వారు ఆ మాటలు అన్నా అది నిజమేనని నిరూపించేందుకు వైఎస్ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తెగ ఆరాటపడిపోతున్నారు. లేకపోతే ఓ వైపు టీడీపీ అనుకూల మీడియా డేగ కళ్ళేసుకుని మరీ వైసీపీ తప్పులను ఎత్తి చూపాలని విశ్వప్రయత్నం చేస్తోంది. మరో వైపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు ఉన్నది లేనిదీ కలిపి బురద జల్లేస్తూ అభాసుపాలు చేస్తున్నారు. ఇది చాలదన్నట్లుగా తమకు తామే తప్పులు చేస్తూ జనానికి అడ్డంగా దొరికేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలను చూస్తూంటే పరమానందయ్య శిష్యులే గుర్తుకువస్తారు.
తెల్లకార్డు ఎమ్మెల్యే…
శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలాసా ఎమ్మెల్యే సీదరి అప్పలరాజు వైఎస్ జగన్ గాలిలో గెలిచేశారు. దానికి తోడు అక్కడ పలాస అల్లుడుగా ముద్రపడిన గౌతు శ్యామ సుందర శివాజీ అల్లుడు యార్లగడ్డ వెంకన్న చౌదరి ఆగడాలు భరించలేక కూడా జనం వైసీపీ వైపు మొగ్గుచూపారు. ఎన్నికల ఏడాదిలో వైసీపీలోకి దూకిన అప్పలరాజు చివరకు ఎమ్మెల్యే అయిపొయారు. అంతా బాగానే ఉందనుకుంటే ఆ ఎమ్మెల్యే గారు తనకు తెల్ల కార్డు ఉందని చెప్పుకోవడమే పెద్ద వింత. తన ఇంటికి నాణ్యమైన బియ్యం మూట వచ్చిందని చెప్పుకుంటూ ఈ ఎమ్మెల్యేగారు సోషల్ మీడియాలో పెట్టిన పొస్టింగ్ చివరికి వైసీపీ మెడకు ఉచ్చులా తగులుకుంది. పేదల బియ్యం బొక్కేస్తున్న ఎమ్మెల్యేలు అంటూ అపుడే టీడీపీ పూనకం వచ్చినట్లుగా విమర్శలు మొదలెట్టేసింది. గతంలో పచ్చ పార్టీ వారే రేషన్ బియ్యం తరలించుకుపోతున్నారని తెగ ప్రచారం చేసిన వైసీపీ ఇపుడు తమ సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన నిర్వాకంతో కుడితిలో పడ్డ ఎలక మాదిరిగా ఇరుక్కుపోయింది.
అతి ఉత్సాహంతో ఎసరు……
తమ పార్టీ నియమించిన గ్రామ వాలంటీర్లు సవ్యంగా పనిచేస్తున్నారని చెప్పుకోవడం ఒకటైతే, మంచి బియ్యం తాము పేదలకు పంపిణీ చేస్తున్నామని ప్రచారం చేసుకోవడం మరో ఎత్తుగా పలాస ఎమ్మెల్యే ఇలా ప్రచారానికి దిగిపోయారట. ఈ అతి ఉత్సాహంలో ఎమ్మెల్యేగా ఉన్న తనకు తెల్ల రేషన్ కార్డు ఉండడమేంటన్న చిన్న లాజిక్ ని ఆయన మిస్ అయ్యారు. అదే ఇపుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. తనకు 2011 నుంచి తెల్ల కార్డు ఉందని, ఇప్పటికి రెండు ప్రభుత్వాలు మారాయని, ఇంతవరకూ తనకు రేషన్ సరకు అందలేదని, తమ పాలనలో మాత్రమే సవ్యంగా సరుకు ఇంటికే వచ్చిందని కవరింగ్ చేసుకుంటూ పలాస ఎమ్మెల్యే పెట్టిన పొస్టింగులు మరింత కంపు చేస్తున్నాయి తప్ప అసలు కధను మార్చలేకపోయాయి. నిజానికి ఎమ్మెల్యే తమ పాలనలో బియ్యం సవ్యంగా పంపిణీ జరుగుతోందంటే ఏ పేదవారి ఇంటికైనా వెళ్ళి తనిఖీ చేసి ఫోటోలు వేయించుకుంటే అర్ధం పరమార్ధం ఉండేది. కోరి మరీ ఆయన ఇలా బుక్కు అయిపోవడమే కాకుండా వైసీపీని కూడా బుక్ చేసేశారని వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు.

