కఠిన నిర్ణయాలు తీసుకోవడం లేదెందుకో?
కరోనా వైరస్ సెకండ్ వేవ్ భారత్ ను కుదిపేస్తుంది. రోజుకు లక్షా యాభై వేలకుపైగానే కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజల [more]
కరోనా వైరస్ సెకండ్ వేవ్ భారత్ ను కుదిపేస్తుంది. రోజుకు లక్షా యాభై వేలకుపైగానే కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజల [more]

కరోనా వైరస్ సెకండ్ వేవ్ భారత్ ను కుదిపేస్తుంది. రోజుకు లక్షా యాభై వేలకుపైగానే కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజల మీదనే నెపం మోపుతుంది. ప్రజలు నిబంధనలను పాటిస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. నిజానికి తొలిసారి కరోనా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. అనేక మంది బాధలు పడినా ప్రజారోగ్యం కోసమేనని సరిపెట్టుకున్నారు.
తొలి దశను….
కరోనా వైరస్ తొలి దశను సమర్థవంతంగానే ఎదుర్కొన్నారు. ప్రధాని మోదీ సయితం ఇదే విషయాన్ని పదే పదే చెప్పుకున్నారు. తన ఎన్నికల ప్రచారంలోనూ కరోనాను భారత్ జయించగలిగిందని చెప్పుకున్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ ఉధృతంగా సాగుతున్నా లాక్ డౌన్ అనేది ఉండదని ప్రధాని మోదీ ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ లో కరోనా కట్టడి లాక్ డౌన్ లేకుండా సాధ్యమేనా? అన్న ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
రాష్ట్రాలపైనే…..
కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతను పూర్తిగా రాష్ట్రాలపైనే వదిలేసింది. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి చోట్ల రాత్రి పూట కర్ఫ్యూను విధించారు. అనేక రాష్ట్రాలు ఆ దిశగానే పయనిస్తున్నాయి. కానీ అత్యధిక మంది పేద, మధ్య తరగతి ఉన్న భారత్ లో రోజువారీ పనుల కోసం బయటకు రావాల్సిందే. లాక్ డౌన్ లేకపోతే కరోనా వ్యాప్తి మరింత ఎక్కువవుతుందని నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టీకా కూడా…?
కరోనా టీకా సయితం పూర్తి స్థాయిలో అందుబాటులో తేవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందంటున్నారు. ఇతర దేశాలకు ఎగుమతి చేయకుండా భారత్ కు సరిపడా నిల్వలను లేకుండా చేయడంలో మోదీ సర్కార్ విఫలమయిందని విపక్ష కాంగ్రెస్ విమర్శలకు దిగింది. ఇటు టీకా అందుబాటులో లేక, అటు లాక్ డౌన్ విధించకపోవడంతో సెకండ్ వేవ్ లో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రజల సహకారం కూడా అవసరమయినప్పటికీ, ప్రభుత్వం కూడా కరోనా కట్టడికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం.

