చంద్రబాబు ఓటమికి కారణాలు కోకొల్లలు
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఉన్న అధికార టీడీపీ అతి చిన్న పార్టీ స్థాయికి దిగజారి పోయింది. అంతేకాదు, గౌరవప్రదమైన స్ధానాలను కూడా పొందలేక [more]
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఉన్న అధికార టీడీపీ అతి చిన్న పార్టీ స్థాయికి దిగజారి పోయింది. అంతేకాదు, గౌరవప్రదమైన స్ధానాలను కూడా పొందలేక [more]
ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా ఉన్న అధికార టీడీపీ అతి చిన్న పార్టీ స్థాయికి దిగజారి పోయింది. అంతేకాదు, గౌరవప్రదమైన స్ధానాలను కూడా పొందలేక చతికిల పడింది. కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. నిజానికి రాజకీయాల్లో అధికారం ఇవాళ ఉంటుంది.. రేపు పోతుంది.. అనే మాటలు తరచుగా వినిపిస్తాయి. అయితే, వీటికి అతీతం గా తమ పాలన ఉందని, కనీసం 20 సంవత్సరాల పాటు తాము అధికారంలోనే ఉంటామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్నికలకు ముందు ఎవరూ ఊహించని విధంగా పింఛన్లు, సంక్షేమ కార్యక్రమాల స్థాయిని పెంచారు. అన్న క్యాంటీన్లను పెట్టారు. నిరుద్యోగ భృతి కల్పించారు.
అయితే, ఇవేవీ కూడా చంద్రబాబు నాయుడును ఆయన పార్టీని అధికారం విషయంలో కాపాడలేక పోయాయి. ఏనాడూ ఊహించని విధంగా కేవలం 23 మంది ఎమ్మెల్యేలు అది కూడా కనాకష్టంగా గెలుచుకున్నారు చంద్రబాబు. అయితే, ఓడిపోయిన పార్టీ ఎక్కడైనా సమీక్షలు చేసుకుని, తమ ఓటమికి గల కారణాలను రివ్యూ చేసుకుంటుంది. ఇకపై ఇలాంటి తప్పులు చేయ కుండా ఉంటామని చెబుతుంది. అయితే, ఇదే బాటలో నడిచిన చంద్రబాబు.. సమీక్ష చేసుకున్నారు. ఓటమికి గల కారణాలపై భూతద్దం పట్టుకుని వెతికారు. అయితే, అంతా అయిన తర్వాత బాబు చెప్పిన మాట.. పార్టీ ఓటమికి గల కారణాలు కనిపించలేదని..!
అయితే, ఈ విషయంపైనే రాష్ట్రంలోని మేధావులు నవ్వి పోతున్నారు. చంద్రబాబు నాయుడు పాలన ఏపీలో అంతరించడానికి గల కారణాలపై ఏ పదోతరగతి విద్యార్థికో పరీక్షపెడితే.. నూటికి నూరు మార్కులతో పాసయ్యేంతటి కారణాలు చెబుతాడని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. బాబు ఓటమికి ప్రధాన కారణాలను వారు విశ్లేషిస్తున్నారు. వాటిలో కీలకమైంది… జన్మభూమి కమిటీలు. గ్రామ, మండల స్థాయిలో ఈ కమిటీలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డాయి. ప్రజల ఓటు ద్వారా ఎన్నికైన సర్పంచ్‌లను కూడా పక్కన పెట్టి వీరు అధికారం చలాయించారు. ప్రతి పనికీ 'మాకు ఇంత'అని రేటు కట్టి మరీ వసూలు చేశారు.
టీడీపీ ఈ ఎన్నికల్లో ఓడిపోయిందంటే అందుకు సగం కారణం జన్మభూమి కమిటీలే అన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు కూడా ఓపెన్‌గానే చెపుతున్నారు. చాలా చోట్ల వీరు పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని విపక్ష పార్టీలకు చెందిన వారి నుంచి కమీషన్లు తీసుకుని వారికి పనులు చేసిపెట్టారు. ఇక, క్షత్రస్థాయిలో ఎమ్మెల్యేల ఆగడాలు.. వీటిని అరికట్టడంలోనూ చంద్రబాబు విఫలమయ్యారు. నేల విడిచి సాము చేశారు. అదేసమయంలో క్షేత్రస్థాయిలో టీడీపీకి అండదండగా ఉన్న కార్యకర్తలను సైతం పార్టీ అధినేత పట్టించుకోలేదు. పైపెచ్చు.. తనను పొడిగితే.. చాలు పదవులు ఖాయమనేలా వ్యవహరించారు. దీంతో పార్టీలో భజన బృందాలు పెరిగిపోయాయి.
అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడిని ఎంత ఘోరంగా తిట్టిపోస్తే.. అంత రికార్డు అనేంతగా వ్యవహరించారు. ఇక దాదాపు 50-60 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని బాబుకే తెలుసు. చివర్లో చాలా మంది సీనియర్లు బెదిరించి మరీ టిక్కెట్లు తీసుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ఒకప్పుడు క్రమశిక్షణకు కేరాఫ్‌గా ఉన్న టీడీపీలో ఈ సారి చంద్రబాబు నాయుడును మంత్రులు, ఎమ్మెల్యేలు లెక్క చేయని పరిస్థితి స్పష్టంగా కనపడింది. వెరసి ఇవన్నీ కూడా చంద్రబాబు మైనస్లుగా మారిపోయాయి. వీటిపై సమీక్షలు చేయడం మానేసిన చంద్రబాబు కారణాలు కనిపించడం లేదని ముక్తసరిగా ప్రకటించి మౌనం వహించడంపై టీడీపీ శ్రేణులే కలవరపడుతున్నాయి.