అనుకున్నట్లే అయింది. అసలు సూత్రధారిని వదిలేసి పాత్రధారిపై పడటం పవన్ కల్యాణ్ కు అలవాటే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు కారణమైన బీజేపీని వదిలేసి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీీపీ ప్రభుత్వానికి ఆయన డెడ్ లైన్ లు విధించడం చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ తొలి నుంచి అంతే. అందుకే ఆయన మాటలను ఎవరూ విశ్వసించనది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు మద్దతిచ్చేందుకు పవన్ కల్యాణ్ విశాఖ వచ్చారు.
బీజేపీని వదిలేసి…
వచ్చిన సారు… ప్రయివేటీకరణకు కారణమైన కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు చేయాలి. కానీ బీజేపీని పన్నెత్తు మాట అనలేకపోయారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైసీపీ నేతలు ఏం చేస్తున్నారో చెప్పాలని పవన్ కల్యాణ్ సారు డిమాండ్ చేశారు. ప్రయివేటీకరణ జరగకుండా ఎలా ఆపుతారో చెప్పాలని ఆయన వైసీపీ నేతలనే కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను జరగకుండా ఆపాల్సింది రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వంపై….
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించడం ఖాయమని కేంద్ర మంత్రులు పదే పదే చెబుతున్నారు. పవన్ కల్యాణ్ కు నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రేముంటే వారిని కడిగేయాల్సి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏమీ తెలియని అమాయకపుదన్నట్లు పవన్ కల్యాణ్ మాటలున్నాయి. కేంద్రానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వార్నింగ్ ఇవ్వాల్సిన పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం పట్ల విమర్శలు విన్పిస్తున్నాయి.
డెడ్ లైన్ ను విధించడం….
దీంతో పాటు వారం రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లేకపోతే తాను కార్యాచరణను ప్రకటిస్తానని ఎప్పటిలాగే పవన్ కల్యాణ్ ప్లాంట్ కథను ముగించి వెళ్లిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులు కావాలని వైసీపీ ప్రభుత్వం అడిగినా కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదన్న విషయాన్ని పవన్ కల్యాణ్ విస్మరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిలపాల్సింది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పి చేతులు దులుపుకుని పవన్ కల్యాణ్ వెళ్లిపోయారు. నిజమే.. పవన్ కు ఇంతకు మించి చేతనవుతుందని అనుకోలేం.