రణరంగం లోకి లోకేష్..మారిన ముఖచిత్రం
చంద్రబాబు నాయుడిని, గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ నిర్ణయాలు, విమర్శలు గుప్పిస్తున్న వైసీపీని అడ్డుకునేంత సాహసం టీడీపీ చేయలేకపోతోంది. వైసీపీ కి లభించిన భారీ మెజార్టీ [more]
చంద్రబాబు నాయుడిని, గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ నిర్ణయాలు, విమర్శలు గుప్పిస్తున్న వైసీపీని అడ్డుకునేంత సాహసం టీడీపీ చేయలేకపోతోంది. వైసీపీ కి లభించిన భారీ మెజార్టీ [more]

చంద్రబాబు నాయుడిని, గత తెలుగుదేశం ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ నిర్ణయాలు, విమర్శలు గుప్పిస్తున్న వైసీపీని అడ్డుకునేంత సాహసం టీడీపీ చేయలేకపోతోంది. వైసీపీ కి లభించిన భారీ మెజార్టీ ఒక కారణం. కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల్లో లభిస్తున్న మద్దతు మరొక కారణం. గతంలో తీసుకున్న నిర్ణయాల్లో లోపాలు, అవకతవకలు కారణంగా తీవ్రంగా ప్రతివిమర్శలు చేయడం సాధ్యం కావడం లేదు. ఫలితంగా గత ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి జగన్ సహా మంత్రులు, పార్లమెంటు సభ్యులు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. కానీ టీడీపీ నుంచి ప్రతిఘటన పేలవంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆనాటి ప్రభుత్వ విధానాలను వెనకేసుకొస్తూ తండ్రికి రక్షగా ట్విట్టర్ వార్ ప్రారంభించారు. దీనిపై వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది? లోకేష్ ఇచ్చిన సంకేతాలను అందిపుచ్చుకుని తెలుగుదేశం నేతలు ఇప్పటికైనా ఎదురుదాడికి దిగుతారా? వేచి చూడాలి. అయితే నారా లోకేష్ పూనిక వహించడంతో రాష్ట్ర రాజకీయముఖచిత్రం క్రమేపీ వేడెక్కుతోంది.
రంగంలో లోకేష్…
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భారీగా అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి జగన్ విశ్వసిస్తున్నారు. అందుకే దానిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటూ డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించారు. రూ. 2600 కోట్ల పైచిలుకు ఈ రకంగా పక్కదారి పట్టిందనేది వైసీపీ అభియోగం. దీనిపై తొలిసారిగా పక్కా వివరాలతో ప్రతిస్పందించారు నారా లోకేష్. వైఎస్సార్ హయాంలో సోలార్ విద్యుత్తు యూనిట్ రూ.14కి కొన్నారు. టీడీపీ హయాంలో సోలార్ విద్యుత్తు యూనిట్ రూ.2.70కే కొన్నామంటూ లోకేశ్ లెక్కలు తీశారు. దీనిని బట్టి ఎవరు మహా మేత? ఎవరు దార్శిక నేత? తేల్చాలంటూ ప్రశ్నాస్త్రం సంధించారు. మీ నాయనగారి నిర్వాకంతో డిస్కంలకు రూ.8 వేల కోట్ల నష్టం వాటిల్లిందంటూ నేరుగా జగన్ పైనే బాణం ఎక్కుపెట్టారు. ‘పోలవరంపై టీడీపీ హయాం అంచనాలకే కేంద్రం ఓకే చేసింది. అందువల్ల వైసీపీ ఇంతవరకూ పోలవరం లో అవినీతి పేరిట చేస్తున్న ప్రచారం అర్థరహితమంటూ తిప్పికొట్టారు. మీ బాబు, మా బాబుపై 26 కమిటీలు వేశారు. అవినీతి ముద్ర వేయాలని అడ్డదారులు తొక్కారు. చివరికి ఆయన తరం కాలేదు, మీతరమూ కాదు’అంటూ లోకేష్ ఘాటుగానే విమర్శలు చేశారు. పైపెచ్చు శాంతిభద్రతల అంశాన్ని ప్రజల్లో చర్చకు పెట్టారు. ఏపీలో బిహార్ తరహా పాలన సాగుతోంది. ఆరుగురు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారు. 130 మందిపై దాడులు చేశారని ధ్వజమెత్తారు.
వారసునికి సవాల్….
తెలుగుదేశం పార్టీకి వారసుడైన నారా లోకేష్ పై టీడీపీలో పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం కావడం లేదు. కష్టించే తత్వం విషయంలో తండ్రికి దీటుగా నిలవలేకపోతున్నారు. అదే సమయంలో జనాకర్షణ శక్తి తక్కువగా ఉండటంతో ప్రజలను ఆకట్టుకోలేకపోతున్నారు. కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ నింపలేకపోతున్నారు. 2014నుంచి తాజా ఎన్నికలవరకూ లోకేశ్ నెంబర్ టు గా చక్రం తిప్పారు. అధినేత మద్దతు ఉండటంతో ఎవరూ ప్రశ్నించలేకపోయారు. కానీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. దీంతో అసమ్మతి గళాలు పెరిగాయి. పార్టీ ఓటమికి నారా లోకేష్ కూడా ఒక కారణమని ఒక వర్గం వాదిస్తోంది. దాంతోపాటు చంద్రబాబు నాయుడి కాలం టీడీపీ నేతలే ఇప్పటికీ పార్టీలో జిల్లాలలో పెత్తనం చేస్తున్నారు. కొత్తతరం నాయకులకు తగిన ప్రాధాన్యం లభించడం లేదు. దానినుంచి బయటపడి న్యూ జనరేషన్ తో కనెక్టు కావాల్సి ఉంది. లేకపోతే పార్టీ భవిష్యత్తు అంధకార బంధురమవుతుంది. అందువల్ల తక్షణం నూతన నాయకత్వాన్ని నిర్మించుకోవాలి. అది కూడా లోకేశ్ నాయకత్వంలో కాకుండా బీసీ లీడర్షిప్ ను పైకి తీసుకురావాలనే డిమాండ్లు వినవస్తున్నాయి. ఈ నాయకత్వ సమస్య చంద్రబాబు నాయుడికి కొత్త తలనొప్పిగా మారే ప్రమాదం కనిపిస్తోంది.
పోలవరం క్రెడిట్ కోసం…
తెలుగుదేశం పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసి 2024 నాటికి అన్నిస్థానాల్లో పోటీ చేయలేనంత బలహీనపర్చాలనేది వైసీపీ లక్ష్యం. అందుకే గతం నుంచి కొనసాగుతున్న పనుల క్రెడిట్ ను కూడా టీడీపీ ఖాతాలో పడకుండా జాగ్రత్త పడుతోంది. పోలవరం ప్రాజెక్టులో పెంచిన అంచనాలకు కేంద్రం ఆమోదించింది. కేవలం తెలుగుదేశం అవినీతికి పాల్పడటానికే అంచనాలు పెంచేసిందని వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. అందువల్లనే కేంద్రం ఆమోదించడం లేదని కూడా విమర్శించింది. ఇప్పుడు దానినే అస్త్రంగా చేసుకుంటూ టీడీపీ తమ నిజాయతీని నిరూపించుకోవాలని చూస్తోంది. పెంచిన ప్రతిపాదనలు తమ హయాంలోనే రూపుదిద్దుకున్నాయి కాబట్టి ఎటువంటి అవకతవకలు, తేడాలు లేవని కేంద్రప్రభుత్వమే ఆమోదముద్ర వేసిందని టీడీపీ చెబుతోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ విజ్ణప్తి మేరకే దీనిని ప్రధాని ఆమోదించారని విజయసాయిరెడ్డి వాదన. గడచిన సంవత్సరం జనవరిలో తాము ప్రతిపాదన పంపితే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమోదం లభించిందని టీడీపీ చెబుతోంది. అప్పటికింకా ప్రభుత్వమే మారలేదు కాబట్టి ఈ క్రెడిట్ తమదేనంటోంది. తన తండ్రి కష్టానికి ఫలితమని నారా లోకేష్ డబ్బా కొట్టుకోవడం ఆపాలంటూ విజయ సాయిరెడ్డి పేర్కొంటున్నారు. మొత్తమ్మీద ట్విట్టర్ వార్ తో వేడి పుట్టిస్తున్నారు లోకేశ్, విజయసాయిలు. రెండు పార్టీల్లో నెంబర్ టు లు.

