బావమరిది దూరం.. దూరం ?
తెలుగుదేశం పార్టీ ఎవరిదీ అంటే నందమూరి వారిది అని గతాన్ని తెలిసిన వారు అంటారు. వాస్తవాలను గ్రహించిన వారు, వర్తమానంలో ఉన్న వారు అది మాత్రం నారా [more]
తెలుగుదేశం పార్టీ ఎవరిదీ అంటే నందమూరి వారిది అని గతాన్ని తెలిసిన వారు అంటారు. వాస్తవాలను గ్రహించిన వారు, వర్తమానంలో ఉన్న వారు అది మాత్రం నారా [more]

తెలుగుదేశం పార్టీ ఎవరిదీ అంటే నందమూరి వారిది అని గతాన్ని తెలిసిన వారు అంటారు. వాస్తవాలను గ్రహించిన వారు, వర్తమానంలో ఉన్న వారు అది మాత్రం నారా వారిది అని సునాయాసంగా చెప్పేస్తారు. అందరి సంగతి ఎలా ఉన్నా అన్న గారి కుమారులు ఇద్దరు క్రిష్ణులు అయితే టీడీపీ మాదేనని గట్టిగానే అనుకున్నారు. అందులో అగ్ర తాంబూలం దివంగత హరిక్రిష్ణకే ఇవ్వాలి. ఆయన పార్టీ కోసం పోరాటం అనుకుని ఏకంగా తండ్రినే ఎదిరించి బావ బాబు పక్కన నిలబడ్డారు. ఇక మరో క్రిష్ణుడు బాలయ్య సైతం వెన్నుపోటు ఎపిసోడ్ లో చంద్రబాబుకే ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. వీరందరికీ పార్టీ తమది అన్న ఆలోచన ఉండడం వల్లనే బాబుకు మద్దతుగా నిలిచారు. అయితే హరిక్రిష్ణ చంద్రబాబు నాయకత్వంలోని పార్టీలో ఉండలేక, వెళ్ళలేక జీవిత పర్యంతం నానా ఇబ్బందులు పడ్డారు. చివరికి టీడీపీ మనిషి అని సంత్రుప్తిగా అనిపించుకోకుండనే తనువు చాలించారు. బాలక్రిష్ణ అయితే తన కుమార్తెను సైతం మేనల్లుడు లోకేష్ కి ఇచ్చి మరింత దగ్గర అయ్యారు. చంద్రబాబు వరకూ ఓకే అనుకున్నా ఆ తరువాత అయినా తనకు నాయకత్వం దక్కుతుందని బాలక్రిష్ణ అప్పట్లో అనుకునేవారు. ఇక మేనల్లుడినే భావి నాయకుడుగా ఫోకస్ చేయడం మొదలెట్టాక పార్టీలో జోరు తగ్గించేశారు.
ముఖం చూపించడంలేదుగా :
ఓ వైపు టీడీపీ ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే వారిలో 22 మంది మిగిలారు. ఇందులో ఎంతమంది దాగుడుమూతలు ఆడుతున్నారో బాబుకే తెలియదు. ఈ లోగా గత ఆరు నెలల కాలంలో పార్టీని భుజాన వేసుకుని మరీ చంద్రబాబు రాష్ట్రంలో తిరుగుతున్నారు. మరో వైపు ఇసుక దీక్షలు, అమరావతి యాత్రలు అంటూ వైసీపీ మీద దాడి చేస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పార్టీ ఎమ్మెల్యేలు పెద్దగా కనిపించకపోవడం ఒక మైనస్ అయితే సొంత బావమరిది బాలక్రిష్ణ సీన్ లోకి రాకపోవడమే అసలైన చర్చ. బాలయ్య ఎన్నికలు అయి ఫలితాలు వచ్చాక రెండు నెలల పాటు ఎందుకో సినిమాల వైపు చూడలేదు. కానీ ఇప్పుడు వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. పార్టీతో పనేంటి అన్నట్లుగా బాలయ్య వైఖరి ఉందని అంటున్నారు. టీడీపీ ఉనికినే సవాల్ చేసేలా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హాట్ కామెంట్స్ చేసినా కూడా ఎమ్మెల్యేగా ఉన్న బాలక్రిష్ణ నుంచి కౌంటర్ లేదు. నందమూరి వంశం నుంచి జయక్రిష్ణ కుమారుడు స్పందించారు కానీ బావమరిది నోట పలుకే బంగారమా అన్నట్లుగా ఉంది.
విసుగొచ్చేసిందా… :
ఓ విధంగా చెప్పాలంటే బాలయ్య రాజకీయ జీవితం ఏమంతా బాగా లేదు. 2014 ఎన్నికల్లో రంగ ప్రవేశం చేసి హిందూపురం నుంచి గెలిచిన బాలయ్యని మంత్రిగా కూడా బాబు తీసుకోలేదు. అదే సమయంలో ఎమ్మెల్యే కూడా కాని లోకేష్ ని దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి మరీ అయిదు కీలకమైన శాఖలను బాబు అప్పగించారు. ఇక పార్టీలోనైనా బాలయ్యకు ప్రాధ్యాన్యత ఉందా అంటే నిరాశే మిగులుతుంది. లోకేష్ ని జాతీయ ప్రధాన కార్య్దర్శిగా చేసిన బాబు హరిక్రిష్ణ చనిపోతే ఖాళీ అయిన పొలిటి బ్యూరో సీటుని కూడా బాలక్రిష్ణ కు ఇవ్వలేదు. ఇక పార్టీ పరాజయం తరువాత తాను యాక్టివ్ అవుదామనే సినిమాలను అప్పట్లో బాలయ్య ఆపుకున్నారని ప్రచారంలో ఉంది. అయినా బాబు నుంచి సానుకూల స్పందన లేకపోవడంతోనే ఆయన మళ్ళీ ముఖానికి రంగు వేసుకున్నారని అంటారు. మొత్తం మీద చూస్తే బాలయ్య సినిమాల జోరు పెరిగింది. రాజకీయం వైపు చూపు సారించడంలేదు. మరి ఈ ఎమ్మెల్యే గిరితోనే ఆయన పొలిటికల్ కెరీర్ కి ఫుల్ స్టాప్ పెడతారా అన్నది చూడాలి.

