ఆ ఇద్దరికీ మేయర్ టిక్కెట్ పై హామీలు ఇచ్చారట
విశాఖ అర్బన్ జిల్లాలో టీడీపీ బలంగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ మధ్య పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేస్తే టీడీపీ పూర్తి సహకారం అందించింది. [more]
విశాఖ అర్బన్ జిల్లాలో టీడీపీ బలంగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ మధ్య పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేస్తే టీడీపీ పూర్తి సహకారం అందించింది. [more]

విశాఖ అర్బన్ జిల్లాలో టీడీపీ బలంగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే ఈ మధ్య పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ చేస్తే టీడీపీ పూర్తి సహకారం అందించింది. దాంతో ఇసుక వేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. ఆ విధంగా చూసుకుంటే క్షేత్రస్థాయిలో టీడీపీ బలం ఇప్పటికీ చెక్కుచెదరలేదనే చెప్పాలి. ఇక వైసీపీ విషయానికి వస్తే పార్టీని అభిమానించే క్యాడర్ ఉంది. కానీ వారిని ఉత్తేజపరచే నాయకత్వం మాత్రం ఇప్పటికీ లేదు. టీడీపీలో గట్టి నాయకుల పేర్లు నాలుగైదు చెప్పవచ్చు కానీ వైసీపీలో మాత్రం చెప్పాలంటే కొంచెం ఆలోచించుకోవాలి. ఇక జనాలకు తెలిసిన నాయకులు, మంచి వాగ్దాటి కలిగిన నేతలు కూడా వైసీపీలో లేరని చెప్పాలి. ఇది ఆ పార్టీకి పెద్ద మైనస్ గా ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే జీవీఎంసీ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రధమార్ధంలో నిర్వహిస్తారని అంటున్నారు. అప్పటికి పార్టీని పటిష్టం చేసే పనిని ఇంచార్జి మంత్రి కురసాల కన్నబాబుకు అప్పగించారు. ఆయన పార్టీ గురించి తెలుసుకుంటూనే నాయకుల పనితీరును కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు.
ఇద్దరికీ హామీలు :
మేయర్ సీటు కోసం ఇద్దరు నేతల మధ్య పోటీ ఉందని అంటున్నారు. వారిద్దరూ ఎన్నికల్లో ఓటమి పాలు అయిన వారే. 2014 ఎన్నికల ముందు వైసీపీ నగర అధ్యక్షుడిగా పనిచేసిన మళ్ళ విజయప్రసాద్ కి అప్పట్లో జగన్ మేయర్ సీటు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి రాలేదు, మేయర్ ఎన్నికలను టీడీపీ కూడా నిర్వహించలేదు. దాంతో 2019 ఎన్నికల్లో ఆయనకు విశాఖ వెస్ట్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, కానీ ఆయన మాత్రం పరాజయం పాలు అయ్యారు. అది కూడా ముప్పయి వేల ఓట్ల తేడాతో. దాంతో జగన్ సైతం ఆయన్ని దూరం పెట్టారని టాక్. అయితే ఇంచార్జి మంత్రి ద్వారా తనకు మేయర్ టికెట్ హామీ ఉందని చెప్పి మళ్ళ గట్టిగా ప్రయత్నం చేసుకుంటున్నారుట. గవర సామాజికవర్గానికి చేందిన మళ్ళ ఆ కోటాలో తనకు మేయర్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.
నాకూ టికెట్ కావాలి :
ఇక విశాఖ తూర్పు నుంచి 2019 ఎన్నికల్లో చివరి నిముషంలో పోటీ నుంచి తప్పుకున్న వంశీ క్రిష్ణ శ్రీనివాస్ కూడా మేయర్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆయన తరచూ అమరావతి వెళ్ళి వైసీపీ పెద్దలను కలుస్తున్నారు. అదే సమయంలో ఇంచార్జి మంత్రిగా కన్నబాబు పేరు ప్రకటించగానే ఆయన్ని అమరావతిలోనే కలసి వచ్చి మేయర్ టికెట్ ఇక నాదేనని చెప్పుకుంటున్నారు. వంశీ విశాఖ నగరంలో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ సామాజికవర్గానికి వైసీపీలో జిల్లా తరఫున ప్రభుత్వ పదవుల్లో ప్రాతినిధ్యంలేదు. అదే గవర సామాజికవర్గానికి చెందిన సత్యవతి అనకాపల్లి ఎంపీగా ఉన్నారు. దాంతో విశాఖలో పెద్ద సామాజికవర్గంగా ఉన్న తమకు న్యాయం చేయాలని ఆ వర్గీయులు కోరుతున్నారు. ఈ మధ్య సొంత సామాజికవర్గం సమావేశంలో పాలు పంచుకోవడానికి విశాఖ వచ్చిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ద్వారా కూడా వారు లాబీయింగ్ చేస్తున్నారు. మరి జగన్ మనసులో ఎవరు ఉన్నారో, విజయసాయిరెడ్డి ఎవరి పేరుని బయటకు తెస్తారో అన్నది వైసీపీలో చర్చగా ఉంది. మొత్తానికి జగన్ మాట నిలబెట్టుకుంటారని, తమకు టికెట్ ఇస్తారని ఈ ఇద్దరు కీలక నేతలు మాత్రం కుర్చీ మీద రుమాల్ వేసేశారు. చూడాలి మరి.

