దుష్మన్ ను ఇలా అన్నారేంటి?
జగన్ అంటే ఎందుకో పవన్ కల్యాణ్ కి మొదటి నుంచి సదభిప్రాయం లేదని అంటారు. ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తూనే యువరాజ్యం నేతగా వేదికలు ఎక్కి పంచెలూడగొడతాను [more]
జగన్ అంటే ఎందుకో పవన్ కల్యాణ్ కి మొదటి నుంచి సదభిప్రాయం లేదని అంటారు. ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తూనే యువరాజ్యం నేతగా వేదికలు ఎక్కి పంచెలూడగొడతాను [more]

జగన్ అంటే ఎందుకో పవన్ కల్యాణ్ కి మొదటి నుంచి సదభిప్రాయం లేదని అంటారు. ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తూనే యువరాజ్యం నేతగా వేదికలు ఎక్కి పంచెలూడగొడతాను అంటూ డైరెక్ట్ గా వైఎస్సార్ మీదనే హాట్ కామెంట్స్ చేశారు. ఆ తరువాత నుంచి నేటి వరకూ వైఎస్సార్ ఫ్యామిలీనే పవన్ కల్యాణ్ టార్గెట్ చేస్తూ వస్తున్నారని అంతా అనుకునేలా ఆయన పోకడలు ఉన్నాయి. ఇక వైసీపీ నేతలైతే ఎపుడూ మమ్మల్నే నిలదీస్తావు, బాబు పాలనలో ఏమీ కనబడలేదా, ఇపుడేనా ప్రశ్నించాలనిపించిందని రివర్స్ అటాక్ చేయడమూ జరుగుతోంది. పవన్ కల్యాణ్ బాబుకు ఎంత దోస్తో ఎవరికీ తెలియకపోయినా జగన్ మాత్రం దుష్మన్ అనేలా ఆయన రాజకీయ వ్యవహార శైలి సాగుతూ వచ్చింది. అలాటి పవన్ హఠాత్తుగా జగన్ ని మెచ్చుకున్నారు అంటే అది వింతలోకెల్లా వింతే మరి.
అభినందనలు…
కర్నూలు జిల్లాలో పదవ తరగతి చదివే మైనర్ బాలిక సుగాలి ప్రీతి ఆత్మహత్య కేసుని జగన్ సీబీఐ కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని పవన్ కల్యాణ్ హర్షించారు, అభినందించారు. ప్రత్యేకంగా ఆయన ఒక ప్రకటన చేసి మరీ జగన్ నిర్ణయం భేష్ అన్నారు. ఇది నిజంగా పవన్ లో వచ్చిన కొత్త మార్పు గానే చూడాలి. ఎందుకంటే జగన్ ఏ మంచి చేసినా కనీసం పట్టించుకోని పవన్ కల్యాణ్ చిన్న తప్పు జరిగితే మాత్రం చీల్చి చెండాడుతారన్న పేరు తెచ్చుకున్నారు. అందుకే మంత్రులు సైతం మా సర్కార్ లో మంచి కనిపించలేదా పవన్ కల్యాణ్ అంటూ పదే పదే విమర్శలు చేశారు కూడా. మరి ఇన్నాళ్ళకు పవన్ లో ఆ మంచిని చూసే నైజం కనిపించడం అంటే గొప్ప విషయమే.
ఇలాగే ఉండాలి ….
నిజానికి గతంలో అధికార ప్రతిపక్షాల నడుమ ఇలాగే మంచి వాతావరణం ఉండేది. ప్రభుత్వం మంచి చేస్తే ఏ రకమైన భేషజం లేకుండా బాగా చేశారు అని విపక్షం చెప్పేది. అదే సమయంలో చెడ్డ చేస్తే గట్టిగానూ వారించేది, వాదించేది. దాంతో విపక్షం క్రెడిబిలిటీ కూడా జనంలో పెరిగేది. వారు చెడ్డ అని చెప్పినదాన్ని ప్రభుత్వం కూడా ఒకటికి పదిమార్లు ఆలోచన చేసేది. రాను రానూ చెడ్డనే జనంలో పెట్టడం మంచి జరిగినా కాదనడం వంటి వితండవాదం బయల్దేరింది. ముఖ్యంగా ఏపీలో వైఎస్సార్ ఫ్యామిలీ, చంద్రబాబుల మధ్య రాజకీయ సమరం కొన్ని దశాబ్దాలుగా రాజుకుని సాగుతున్న వేళ వారు అధికార విపక్షాల కంటే బద్ద శత్రువులు అన్న మాటే ముందుకు వస్తోంది.
భవిష్యత్తుకేనా..?
పవన్ కల్యాణ్ రాజకీయంగా జగన్ పై చేస్తున్న విమర్శలను జనం కూడా ఇపుడు పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. ఆ మాటకు వస్తే చంద్రబాబు జగన్ ని ఏమి అన్నా కూడా ఆయన అలాగే అంటాడు అని జనం అనుకుంటోంది. దాంతో ప్రభుత్వం తప్పులు చేసినా కూడా జనంలోకి రాని పరిస్థితి ఉంటోంది. నిజానికి అధికార వికేంద్రీకరణ బిల్లు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని విపక్షంగా టీడీపీ చెప్పడం వేరు, శాసనమండలిలో రాజకీయ ప్రహసంగా చేసిన తీరు వేరుగా ఉంది. దాంతో జనాలకు టీడీపీ మంచి చెప్పిందా లేదా అన్నది ఇప్పటికీ అర్ధం కాలేదు. పవన్ కల్యాణ్ సైతం కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా అదే కక్షలు, కావేశపూరితమైన రెండు పార్టీల ఉచ్చులోకి పోతున్నాడని అంతా విశ్లేషిస్తున్నారు. పవన్ అలా కాకుండా మంచిని మంచిగా, చెడుని చెడుగా విడమరచి చెబితేనే ఆయన రాజకీయానికీ ఒక విలువ ఉంటుంది. రేపటి రోజున జనం కూడా హర్షిస్తారు. క్రెడిబిలిటీ పెరిగి భావికి మేలు జరుగుతుంది. మరి పవన్ ఆ దిశగా చేస్తున్న ఆలోచనలకు ఇది మొదటి అడుగు అని భావించాలేమో.

