బాబు రాంగ్ ట్రాక్‌లో బాలయోగి వారసుడు
రాజకీయాల్లో ఎవరిని ఎక్కడ వాడుకుంటే.. మంచిదో అదును చూసి ముందుకు సాగడం అనేది కీలకం. ఎక్కడ ఎలాంటి తప్పు జరిగినా.. సదరు నాయకుడికి, పార్టీకి కూడా ఎలాంటి [more]
రాజకీయాల్లో ఎవరిని ఎక్కడ వాడుకుంటే.. మంచిదో అదును చూసి ముందుకు సాగడం అనేది కీలకం. ఎక్కడ ఎలాంటి తప్పు జరిగినా.. సదరు నాయకుడికి, పార్టీకి కూడా ఎలాంటి [more]

రాజకీయాల్లో ఎవరిని ఎక్కడ వాడుకుంటే.. మంచిదో అదును చూసి ముందుకు సాగడం అనేది కీలకం. ఎక్కడ ఎలాంటి తప్పు జరిగినా.. సదరు నాయకుడికి, పార్టీకి కూడా ఎలాంటి ప్రయోజనం ఉండే అవకాశం ఉండదు. ఇది కాలహరణమే తప్ప.. పార్టీకి, నాయకుడికి కూడా కలిసి వచ్చేది కాదు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి టీడీపీలో చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మాజీ ఎంపీ, మాజీ లోక్‌సభ స్పీకర్ దివంగత గంటి మోహనచంద్ర బాలయోగి..కుమారుడు గంటి హరీష్ చంద్ర మాధుర్‌ను .. టీడీపీ గత ఏడాది ఎన్నికల్లో తెరమీదికి తెచ్చింది.
పార్టీ కార్యాలయంలోనే…..
సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత ఉద్యోగిగా ఉన్న హరీష్ వచ్చీరావడంతోనే అమలాపురం ఎంపీ టికెట్ ఇచ్చింది. అయితే. జగన్ సునామీలో ఆయన ఓటమి పాలయ్యారు. ఎన్నికలకు ముందు వరకు హరీష్‌కు రాజకీయాల్లోకి వచ్చేందుకు అంత ఆసక్తిలేదు. అయితే లోకేష్, చంద్రబాబు పట్టుబట్టి మరీ ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకువచ్చారు. అయితే, ఓటమి తర్వాత.. ఆయనను కేవలం సర్వేలకు, పార్టీ కార్యాలయ వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేశారు. ఆయన్ను పార్టీ ఆఫీస్‌లోనే ఎక్కువ సమయం ఉండాలన్న ఆదేశాలు బాబు నుంచి వస్తున్నాయట. ఇది హరీష్ పొలిటికల్ కెరీర్‌కు రాంగ్ ట్రాక్ లాంటిదే అన్న విశ్లేషణలు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.
అమలాపురం పార్లమెంటు పరిధిలో…..
ఇది అటు పార్టీకి, ఇటు హరీష్‌కు కూడా ఎలాంటి ప్రయోజనం కలిగించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నియోజకవర్గం పరిధిలో గత ఏడాది ఎన్నికల్లో హరీష్ ఓడిపోయారు. అదే సమయంలో రాజోలు వంటి కీలక నియోజకవర్గంలో జనసేన ప్రభావంతో అక్కడ రాపాక విజయం సాధించారు. ఇక, టీ గన్నవరంలో ఓడిపోయిన.. నేలపూడి స్టాలిన్ బాబు సస్పెండ్ అయి బయటకు వచ్చారు.
సీనియర్ నేతలు దూరంగా….
ఇక, రామచంద్రపురంలో ఓడిపోయిన తోట త్రిమూర్తులు.. వైసీపీ పంచన చేరిపోయారు. దీంతో ఇక్కడ టీడీపీకి అభ్యర్థే లేకుండా పోయాడు. కొత్తపేటలో .. బండారు సత్యనారాయణమూర్తి.. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇలా ఉన్న అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో టీడీపీ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇలాంటి స్థితిలో హరీష్ లాంటి యువకుడు, ఉత్సాహవంతుడు అయిన నేతను స్థానికంగా ఉంచితే అది ఖచ్చితంగా పార్టీకి ప్లస్ అవుతుంది.
పబ్లిక్ లో ఉండేలా…..
ఏపీలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు మినహా యువ నాయకుల్లో ఆ స్థాయిలో వాయిస్ వినిపించే నేతలు లేరు. బాలయోగి వారసుడిగా మంచి ఛరిష్మా ఉన్న హరీష్‌ను పార్టీ ఆఫీసుల్లో కంటే పబ్లిక్‌లో ఉండేలా చేస్తే కోనసీమలో టీడీపీకి మంచి ఊపు వస్తుందని స్థానిక నేతలు సూచనలు చేస్తున్నారు. మరి బాబు ఇప్పటకి అయినా హరీష్‌కు స్థానికంగా కీలక బాధ్యతలు అప్పగిస్తారో ? లేదో ? చూడాలి.
