ఇక వారి ఫ్యూచర్ అవుటేనా..?
రాజకీయ నాయకులకు స్పీడ్ అవసరం. మారుతున్న రాజకీయ పరిణామాలను బట్టి వారి అడుగులు ఉండాలి. అలా అయితేనే వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఏ మాత్రం ఆలస్యం [more]
రాజకీయ నాయకులకు స్పీడ్ అవసరం. మారుతున్న రాజకీయ పరిణామాలను బట్టి వారి అడుగులు ఉండాలి. అలా అయితేనే వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఏ మాత్రం ఆలస్యం [more]

రాజకీయ నాయకులకు స్పీడ్ అవసరం. మారుతున్న రాజకీయ పరిణామాలను బట్టి వారి అడుగులు ఉండాలి. అలా అయితేనే వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఏ మాత్రం ఆలస్యం చేసినా వారికి దక్కాల్సిన అవకాశాలను కొత్త వారో, పక్క వారో తన్నకుపోతారు. ఇప్పుడు పలువురు మాజీ, ప్రస్తుత కాంగ్రెస్ నేతల పరిస్థితి ఇదే. ఎన్నో ఏళ్లుగా జిల్లా, రాష్ట్రంలో చక్రం తిప్పిన నేతలు విభజన దెబ్బతో రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారు. పదేళ్ల పాటు తమ ప్రభను కోల్పోతున్నారు. ఇదే సమయంలో మరికొందరు మాత్రం వ్యూహాత్మకంగా వేగంగా అడుగులు వేసి కొత్త అవకాశాలను సృష్టించుకొని రాజకీయంగా స్థిరపడ్డారు.
త్వరపడ్డారు… సెట్ అయ్యారు…
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నేతలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఎంపీలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా చక్రం తిప్పిన నాయకుల రాజకీయ జీవితమే ప్రశ్నార్థకం చేసింది. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితిని ముందే అంచనా వేసిన గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణ, రాయపాటి సాంబశివరావు, జేసీ దివాకర్ రెడ్డి వంటి వారు తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో విజయం సాధించి ఎంపీలుగా, మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన మరికొందరు గెలుపొందగా, కొందరు ఓడిపోయారు. వీరు ప్రజల్లోనే, రాజకీయాల్లోనే చురుగ్గా ఉన్నారు. కానీ, వట్టి వసంత్ కుమార్, కనుమూరి బాపిరాజు, బొత్స కుటుంబం, ఆనం కుటుంబం, కిల్లి కృపారాణి, పనబాక లక్ష్మీ, హర్షకుమార్, మహిధర్ రెడ్డి, కిషోర్ చంద్రదేవ్, కోట్ల, పనబాక దంపతులు, నాదెండ్ల మనోహర్, పసుపులేటి బాలరాజు వంటి నాయకులు 2014లో అలానే కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. వీరిలో చాలా మంది పోటీ చేసి ఓటమి పాలుకాగా మరి కొందరు పోటీకి కూడా దూరంగా ఉన్నారు.
ఆలస్యం చేయడంతో…
2014 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ భవిష్యత్ పై పూర్తి అవగాహన వచ్చిన బొత్స, ఆనం కుటుంబాలు, మహిధర్ రెడ్డి వంటి వారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో వీరు రాజకీయంగా మళ్లీ క్రియాశీలకం కావడంతో పాటు 2019 ఎన్నికలకు టిక్కెట్లు దక్కించుకున్నారు. కిషోర్ చంద్రదేవ్, కోట్ల, పనబాక దంపతులు టీడీపీలో చేరి టిక్కెట్లు దక్కించుకున్నారు. నాదెండ్ల, పసుపులేటి బాలరాజు జనసేనలో చేరి టిక్కెట్లు తెచ్చుకున్నారు. అయితే, చివరి నిమిషం వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయిన వారి భవిష్యత్ మాత్రం ప్రశ్నార్థకంగా మారిపోయింది. కిల్లి కృపారాణి వంటి వారు తాత్సారం చేయడంతో 2019 ఎన్నికలకు కూడా వారు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో చేరినా ఆ పార్టీ పరిస్థితి బాగోలేకపోవడంతో వారు తప్పటడుగు వేసినట్లే చెప్పాలి. మొత్తానికి సరైన సమయానికి, సరైన నిర్ణయం తీసుకున్న ఏపీ మాజీ కాంగ్రెస్ నేతలు పార్టీలు మారి రాజకీయంగా స్థిరపడినా.. నిర్ణయాలు తీసుకోవడంలో తాత్సారం చేసిన నేతలు మాత్రం పదేళ్లు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. మరి, వీరిని పదేళ్ల తర్వాత కూడా ప్రజలు గుర్తు పెట్టుకుంటారో, వారికి మళ్లీ రాజకీయంగా పూర్వవైభవం ఎప్పటికి దక్కుతుందో చూడాలి.