అద్దాల మేడలో గీతం… ?
అద్దాల మేడలో ఉన్న వారు ఎదుటి వారి మీద రాళ్ళేయకూడదు అని ఒక నీతి ఉంది. అలా చేస్తే అసలైన నష్టం గాజు అద్దాల భవంతుల్లో ఉన్న [more]
అద్దాల మేడలో ఉన్న వారు ఎదుటి వారి మీద రాళ్ళేయకూడదు అని ఒక నీతి ఉంది. అలా చేస్తే అసలైన నష్టం గాజు అద్దాల భవంతుల్లో ఉన్న [more]

అద్దాల మేడలో ఉన్న వారు ఎదుటి వారి మీద రాళ్ళేయకూడదు అని ఒక నీతి ఉంది. అలా చేస్తే అసలైన నష్టం గాజు అద్దాల భవంతుల్లో ఉన్న వారికే వాటిల్లుతుంది. మరి పాఠాలు బోధించే ఘనమైన గీతం విద్యా సంస్థల యాజమాన్యాలకు ఈ నీతి సూత్రం అసలు తెలియదు అనుకోవాలా. లేక జగన్ లాంటి మొండి వారు భవిష్యత్తులో ఏలికలుగా వస్తారని అసలు ఊహించ లేకపోయారా. మొత్తానికి ఏదైతేనేం ఇన్నాళ్ళకు గీతం డొంక కదులుతోంది. గీత కూడా మారుతున్నట్లుగా ఉంది.
గాంధీ పేరిట ….
షార్ట్ కట్ లో గీతం అన్నా శ్రీక్రిష్ణ భగవానుడు గోచరిస్తాడు. ఫుల్ ఫార్మ్ లో పేరు చూసినా గాంధీ కనిపిస్తాడు. మొత్తానికి మహనీయుల స్పూర్తి అంటూ ఆవిర్భవించిన గీతం విద్యా సంస్థలది విశాఖలో నాలుగున్నర దశాబ్దాల చరిత్ర. ఆరంభంలో ప్రఖ్యాతి చెందిన ఆంధ్రా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న గీతం తరువాత డీమ్డ్ టు బి వర్శిటీగా ఎదిగింది. ఇక ఏయూనే పక్కన పెట్టి గీతం దూసుకుపోయే ప్రయత్నమూ చేసింది. ఏయూని దయ్యాల కొంప అని గీతం వ్యవస్థాపకులే అన్నారంటే అది తిన్న ఇంటి వాసాలను కచ్చితంగా లెక్కించినట్లే అవుతుందిగా.
ఎవరున్నా ఓకే….
గీతం వ్యవస్థాపకుడు దివంగత ఎంవీవీఎస్ మూర్తి ముందు వ్యాపారతవేత్త. ఆ తరువాత గీతం విద్యా సంస్థల అధినేత. ఇక ఆయనకు రాజకీయమూ బాగానే అక్కరకు వచ్చింది. ఇలా గీతం పెట్టారో లేదో అలా తెలుగుదేశం పార్టీని అన్న గారు పెట్టడం. అందులో మూర్తి చేరడం జరిగిపోయాయి. ఇక తొమ్మిది నెలల్లో అధికారంలోకి టీడీపీ రావడమే కాదు, నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఆ పార్టీ రాజకీయాలలో ఉండడమూ అందులో చేరిన వారి అదృష్టమే. మొత్తానికి గీతం, టీడీపీ కలసి ఎదిగాయా అన్నంతగా ఈ బంధం సాగిందనుకోవాలి. ఇక మధ్య మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చినా గీతం విషయంలో ఏ అడ్డూ అదుపూ లేదు, హవా అలాగే సాగిపోయింది. పార్లమెంటు సభ్యునిగా మూర్తి పలుకుబడి ఎపుడూ శ్రీరామ రక్షగానే నిలిచింది.
చరిత్రలో ఫస్ట్ టైం…..
ఎటువంటి వారికైనా కాలం కలసిరాకపోతే ఇంతే అంటారు. గీతం విషయంలో అదే అనుకోవాలేమో. చరిత్రలో మొదటిసారిగా గీతం ఇబ్బందుల్లో పడుతోంది. పైన ఉన్న వారు జగన్. అసలు రాజీ లేదు. ఇక ఆయన అత్యంత సన్నిహితుడు, విశాఖను నోడల్ జిల్లాగా దత్తత తీసుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి అసలు లొంగే రాకం కాదు. దాంతో గీతం విషయంలో ఎంవీవీఎస్ మూర్తి మనవడు, బాలక్రిష్ణ అల్లుడు, లోకేష్ తోడల్లుడు అయిన శ్రీ భరత్ పెద్ద పోరాటమే చేయాల్సివస్తోంది. అక్రమ నిర్మాణం అంటూ కూల్చుడు మొదలెట్టిన వైసీపీ సర్కార్ ఇపుడు కధను వేరే రూట్లోకి తీసుకెళ్తోంది. గీతం డీమ్డ్ యూనివర్శిటీ అనుమతులకే ఎసరు పెట్టేలా పావులు కదుపుతోంది.
గీత మారేనా …?
యూజీసీ నిబంధలన ప్రకారం పక్కాగా భూములు ఉండాలి. ఆ యాజమాన్యం హక్కులను నిరూపించుకునే డాక్యుమెంట్స్ కూడా యూజీసీకి చూపించాలి. కానీ ఇక్కడ ప్రభుత్వ భూముల్లోనే నిర్మాణాలు చేశారు. ఆ తరువాత ప్రతీదీ నిబంధనల ఉల్లంఘనే అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు ఇపుడు హాట్ హాట్ టాపిక్ గా ఉంది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ ప్రొక్రియాన్ తో పాటు, యూజీసీ చైర్మన్ కి కూడా ఆయన గీతం పై ఫిర్యాదు చేశారు. గీతం డీమ్డ్ హోదా రద్దు చేసి ఏయూకు అనుబంధం చేయమని కోరారు. మరి అదే కనుక జరిగితే గీతం తలరాత ఎలా మారుతుందో. ఏయూనే కాదనుకుని మిడిసిపడిన వారిని ఇపుడు అదే ఏయూ నీడన చేరిస్తే ఎలా ఉంటుందో. అందుకే అద్దాల మేడలో ఉన్న వారు అసలు రాళ్ళేయకూడదు అంటారు.

