బాబు రెడీ అయిపోతున్నారు… వీలయినంత త్వరగా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ నాలుగో విడతలో మినహాయింపులు ఎక్కువగా ఇచ్చే అవకాశముంది. దాని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ నాలుగో విడతలో మినహాయింపులు ఎక్కువగా ఇచ్చే అవకాశముంది. దాని [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాల కోసం ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ నాలుగో విడతలో మినహాయింపులు ఎక్కువగా ఇచ్చే అవకాశముంది. దాని కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. అంతరాష్ట్ర రవాణాకు కేంద్రం అనుమతిస్తే చంద్రబాబు అమరావతికి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందుకోసం చంద్రబాబు ఉండవల్లి నివాసంలో కూడా సిబ్బంది కదలికలు ప్రారంభమవ్వడంతో త్వరలోనే చంద్రబాబు ఏపీకి వచ్చేందుకు అవకాశాలున్నాయి.
రెండు నెలల నుంచి….
ఈ ఏడాది మార్చి 21వ తేదీన చంద్రబాబు తన మనవడి పుట్టినరోజు కోసం హైదరాబాద్ వచ్చారు. ఆ తర్వాత నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు కావడంతో గత రెండు నెలలుగా చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండిపోయారు. అక్కడి నుంచే నిత్యం వీడియో కాన్ఫరెన్స్ లు, టెలికాన్ఫరెన్స్ లు నిర్వహిస్తూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రాల మధ్య రవాణా ప్రారంభం కాకపోవడం, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళితే క్వారంటైన్ కు వెళ్లాలన్న నిబంధన ఉండటంతో చంద్రబాబు ఏపీకి వచ్చే ప్రయత్నం ఇంతవరకూ చేయలేదు.
అధికార పార్టీ విమర్శలతో…..
గత రెండు నెలలుగా చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండటంతో అధికార వైసీపీ సవాళ్ల మీద సవాళ్లు విసురుతోంది. కష్ట సమయంలో చంద్రబాబు ఏపీని వదిలేసి పోయారంటూ నిత్యం విమర్శలు చేస్తుంది. దీనికి చంద్రబాబు వద్ద సరైన సమాధానం లేదు. దీంతోపాటు పార్టీ నేతలు, క్యాడర్ లో సయితం కొంత నైరాశ్యం నెలకొంది. చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరూ పొరుగు రాష్ట్రంలో ఉన్నారన్న విమర్శలు బలంగా విన్పిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సడలింపుల కోసం ఎదురు చూస్తున్నారు.
మహానాడు కూడా ఉండటంతో….
వీలయినంత త్వరగా అమరావతి చేరుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో పాటు మహానాడు ఈ నెలలోనే జరగనుంది. జాతీయ పార్టీ అయినప్పటికీ మహానాడును పొరుగు రాష్ట్రం నుంచి నిర్వహిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకోసమే ఈ వారంలోనే చంద్రబాబు అమరావతికి రానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరి చంద్రబాబు అమరావతి వస్తే ఏపీ రాజకీయం మరింత వేడెక్కే అవకాశముంది.

