బాబు మళ్లీ యూటర్న్…!
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. అయితే, ఈ దఫా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల గురించి కాకుండా పార్టీ ప్రయోజనాలు, నాయకుల [more]
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. అయితే, ఈ దఫా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల గురించి కాకుండా పార్టీ ప్రయోజనాలు, నాయకుల [more]

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. అయితే, ఈ దఫా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల గురించి కాకుండా పార్టీ ప్రయోజనాలు, నాయకుల ప్రయోజనాల కోసం ఇలా యూటర్న్ నిర్ణయం తీసుకున్నారు. విషయంలోకి వెళ్తే.. 2014లో కొందరు నాయకులకు కొన్ని స్థానాలు కేటాయించారు. అప్పట్లో అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రానికి సీఎం అయితే బాగుంటుందని భావించిన ప్రజలు చంద్రబాబును ఆయన బృందాన్ని గెలిపించారు. ఈ క్రమంలో కొత్తముఖాలను కూడా ప్రజలు ఆదరించారు. ఇలా విశాఖ పట్నంలోని ఎస్సీ నియోజకవర్గం పాయకరావు పేట నుంచి టీచరమ్మ అనిత విజయం సాధించారు.
కొత్త వారైనా….?
అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి మరో టీచర్ కొత్తపల్లి జవహర్‌కు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. వీరిద్దరూ కొత్తే అయినా ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే, తర్వాత మాత్రం.. వీరిద్దరిపై స్థానికంగా వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత జవహర్‌కు అనూహ్యంగా మంత్రి పదవి రావడం.. ఆయన ఫ్రూవ్ చేసుకోవడం జరిగినా నియోజకవర్గంలో ఓ వర్గం మాత్రం ఆయన్ను వ్యతిరేకించింది. ఇక పాయకరావుపేటలో అనిత అందుబాటులో లేరని, తాము ఎవరిని సంప్రదించాలంటూ.. టీడీపీ నాయకులే ఆమెపై యుద్ధం ప్రకటించారు. అదేవిధంగా కొవ్వూరులో ఓ వర్గం పట్టుబట్టడంతో ఈ ఏడాది జరిగిన ఎన్నికల సమయానికి ఈ ఇద్దరినీ చంద్రబాబు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇద్దరూ ఓడటంతో….
ఈ నేపథ్యంలోనే అనితను కొవ్వూరుకు షిఫ్ట్ చేశారు. విశాఖ నుంచి రెండు జిల్లాలు దాటించి మరీ ఆమెకు చంద్రబాబు సీటు ఇచ్చారు. ఇక, ఇక్కడ ఉన్న జవహర్‌ను ఆయన సొంత నియో జకవర్గం కృష్ణాలోని తిరువూరుకు చంద్రబాబు పంపారు. అయితే, ఈ ఎన్నికల్లో ఈ ఇద్దరూ చతికిల పడ్డారు. కొవ్వూరులో అనిత ఏకంగా 23 వేల ఓట్ల తేడాతో ప్రస్తుత మంత్రి తానేటి వనిత చేతిలో ఓడినా… జవహర్ మాత్రం తిరువూరులో 10 వేలతో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయినా.. తిరువూరులో జవహర్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. కానీ, అనిత మాత్రం కొవ్వూరును ఎప్పుడో కాదనుకుంది. ఆవెంటనే ఆమె తన పాత నియోజకవర్గం పాయకరావుపేటకు మకాం మార్చేసి.. అక్కడే పట్టు సాధించాలని నిర్ణయించుకుంది. చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశానికి విశాఖలోనే హాజరైంది.
పాత ప్లేస్ లకే…..
ఇక, జవహర్ కూడా తన పాత నియోజకవర్గం కొవ్వూరునే కోరుకుంటున్నారు. ఆయనకు దశాబ్దాలుగా కొవ్వూరుతోనే అనుబంధం ఎక్కువ. అదే టైంలో ఆయన మంత్రిగా చేసిన అభివృద్ధి పనుల నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో కేడర్‌లో ఆయనకు మంచి గ్రిప్ ఏర్పడింది. చంద్రబాబు సైతం ఈ ఇద్దరి విషయంలో యూటర్న్ తీసుకుని వారి అభీష్టం మేరకు వారి వారి నియోజకవర్గాలనే వారికి కేటాయించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసిందే. అనిత విషయంలో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన చంద్రబాబు, జవహర్ విషయంలో మాత్రం ప్రస్తుతానికి ఈ రెండు నియోజకవర్గాలను అంటే కొవ్వూరు, తిరువూరులను కూడా చూడాలని త్వరలోనే గట్టి పట్టున్న నాయకుడిని తిరువూరులో నియమిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. ఎందుకంటే తిరువూరులో ఇప్పటికే మూడుసార్లు ఓడిన మాజీ ఎమ్మెల్యే స్వామిదాసుకు మరో ఛాన్స్ ఇచ్చి అక్కడ పార్టీని మళ్లీ పతనం చేసేందుకు చంద్రబాబు రిస్క్ చేయడం లేదు. ఏదేమైనా ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తిరిగి తమ పాత గూటికే వెళ్లిపోవడం అయితే ఖాయం.
