బాబు…..సూక్తి ముక్తావళి
నేను మారాను, అన్ని విధాలుగా నాలో మార్పు ఉంది. ఇపుడు కొత్త బాబుని చూస్తారు మీరు అంటూ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు [more]
నేను మారాను, అన్ని విధాలుగా నాలో మార్పు ఉంది. ఇపుడు కొత్త బాబుని చూస్తారు మీరు అంటూ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు [more]

నేను మారాను, అన్ని విధాలుగా నాలో మార్పు ఉంది. ఇపుడు కొత్త బాబుని చూస్తారు మీరు అంటూ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పదే పదే చెప్పుకొచ్చారు. మరో వైపు జనాలకు కూడా ఇదే సూక్తిముక్తావళి వినిపించారు. మొత్తానికి చంద్రబాబు మారారు అని అంతా అనుకుని ఒక ఛాన్స్ ఇచ్చారు. దాంతో అయిదేళ్ళ పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మారిన చంద్రబాబు పాలన ఎలా ఉంది అంటే ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన దాని కంటే తీసికట్టు అని ప్రజలు అనుకున్నారు. ఫలితంగా చంద్రబాబు మాటలను 2019 ఎన్నికల్లో నమ్మలేదు, ఆయన్ని గద్దె నుంచి దించేశారు. ఇపుడు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రిగా, పార్టీ నాయకుడిగా మిగిలిపోయారు. దాంతో పార్టీ మీటింగుల్లో చంద్రబాబుకు క్యాడర్ నుంచి రివర్స్ అటాక్ అవుతోందట. మీరు మారాలి బాబూ అంటూ ఏకంగా తమ్ముళ్ళే అంటున్నారంటే చంద్రబాబుకు షాక్ తగలదా మరి. పైగా ఇదంతా అనుకూల మీడియాలోనే అచ్చేస్తూంటే చంద్రబాబు సైతం ఆలోచించుకోవాల్సిందేగా.
అదే స్పీచ్.. అందుకేనా…
టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోరంగా ఓడిపోయాక సైతం బాబు అదే రోటీన్ స్పీచ్ తో క్యాడర్ కి బోరు కొట్టిస్తున్నారు. తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం, కృష్ణా జిల్లా సమీక్షా సమావేశాల్లో చంద్రబాబు ఆత్మ స్తుతి పరనింద తీరుగా మాట్లాడుతూంటే క్యాడర్ కే చిర్రెత్తుకొచ్చినట్లుంది. అందుకే వారు చంద్రబాబుకే సుద్దులు చెప్పడం మొదలుపెట్టారు. ముందు మీరు మారాలి బాబు అంటున్నారు. చంద్రబాబు అందరినీ నమ్మి పదవులు అప్పగించడం, తీరా వారు పార్టీ ఓడిపోగానే సైకిల్ దిగిపోవడం జరుగుతోంది. దీంతో కొత్తవారికి అవకాశాలు ఇవ్వండని మొత్తుకుంటున్నారు. విశాఖ మీటింగులో అయితే వేదిక మీద ఉన్న నాయకులను నమ్మకండని మొర పెట్టుకున్నారు. శ్రీకాకుళం సమీక్షలో జూనియర్ ఎన్టీయార్ నినాదాలు వినిపించారు. ఇపుడు కృష్ణా జిల్లాకు వచ్చేసరికి ఒక డిమాండ్ లాగానే క్యాడర్ గొంతు ఎత్తుకున్నారు. ముందు పార్టీ పదవుల నుంచే న్యాయం చేయండని నినదించారు. మీరు మారితేనే తప్ప టీడీపీకి ముక్తీ మోక్షం లేదని కుండబద్దలు కొట్టారు.
ఆచరణలో పెడతారా…?
ఇకపై తాను కష్టపడిన వారికే పార్టీ పదవులు ఇస్తానని, రానున్న రోజుల్లో టికెట్లు కూడా వారికే ఇస్తానని కృష్ణా జిల్లా మీటింగులో చంద్రబాబు ప్రకటించారు. యువతకు, మహిళలకు కూడా పెద్ద పీట వేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇపుడు ఈ మాటలు క్యాడర్ ఎంతవరకూ నమ్ముతున్నారన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే 2014 ఎన్నికల ముందు కూడా ఇలాగే చెప్పారు. తీరా అధికారంలోకి రాగానే బయట నుంచి ఎన్నికల ముందు చేరిన వారికే పదవులు కట్టబెట్టారు. అదే విధంగా ఫిరాయించిన ఎమ్మెల్యేలను పార్టీ ఇంచార్జులను చేశారు. నామినేటెడ్ పదవులు కూడా బయటవారికే ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే డబ్బున్న వారికే పదవులు అన్న లెక్కలు కూడా అమలు చేసి చూపించారు. విశాఖ జిల్లాలో పదిహేనేళ్ళుగా అధికార పదవులు లేక క్యాడర్ అల్లాడిపోతోంది. మరి ఇపుడు విపక్షంలో ఉన్నపుడు మాత్రం చంద్రబాబు పెద్ద మాటలు చెబుతున్నారు కానీ అధికారంలోకి వస్తే నిజమైన క్యాడర్ ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్న మాట గట్టిగా వినిపిసోంది. మరి చంద్రబాబే ఇపుడు మారాలి. మారుతారా.

