ఇది అనుకోని ఉపద్రవమేగా?
చంద్రబాబు ఎంతటి నాయకుడు. రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే కృషీవలుడు. ఆయన నిద్రపోరూ, ఎవరినీ నిద్రపోనీయరు. అటువంటి చంద్రబాబు ఇపుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత, మాజీ [more]
చంద్రబాబు ఎంతటి నాయకుడు. రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే కృషీవలుడు. ఆయన నిద్రపోరూ, ఎవరినీ నిద్రపోనీయరు. అటువంటి చంద్రబాబు ఇపుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత, మాజీ [more]

చంద్రబాబు ఎంతటి నాయకుడు. రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే కృషీవలుడు. ఆయన నిద్రపోరూ, ఎవరినీ నిద్రపోనీయరు. అటువంటి చంద్రబాబు ఇపుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత వంటి ట్యాగులు పక్కన పడేసి ఒక సామాన్య పౌరుడిగా మారిపోయారు. తెలంగాణా రాష్ట్రంలో సీనియర్ సిటిజన్ మాదిరిగా సెల్ఫ్ క్వారంటైన్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అన్నిటికంటే ముందుగా చెప్పుకోవాల్సింది ఆయన ఒకనాటి తన శిష్యుడు కేసీఆర్ ఏలుబడిలో చంద్రబాబు సాధారణ పౌరుడిగా మారిపోవడం.
వారి సరసన …..
కాంగ్రెస్ జమానాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన కొణిజేటి రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ వియోగం తరువాత క్రియాశీల రాజకీయాలకు విరామం ప్రకటిస్తూ హైదరాబాద్ లోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. చంద్రబాబు కూడా భవిష్యత్తులో పూర్తిగా హైదరాబాద్ లోనే ఉండాలనుకుని వందల కోట్లతో భారీ భవంతిని కట్టించుకున్నారు. ఇపుడు ఆయన అక్కడే గడుపుతున్నారు. చూడబోతే చంద్రబాబు సైతం ఆ ఇద్దరు మాజీ సీఎంల సరసన చేరిపోయారనిపిస్తుంది.
టెంపరరీగా….
చంద్రబాబు తాను ఊపిరి ఉన్నంతవరకూ రాజకీయాలు చేస్తూనే ఉంటానని తరచుగా చెబుతూ ఉంటారు. కానీ ఇంత తొందరగా ఆయనకు విశ్రాంతి లభిస్తుందని బహుశా ఆయన కూడా అనుకుని ఉండరు. టెంపరరీగా అయినా కూడా ఇన్ని రోజులు, ఇంత సమయం చంద్రబాబు ఇలా ఇంట్లో ఉండడం రాజకీయంగా పుట్టి బుద్ధెరిగి చేసి ఉండరు. పైగా చంద్రబాబు ఎక్కువగా అమరావతిలోనే గత అయిదేళ్ళూ గడుపుతూ వచ్చారు. వీకెండ్స్ రావాల్సిన హైదరాబాద్ టూర్ ఇపుడు నలభై రోజులకు పైగా లాంగ్ లీవ్ లోకి తీసుకెళ్తుందని చంద్రబాబు అనుకోని ఉండకపోవచ్చు. కానీ అనివార్యమైంది. లాక్ డౌన్ నేపధ్యంలో చంద్రబాబు ఇరుక్కుపోయారు. హైదరాబాద్ లో కేసీఆర్ సీఎంగా ఉంటే కనీసం అక్కడ ఏ హోదా లేకుండా ఇంటి పట్టున ఉండడం రాజకీయంగా చంద్రబాబుకు అతి పెద్ద ఇబ్బందే.
ఇక టీవీల్లోనే….
ప్రతి ఇంట్లో అందరి పెద్దల్లాగానే, సీనియర్ సిటిజన్ల మాదిరిగానే చంద్రబాబు కూడా ఇపుడు టీవీల్లోనే వార్తలు చూస్తూ గడపాలి. తన పార్టీకి పట్టున్న చోట, జగన్ ని నిలువరించాల్సిన చోటకు చంద్రబాబు ఇపుడు రెక్కలు కట్టుకుని వెళ్ళలేరు. తాను ఎంతగానో ప్రేమించే అమరావతి రాజధానికి ఈ వేళలో ఎంతగా కోరుకున్నా వెళ్ళలేరు. జగన్, కేసీఆర్ సీఎంలుగా బిజీగా ఉంటే చంద్రబాబు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ముచ్చట్లూ టీవీలలో చూస్తూ అతి సాధారణ పౌరిడిగా గడపాల్సి రావడం విధి విచిత్రమే. మొత్తం మీద చూసుకుంటే ఇది భవిష్యత్తుకు సూచిక కాదు కదా అని తమ్ముళ్ళు సైతం పీడ కలలు కని కలవరపడే దుర్భర దృశ్యమే. అలా కాకూడదని చంద్రబాబుతో సహా పసుపు తమ్ముళ్ళంతా కోటి దేముళ్ళకు మొక్కుకున్నా ఇపుడు చేసేదేముంటుంది. బయట ఉన్నది కరోనా. తప్పదిక. ఇప్పటికైతే ఇదే జీవితం. కాని చంద్రబాబు మాత్రం తాను ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేస్తూనే ఉన్నానని చెబుతుండటం విశేషం.

