డోన్ట్ వర్రీ అంటున్నాడే
మొత్తానికి చంద్రబాబు ఈసారి పెద్దగా టెన్షన్ పడకుండానే వేగంగా ఒక స్టాండ్ తీసేసుకున్నారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో అయితే తెలంగాణా, ఆంధ్రాల మధ్య రెండు కళ్ళ సిధ్ధాంతంతో [more]
మొత్తానికి చంద్రబాబు ఈసారి పెద్దగా టెన్షన్ పడకుండానే వేగంగా ఒక స్టాండ్ తీసేసుకున్నారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో అయితే తెలంగాణా, ఆంధ్రాల మధ్య రెండు కళ్ళ సిధ్ధాంతంతో [more]

మొత్తానికి చంద్రబాబు ఈసారి పెద్దగా టెన్షన్ పడకుండానే వేగంగా ఒక స్టాండ్ తీసేసుకున్నారు. అప్పట్లో ఉమ్మడి ఏపీలో అయితే తెలంగాణా, ఆంధ్రాల మధ్య రెండు కళ్ళ సిధ్ధాంతంతో నలిగిపోయిన చంద్రబాబు ఈసారి మూడు కాళ్ళ సిధ్ధాంతం కొత్తగా కనిపెడతారని అంతా భావించారు. ఏపీ సర్కార్ మూడు రాజధానులు అంటే చంద్రబాబు కూడా మూడు దిక్కులూ చూస్తారని వైసీపీ నేతలు కూడా ఆశించారు. కానీ చంద్రబాబు ఒకటి రెండు రోజులు సైలెంట్ గా ఉన్నా కూడా తనదైన రాజకీయ అనుభవానికి పదును పెట్టారు. చివరికి ఆయన అమరావతికి జై అనేశారు. దీని వెనక చంద్రబాబు మార్క్ రాజకీయ చాణక్యం చాలానే ఉందని అంటున్నారు.
ఇదే ఛాన్స్…..
జగన్ అధికారంలోకి వచ్చి ఏడు నెలల కాలంలో పెద్దగా వ్యతిరేకత ఎక్కడా రాలేదు. ఇపుడు ఏకంగా రెండు జిల్లాలలో పెద్ద ఎత్తున నిరసలను ఊపందుకున్నాయి. బహుశా ఈ అగాధం పూడ్చలేనిదిగా కూడా ఉండొచ్చు అని కూదా విశ్లేషణలు ఉన్నాయి. జగన్ కి ఎన్నడూ లేని విధంగా కమ్మ సామాజికవర్గం ప్రాబల్యం ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాకు పట్టం కట్టాయి. ఈ రెండు జిల్లాలు కలిపి 34 అసెంబ్లీ సీట్లు ఉంటే అందుకో అత్యధిక సీట్లు వైసీపీవే. ఆ విధంగానే టీడీపీ అధికారం అందుకోలేకపోయింది. ఇపుడు ఇక్కడ నుంచే అమరావతి మంటలు మొదలుకావడంతో దాన్ని ఒక ఛాన్స్ గా వాడుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.
అదే నమ్మకం….
ఇక అమరావతికి జై కొట్టినా మిగిలిన రెండు ప్రాంతాలో వ్యతిరేకత పెద్దగా ఉండదని చంద్రబాబు ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల విషయం తీసుకుంటే ఇక్కడ టీడీపీ క్షేత్ర స్థాయిలో చాలా బలంగా ఉంది. మూడు జిల్లాలూ కలిపి 34 సీట్లు ఉంటే ఈసారికి జగన్ గాలిలో అన్నీ పోయినా కూడా వచ్చేసారికి బలపడేందుకు పటిష్టమైన పార్టీ క్యాడర్ ఉందన్నది చంద్రబాబు ఆలోచన. అక్కడ వైసీపీకి సంస్థాగతంగా పెద్దగా బలం లేకపోవడమే టీడీపీ ధైర్యానికి కారణం. పైగా ఈ ప్రాంతాన్ని అభివ్రుధ్ధి చేసేందుకు వైసీపీకి ఇపుడున్న నాలుగేళ్ళ సమయం చాలదు, ఆ విధంగా మాటలకు చేతలకు మధ్య తేడాలు వస్తే దాన్ని అందుకోవడానికి టీడీపీ రెడీగా ఉంటుంది.
గోదారి రూటే….
మరో వైపు గోదావరి జిల్లాల విషయం తీసుకుంటే వారికి అటు విశాఖ అయినా ఇటు అమరావతి అయినా ఒకటే. పైగా ఈ జిల్లాల్లో రాజకీయం ఎప్పటికపుడు మారుతుంది. ఒకసారి ఒక పార్టీని నెత్తికెత్తుకుంటే మరో సారి మరో పార్టీని గెలిపిస్తారు. దాన్ని అనువుగా అప్పటికి తగినట్లుగా మార్చుకునే నైపుణ్యం తన వద్ద ఉందని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. దాంతో ఆయనకు ఈ జిల్లాలు గురించి పెద్దగా వర్రీ లేదని అంటున్నారు.
సీమ సీన్ …
ఇక రాయలసీమ తీసుకుంటే ఇక్కడ వైసీపీకి గట్టి పట్టుంది. ఎంత పట్టు ఉన్నా 2014 ఎన్నికల్లో అనంతపురం చిత్తూరులలో టీడీపీ బాగానే స్కోర్ చేసింది. ఇపుడు సర్కార్ పట్ల వ్యతిరేకత ఉంటే మరిన్ని సీట్లు వస్తాయి. దానికి రాజధానులతో సంబంధం లేదు కూడా. మరో వైపు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సైతం రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారితే తమ వైపు తిప్పుకోవచ్చు, అక్కడ కొన్ని సీట్లు వచ్చినా కూడా అధికార పీఠానికి చేరువ కావచ్చు. ఈ రకమైన లెక్కలు అన్నీ గట్టిగా వేసుకున్నాకే చంద్రబాబు జై అమరావతి అంటున్నారని తెలుస్తోంది. మొత్తానికి 2014 ఫలితాలు 2024లో రిపీట్ కావాలంటే కోస్తా నుంచే గేర్ మార్చాలన్నది చంద్రబాబు ఎత్తుగడగా ఉంది. అందుకే అయన జై అమరావతి అని ఏ మాత్రం జంకూ బొంకూ లేకుండా అనేశారు.

