30 ఏళ్ల ముందుచూపు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. టీడీపీ భూస్థాపితం అవుతుందంటున్న వారికి టీడీపీ ఏంటో చూపిస్తానని చెబుతున్నారు. ముప్ఫయి ఏళ్ల పాటు నాయకత్వాన్ని అందిస్తానని [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. టీడీపీ భూస్థాపితం అవుతుందంటున్న వారికి టీడీపీ ఏంటో చూపిస్తానని చెబుతున్నారు. ముప్ఫయి ఏళ్ల పాటు నాయకత్వాన్ని అందిస్తానని [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. టీడీపీ భూస్థాపితం అవుతుందంటున్న వారికి టీడీపీ ఏంటో చూపిస్తానని చెబుతున్నారు. ముప్ఫయి ఏళ్ల పాటు నాయకత్వాన్ని అందిస్తానని నమ్మకం కలిగిస్తున్నారు. యువతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా టీడీపీని మరింత బలోపేతం చేస్తానంటున్నారు. ఎవరు పార్టీని వదలి వెళ్లినా నష్టం పార్టీకి ఉండదని, వెళ్లిన వాళ్లు తిరిగి రాక తప్పదని చంద్రబాబు ధీమాగా ఉన్నారు.
నాయకత్వం ఉండదని….
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య ఏర్పడింది. చంద్రబాబు తర్వాత పార్టీని ముందుకు నడిపించేదెవరు అన్న ప్రశ్న పార్టీలో చర్చనీయాంశమైంది. చంద్రబాబు తనయుడు నారాలోకేష్ ఇంకా అందిరాకపోవడం, ఆయన మంగళగిరిలో పోటీ చేసి ఓటమి పాలు కావడంతో టీడీపీ నేతలకు కూడా డౌటు కొట్టింది. టీడీపీని చంద్రబాబు నడిపినంత సమర్థవంతంగా మరెవ్వరూ నడపలేరన్నది తెలుగుతమ్ముళ్ల గట్టినమ్మకం.
దూరమయిపోవడంతో…..
దీనికి తోడు వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి నేతలు టీడీపీపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం సీనియర్ నేతలు కూడా సైలెంట్ అయ్యారు. చంద్రబాబు ఒక్కరే పార్టీ కోసం పాకులాడుతున్నారు. ఎన్నికలకు మరో నాలుగున్నరేళ్ల సమయం ఉండటంతో మొన్నటి వరకూ అధికారాన్ని అనుభవించిన నేతలు సయితం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎన్నికల సమయానికి మళ్లీ యాక్టివ్ అవుతారన్నది వాస్తవమే అయినా అప్పటి వరకూ క్యాడర్ ను ఓటు బ్యాంకును కాపాడుకోవాలన్నదే చంద్రబాబు తపన.
బాబు ప్రయత్నమంతా…..
అందుకోసం ఆయన కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఇటు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే మరోవైపు తాను ఉన్నానని, పార్టీని ముందుకు నడిపిస్తానని చంద్రబాబు తమ్ముళ్లలో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరో ముప్ఫయి ఏళ్ల వరకూ టీడీపీకి ఢోకా ఉండబోదన్న సంకేతాలను క్యాడర్ లోకి పంపగలిగారు కాని, అది ఎంతవరకూ నిలబడుతుందనేదే ప్రశ్న. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కొంతలో కొంతైనా మెరుగైన ఫలితాలను సాధించగలిగితే చంద్రబాబు దాదాపు సక్సెస్ అయినట్లే చెప్పాలి. అప్పటి నుంచి నేతలందరూ తిరిగి యాక్టివ్ అవ్వక తప్పదు. మరి చంద్రబాబు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.

