వంశీపై వేటు ఓకే…మరి ఆయనపైనో?
సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు పార్టీ నేతపై సస్పెన్షన్ వేటు వేశారు. చంద్రబాబు సహజంగా ఒక పట్టాన నిర్ణయం తీసుకోరు. దాన్ని ప్రజల్లో విస్తృతంగా చర్చ పట్టి, పార్టీ [more]
సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు పార్టీ నేతపై సస్పెన్షన్ వేటు వేశారు. చంద్రబాబు సహజంగా ఒక పట్టాన నిర్ణయం తీసుకోరు. దాన్ని ప్రజల్లో విస్తృతంగా చర్చ పట్టి, పార్టీ [more]

సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు పార్టీ నేతపై సస్పెన్షన్ వేటు వేశారు. చంద్రబాబు సహజంగా ఒక పట్టాన నిర్ణయం తీసుకోరు. దాన్ని ప్రజల్లో విస్తృతంగా చర్చ పట్టి, పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో మాత్రం చంద్రబాబు 24 గంటల్లోనే నిర్ణయం తీసుకోవడం ఒక సంచలనంగా చెప్పుకోవాలి.
సస్పెన్షన్లు చాలా అరుదుగా…..
చంద్రబాబు చేతుల్లోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నేతలను సస్పెన్షన్లు చేసింది అతి తక్కువనే చెప్పాలి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా కొందరు నేతలు పార్టీని వదిలి వెళుతూ అనేకమంది టీడీపీపైనా, చంద్రబాబుపైనా విమర్శలు చేశారు. కానీ నాడు కూడా చంద్రబాబు వారిని సస్పెండ్ చేయలేదు. వారంతట వారే వెళ్లిపోయారు. కానీ తర్వాత అదే నేతలను తిరిగి చంద్రబాబు పార్టీలో చేర్చుకున్నారు. అలాంటి నేతల్లో ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ఒకరు.
అధికారంలో ఉన్నప్పుడు కూడా….
ఇక అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నేతలెవరినీ సస్పెండ్ చేయలేదు. కరణం బలరాం, అయ్యన్న పాత్రుడు, జేసీ దివాకర్ రెడ్డి, గంటా శ్రీనివాసరావు లాంటి నేతలు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ లైన్ దాటి మాట్లాడినా సస్పెండ్ చేయలేదు. వారిని పిలిచి మాట్లాడారు తప్పించి వారిపై ఎలాంటి చర్యలకు దిగలేదు. దీంతో చంద్రబాబుకు చర్యలు తీసుకునే ధైర్యం లేదన్న గుసగుసలు కూడా అప్పట్లో విన్పించాయి.
గంటా విషయంలో మాత్రం….
అయితే తాజాగా వల్లభనేని వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలో కొందరు నేతలు స్వాగతిస్తున్నారు. వల్లభనేని వంశీ పార్టీతో పాటు చంద్రబాబు, నారా లోకేష్ లను విమర్శించడం వల్లనే సస్పెండ్ చేశారని, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, బీజేపీ నేతలను తరచూ కలుస్తున్నా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమపై దుమ్మెత్తి పోసిన వంశీని వదిలించుకోవడమే మేలని చంద్రబాబు సత్వర నిర్ణయం తీసుకున్నారని, గంటా విషయంలో సామాజికవర్గం కోణంలో వెనక్కు తగ్గుతున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

