కుప్పం “ఫీవర్” ఇప్పట్లో పోయేట్లు లేదుగా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి ఇప్పుడు కుప్పం భయం పట్టుకుంది. తన సొంత నియోజకవర్గంలోనే తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి ఇప్పుడు కుప్పం భయం పట్టుకుంది. తన సొంత నియోజకవర్గంలోనే తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ [more]

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి ఇప్పుడు కుప్పం భయం పట్టుకుంది. తన సొంత నియోజకవర్గంలోనే తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారం ఒక్క కుప్పంలోనే తరచూ తలెత్తడంపై చంద్రబాబు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు కావాలనే పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారని నమ్ముతున్నారు. ఇది వైసీపీలో మైండ్ గేమ్ అని చంద్రబాబు అనుమానపడుతున్నారు.
పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా…
కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు పెట్టని కోట. ఓటమి అనేది తెలియకుండా అక్కడ నుంచి వరస విజయాలను చంద్రబాబు సాధిస్తున్నారు. గతంలో పదేళ్లు పార్టీ అధికారంలో లేకపోయినా కుప్పంలో మాత్రం చంద్రబాబుకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. ఈసారి మాత్రమే అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా పార్టీని, తనను నమ్ముకున్న కార్యకర్తలు వైసీపీలోకి వెళ్లిపోవడం, గత ఎన్నికల్లో మెజారిటీ తగ్గడం కూడా కొంత చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది.
ఈ ఒక్క నియోజకవర్గంలోనే?
అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఎక్కువగా హడావిడి కన్పిస్తుంది. అక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, ఆయన అభిమానులు నినాదాలు చేయడం తరచూ జరుగుతున్నాయి. దీని వెనక వైసీపీ నేతల హస్తం ఉందేమోనన్న అనుమానాలు చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన 174 నియోజకవర్గాల నుంచి రాని డిమాండ్ ఒక్క కుప్పం నుంచి ఎందుకు వస్తుందని ఆయన ఆరా తీస్తున్నారు.
మైండ్ గేమ్…..?
వైసీపీ సహజంగానే మైండ్ గేమ్ ఆడుతుంది. కుప్పంలో డిమాండ్ వస్తే అది రాష్ట్రమంతటా వచ్చినట్లే. ఈ డిమాండ్ తో తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో చంద్రబాబు, లోకేష్ నాయకత్వంపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఇది రాజకీయంగానే కాకుండా కుటుంబ పరంగా నారా వారికి ఇబ్బందే. అందుకే ఒక్క కుప్పంలోనే తరచూ తలెత్తుతున్న ఈ డిమాండ్ పై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారంటున్నారు. వారు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులేనా? లేక ప్రత్యర్థి పార్టీ నేతలు చెప్పినట్లు చేస్తున్నారా? అన్న దానిపై చంద్రబాబు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు కుప్పం ఫీవర్ ఇప్పట్లో పోయేట్లు లేదు.

