ఏపీలో జై… తెలంగాణాలో నై…?
చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకు వస్తే దేశంలో దోస్తీ చేయని పార్టీ లేదు. ఆయనకు వైసీపీ తప్ప అందరూ మిత్రులే. గత ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ [more]
చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకు వస్తే దేశంలో దోస్తీ చేయని పార్టీ లేదు. ఆయనకు వైసీపీ తప్ప అందరూ మిత్రులే. గత ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ [more]

చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకు వస్తే దేశంలో దోస్తీ చేయని పార్టీ లేదు. ఆయనకు వైసీపీ తప్ప అందరూ మిత్రులే. గత ఎన్నికల్లో తెలంగాణాలో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసిన చంద్రబాబు అందుకు తగిన మూల్యం చెల్లించారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పెట్టిన టీడీపీని అదే కాంగ్రెస్ లో కలపడమే చంద్రబాబు మార్క్ పాలిటిక్స్. దానికి ఆయన పార్టీ నేతల సమర్ధన కూడా చాలా చక్కగా ఉండేది. అప్పట్లో కాంగ్రెస్ దేశాన్ని ఏలింది కాబట్టి ఆ పార్టీ మాకు శత్రువు. ఇపుడు మోడీ వల్ల దేశం నష్టపోతోంది కాబట్టి కాంగ్రెస్ ని కలుపుకున్నామని యనమల రామక్రిష్ణుడు వంటి వారు లాజిక్ చెప్పి మరీ ఒప్పించాలని చూశారు. చివరికి ఈ పొత్తుని జనం పక్కన తీసి పెట్టారు, కేసీయార్ ని మళ్ళీ రెండవసారి గెలిపించారు.
ఆయన వద్దే వద్దు….
ఇక పొత్తు పెటాకులు అయి అక్కడ గుండు సున్నా అని తేలాక చంద్రబాబు ఎటూ తెలివిగా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. ఏపీలో కూడా పవర్ పోవడంతో బీజేపీ వైపు ఆయన ఆశగా చూస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తెలంగాణా కాంగ్రెస్ నేతలు చంద్రబాబు వల్లే ఓడామని అంటున్నారు. చంద్రబాబు అంధ్రా రాజకీయాల వల్ల మా ఓటు బ్యాంక్ కూడా గల్లంతు అయిందని వారు తాపీగా చింతిస్తున్నారు. చంద్రబాబుతో మళ్ళీ ఎటువంటి స్నేహం ఉండదని కూడా అనేస్తున్నారు. 2023లో తెలంగాణాలో జరిగే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి కాంగ్రెస్ రెడీ అవుతుందిట.
జై అంటున్న శైలజానాధ్…..
అవును మరి ఉమ్మడి ఏపీలో ఒక సగభాగంగా ఉన్న తెలంగాణా ఇచ్చిన దిమ్మతిరిగిన తీర్పు చాలనట్లుంది. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం కాంగ్రెస్ ఆశపడుతున్నట్లుంది. అందుకే అచ్చం టీడీపీ నోట్లో నుంచి వచ్చిన మాటలనే పీసీసీ చీఫ్ శైలజానాధ్ వల్లెవేస్తున్నారు. మూడు రాజధానులు వద్దు అంటూ ఆయన హై కోర్టులో కాంగ్రెస్ తరఫున వాదనను వినిపిస్తున్న అఫిడవిట్ ఇచ్చారు. అమరావతి రాజధానిని కాంగ్రెస్ స్వాగతించిందని చెప్పుకున్నారు. అమరావతిలో పదివేల కోట్ల రూపాయలతో పెద్ద ఎత్తున నిర్మాణం పనులు సాగుతున్నాయట. అందువల్ల రాజధానిని అసలు కదపవద్దని కాంగ్రెస్ తరఫున అఫిడవిట్ ని ఆయన దాఖలు చేశారు. ఓ విధంగా దీన్ని చూస్తే చంద్రబాబు వాదనే గుర్తుకువస్తుంది. బాబుకు బలమైన మద్దతు కాంగ్రెస్ నుంచి ఈ విధంగా లభించినట్లైంది.
అయ్యే పనేలా…..
ఇక ఏపీలో 2024 నాటికి బీజేపీ పలకకపోతే చంద్రబాబుకు కాంగ్రెస్, వామపక్షాలు దిక్కు అన్నది అందరికీ తెలిసిందే. న్యాయమైన విషయం ఏంటి అంటే నోటా ముందు బీజేపీ కాంగ్రెస్ ఓడిపోయాయి. కానీ బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక వామపక్షాలకు ఎన్ని ఓట్లో చెప్పకుండా మొత్తం ఆరు శాతం ఓట్లను జనసేన ఖాతాలో పవన్ కళ్యాణ్ తెలివిగా వేసుకున్నారు. ఎంత కాదనుకున్నా అర శాతం ఓట్లు అయినా వామపక్షాలకు ఉంటాయి కదా. అలా చంద్రబాబుకు కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు వల్ల నియోజకవర్గానికి వందా రెండు వందల ఓట్లు అయినా తెస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇక టీడీపీతో పొత్తు తప్ప మరో పార్టీ కాంగ్రెస్ కి కూడా ఏపీలో కనిపించడంలేదు. దాంతోనే శైలజానాధ్ జై అమరావతి అంటూ చంద్రబాబు బాటన నడుస్తున్నారని చెబుతున్నారు.

