దగ్గుబాటికి, చంద్రబాబుకు తేడా అదే?
ఆర్ధిక శాస్త్రం చదివిన చంద్రబాబు నాయుడి లెక్కలు వేరు. ఆయన లెక్కలన్నీ లాభ నష్టాల జమాపద్దులే. ఆయన బంధాలు, అనుబంధాలు అన్నీ ఈ రకం జమా పద్దు [more]
ఆర్ధిక శాస్త్రం చదివిన చంద్రబాబు నాయుడి లెక్కలు వేరు. ఆయన లెక్కలన్నీ లాభ నష్టాల జమాపద్దులే. ఆయన బంధాలు, అనుబంధాలు అన్నీ ఈ రకం జమా పద్దు [more]

ఆర్ధిక శాస్త్రం చదివిన చంద్రబాబు నాయుడి లెక్కలు వేరు. ఆయన లెక్కలన్నీ లాభ నష్టాల జమాపద్దులే. ఆయన బంధాలు, అనుబంధాలు అన్నీ ఈ రకం జమా పద్దు తరహాలోనే ఉంటాయి. ఆయన విమర్శకులు వీటిని కుయుక్తులు అంటారు. కానీ ఇదో రకమైన వ్యూహం. చంద్రబాబు వ్యూహం ఒక ప్రత్యేకం. అది ఆయనను ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కించేందుకు ఉపయోగపడింది. ఇంకా ఉపయోగపడుతుంది. లక్ష్యం విజయమే అయినప్పుడు ఈ వ్యూహం కూడా కీలకమే.
అంతా వ్యూహమే…
కార్యసాధకులకు ఉండే అనేకానేక వ్యూహాల్లో ఇది ఒకటి. గెలుపు మనది కావాలి అనుకోవడం, అందుకు తగినట్టుగా పరిస్థితులను, మనుషులను తనకు అనుకూలంగా మార్చుకోవడం లేదా అనుకూలమైన పరిస్థితులు సృష్టించుకోవడం చాలా తక్కువమంది అనుసరించే వ్యూహం. అలాంటి తక్కువమంది వ్యూహకర్తలు కోటాలో చంద్రబాబు ఒకరు. అందరితో అనుబంధాలు ఈ వ్యూహంలో భాగమే. 1978 ఎన్నికల్లో గెలవడం, ఆ తర్వాత అంజయ్య మంత్రివర్గంలో స్థానం సంపాదించడం, భువనేశ్వరితో వివాహం… ఇలా అన్నీ ఒక్కొక్కటిగా ఆయన ఎక్కిన మెట్లు. ఇవన్నీ ఆయన తన కెరీర్ ను విజయం దిశగా మలుచుకునే క్రమంలో అనుసరించిన వ్యూహంలో భాగమే.
కాంగ్రెస్ కు వెళ్లి…..
1982లో తన మామ ఎన్టీఆర్ “తెలుగుదేశం” పార్టీ ప్రారంభించినప్పుడు, అటువైపు వెళ్ళకుండా వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ మంత్రివర్గంలో కొనసాగారు. 1983 ఎన్నికల ముందు ఆయన చేసిన “మామపై పోటీకి సిద్ధం” అనే ప్రకటన కూడా ఆయన వ్యూహంలో భాగమే. ఈ ప్రకటనే చంద్రబాబును చిత్తూరు జిల్లా సరిహద్దులు దాటించి రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసింది. “ఎన్టీఆర్ అల్లుడంట”, “కృష్ణా జిల్లా అల్లుడేనంట” వంటి బిరుదులతో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు పరిచయం అయ్యారు.ఎన్నికల ఓటమి తర్వాత టీడీపీలో చేరడం, అప్పటికే పార్టీ ప్రారంభించక ముందునుండి ఎన్టీఆర్ కు వెన్నుదన్నుగా ఉన్న తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావును దాటి రెండుమూడు అడుగులు ముందుకు వెళ్ళగలగడం, ఆ తర్వాత పార్టీలో దగ్గుబాటి కంటే క్రియాశీలకంగా మారడం ఆయన ఎంచుకున్న వ్యూహంలో భాగమే.
దగ్గుబాటిది డిఫరెంట్…..
తనకు కొంచెం మొహమాటం ఎక్కువ కావడం, దూసుకుపోయే తత్త్వం లేకపోవడం తన వెనుకబాటుకు కారణం అని ఓ సందర్భంలో దగ్గుబాటి చెప్పినప్పటికీ, నిర్దేశించుకున్న లక్ష్యంలో, నిర్దేశించుకున్న మార్గంలో అడ్డంకులు తొలగించుకుంటూ ఒక్కోమెట్టు పైకెక్కుతూ వెళ్ళడం చంద్రబాబు తత్త్వం. ఒకవేళ దగ్గుబాటికి మొహమాటం లేకపోయినా, చురుకుగానే ఉన్నా ఆయనను దాటి ముందుకెళ్ళగలిగే వ్యూహం ఉన్న వ్యక్తి చంద్రబాబు. ఆయనే తరచూ చెప్పినట్టు “సంక్షోభంలో అవకాశం వెతుక్కునే తత్త్వం” చంద్రబాబుది. “ఎన్టీఆర్ పిలిస్తే వెళ్ళి కలిసే తత్త్వం దగ్గుబాటిది. ఎన్టీఆర్ తనను పిలిపించుకునేలా చేసుకోగలిగే తత్త్వం చంద్రబాబుది”. అవకాశాలను తనకు అనుకూలంగా మార్చుకోగలగడం చంద్రబాబు తత్త్వం.
బలమైన శత్రవును…..
ఈ క్రమంలోనే “కర్షక పరిషత్” చేదు అనుభవం తర్వాత చట్టసభపై పట్టుసాధించినంత మాత్రానే అన్నీ అనుకూలంగా ఉండవు. న్యాయవ్యవస్థ పట్ల కూడా అవగాహన ఉండాలనే ఆలోచన తట్టింది. అప్పటినుంచే ఒక బలమైన, సమర్ధవంతమైన న్యాయవాదులను తన చుట్టూ పెట్టుకోవడం మొదలుపెట్టారు. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను అర్ధం చేసుకోవడం, వాటిపై తన ముద్ర వేసుకోవడం “కర్షక పరిషత్” నేర్పించిన ఒక పాఠం. రాజకీయాల్లో చేయి అందించే ఆదికేశవులు నాయుడు లాంటి శ్రేయోభిలాషులను చూశారు. శత్రువూ కాక, మిత్రుడూ కాకుండా కేవలం సహచరుడిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి లాంటి వారినీ చూశారు. కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యం కారణంగా రాజకీయాల్లో శత్రువులు కూడా ఉంటారని గ్రహించారు. అయితే బలమైన శత్రువును లేదా ప్రత్యర్థిని చంద్రబాబు ఎప్పుడూ చూడలేదు. కానీ ఆయనే తన ప్రత్యర్థులను అనేక సందర్భాల్లో నిర్దేశించుకున్నారు. అది 1995లో లక్ష్మి పార్వతి కావచ్చు లేదా 2014లో సోనియా గాంధీ కావచ్చు అలాగే 2019లో నరేంద్ర మోడీ కావచ్చు.
రాజనీతితో……
తన ప్రత్యర్థులెవరో చంద్రబాబే ప్రత్యక్షంగా ప్రకటిస్తారు. వారు ప్రమాదకరమైన ప్రత్యర్థులే అని నమ్మేలా మాట్లాడగలుగుతారు. అది కూడా గొప్ప వ్యూహమే. చాలా మందిలో ఈ లక్షణం కనిపించదు. ఈ లక్షణమే 1995లో లక్ష్మి పార్వతిని ప్రమాదకరమైన శత్రువుగా చూపించగలిగారు. శత్రువును ఓడించడం కోసం ఎన్టీఆర్ ను పదవినుండి తప్పించడం కూడా వ్యూహమే అని నమ్మించగలిగారు. అది ఒక వ్యూహం. ఒక చాతుర్యం. లక్ష్యం చేరుకునే క్రమంలో తాను ఎంచుకున్న మార్గం పట్ల తన చుట్టూ ఉన్నవారిలో నమ్మకం కలిగించడం ఒక రాజనీతి.
ఆ వ్యూహమే అత్యున్నత శిఖరానికి…..
ఈ వ్యూహమే చంద్రబాబును సెప్టెంబర్ 1, 1995న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసింది. ఈ అత్యున్నత శిఖరానికి ఆయన మూడుసార్లు చేరుకోగలిగారు. ఈ వ్యూహమే రాష్ట్ర ప్రజలు దేవుడిగా ఆరాధించిన ఎన్టీఆర్ ను పక్కన పెట్టినా, పదవీచ్యుతుణ్ణి చేసినా చంద్రబాబును క్షమించి ఆదరించేలా చేసింది. లేకపోతే తమ ఆరాధ్య దైవం అయిన ఎన్టీఆర్ ను పదవీచ్యుతుణ్ణి చేస్తే ప్రజలు సహించే వారా? తమ తండ్రిని పదవీచ్యుతుణ్ణి చేస్తే బిడ్డలు మద్దతిచ్చేవారా? అదీ ఆయన ఎంచుకున్న, అవలంభిస్తున్న వ్యూహం. ఆ వ్యూహం, ఆ పంధా ఇప్పటికీ అలానే కొనసాగుతోంది.
(రెండవ భాగం)
– గోపీ దారా సీనియర్ జర్నలిస్ట్..

