ఆగమన్నారు కాని.. అదృశ్యం కమ్మని చెప్పలేదే?
ఎక్కడి చంద్రబాబు.. ఎలా అయిపోయారు. ఇది రాజకీయ వర్గాల్లోనే కాదు టీడీపీలోనూ ఒక చర్చగా ఉంటోంది. ఒకనాటి దర్జా ఏదీ. నాడు 23 జిల్లాలను శాసించిన నిబ్బరమేదీ, [more]
ఎక్కడి చంద్రబాబు.. ఎలా అయిపోయారు. ఇది రాజకీయ వర్గాల్లోనే కాదు టీడీపీలోనూ ఒక చర్చగా ఉంటోంది. ఒకనాటి దర్జా ఏదీ. నాడు 23 జిల్లాలను శాసించిన నిబ్బరమేదీ, [more]

ఎక్కడి చంద్రబాబు.. ఎలా అయిపోయారు. ఇది రాజకీయ వర్గాల్లోనే కాదు టీడీపీలోనూ ఒక చర్చగా ఉంటోంది. ఒకనాటి దర్జా ఏదీ. నాడు 23 జిల్లాలను శాసించిన నిబ్బరమేదీ, ఏ ధీమా కూడా ఇపుడు కానరావడంలేదే. అంతేనా. పాతికేళ్ళపాటు టీడీపీని ఒంటిచేత్తో నడిపించిన పెద్ద మనిషి ఇపుడు ఒంటి స్థంభం మేడలో ఏకాకిగా మారిపోవడం ఏంటి. ఇది చాలదా టీడీపీ అవరోహణ క్రమం ఎలా ఉందో చెప్పడానికి. దీనికి తలపండిన రాజకీయ మేధావులు ప్రత్యేకంగా విశ్లేషించాలా?
పొరుగు నేల మీదనే…..
ఈసారి స్వాతంత్ర దినోత్సవం టీడీపీకి ప్రత్యేకమైనదే. అధినేత చంద్రబాబు ఒంటరిగా తన ఇంటి మేడ మీద గాంధీ చిత్ర పటం ఒక కుర్చీలో పెట్టి పక్కన జెండా ఉంచి వందనం సమర్పించారు. ఈ దేశానికి ఒకనాడు ప్రధాని రేసులో ఉన్నవాడు, ఉమ్మడి ఏపీని తొమ్మిదేళ్ల పాటు ఏలిన వాడు, నవ్యాంధ్రాకు తొలి సీఎం ఇలా ఇంత నీరసంగా జాతీయ పండుగను చేసుకోవడం ఏంటి. తెలుగుదేశానికి ఏమైంది. ఆ వైభవానికి ఎందుకు మబ్బులు కమ్ముకున్నాయి. చెప్పాలంటే ఇదంతా చంద్రబాబు స్వయంకృతమే. తాను కోరి చేసుకున్నదే.
తెంచేసుకున్నారా…?
ఎపీలోనే చంద్రబాబు రాజకేయమంతా ఉంది. కానీ చంద్రబాబు మాత్రం పొరుగు రాష్ట్రంలో కాపురం ఉంటున్నారు. ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా ఆరునెలలుగా ఆయన ఏపీ ముఖం చూడడం మానేశారు. నిజమే కరోనా మహమ్మారి ఉంది. కానీ అది ఇప్పట్లో తగ్గేలా లేదు, వ్యాక్సిన్ ఇప్పట్లో వస్తుందో రాదో కూడా ఎవరికీ తెలియదు, అందువల్ల అదే సాకుగా చూపి జూమ్ నాయుడుగా మారిపోవాలా. ఎక్కడా తిరగకుండా ఇంటికే పరిమితం కావాలా. ఆరు పదుల వయసులో ఉన్న బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు కరోనా వేళ అయినా చురుకుగా తిరుగుతున్నారు. వరదలు వచ్చిన చోట పర్యటిస్తున్నారు. నేనున్నాను అని జనానికి భరోసా ఇస్తున్నారు. మరి చంద్రబాబు ఎందుకు బయటకు రారు. ఇది తమ్ముళ్ళను కూడా వేధిస్తున్న ప్రశ్న. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నట్లుగా ఏపీకి రాకుండా ఎక్కడో కూర్చుని మాట్లాడే బాబుకు ప్రశ్నించే నైతిక హక్కు లేదనే చెప్పాలా.
తెర వెనక్కేనా….?
సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటామని చంద్రబాబు తరచూ చెబుతూంటారు. మరి కరోనా వేళ కొత్త అవకాశాలు ఎందుకు సృష్టించుకోలేకపోతున్నారో ఆయనకే తెలియాలేమో. ఏపీలో కరోనాతో జనం అల్లాడుతున్నారు. వరదలతో అతలాకుతలం అవుతున్నారు. మహానగరాల్లో వరసగా జరిగిన అగ్ని ప్రమాదాల్లో జనం సజీవ సమాధి అయ్యారు. ఇలా అనేకమైన పరిణామాలు జరుగుతునాయి. కానీ చంద్రబాబు జూమ్ వీడియో ముందేసుకుని ఆరోపణలు చేస్తే రాజకీయం అయిపోతుంది అనుకుంటున్నారు. అధికార పార్టీ మీద బురద జల్లితే ఓ పని అయిపోతుందనుకుంటున్నారు. మరి ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ ఆలోచనలు ఇంతేనా అని విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయంటే తప్పులేదుగా. 2019 ఎన్నికల్లో బాబుని, టీడీపీని జనం ఆగమన్నారు కానీ అదృశ్యం కమ్మనలేదు. వైసీపీ తప్పులు చేస్తే చాన్స్ దక్కేది టీడీపీకే. కానీ దాన్ని దొరకబుచ్చుకోవాలన్న కోరిక ఆశ చంద్రబాబులో ఉన్నాయో లేవో అర్ధం కావడంలేదు. తానే తెర దించేసి వెనక్కుపోతున్నారా అన్న డౌట్లు సొంత పార్టీలోనే వస్తున్నాయి. బాబూ..ఇలా కాదు రాజకీయం చేయడం అంటే అని తమ్ముళ్ళే అనే రోజు వస్తుందేమో చూడాలి.

