నెల్లూరును రీసెట్ చేసే పనిలో చంద్రబాబు..?
నెల్లూరు టీడీపీ రాజకీయాలు మారుతున్నాయి. నెల్లూరు రాజకీయాలు అంటేనే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం హవా ఎక్కువగా ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొన్ని దశాబ్దాల [more]
నెల్లూరు టీడీపీ రాజకీయాలు మారుతున్నాయి. నెల్లూరు రాజకీయాలు అంటేనే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం హవా ఎక్కువగా ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొన్ని దశాబ్దాల [more]

నెల్లూరు టీడీపీ రాజకీయాలు మారుతున్నాయి. నెల్లూరు రాజకీయాలు అంటేనే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం హవా ఎక్కువగా ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొన్ని దశాబ్దాల పాటు రెడ్ల హవానే ఉంటుంది. టీడీపీ అధికారంలో ఉన్నా సరే ఈ జిల్లాలో రెడ్డి మంత్రే ఉంటారు.. వాళ్లదే పెత్తనం ఉంటుంది. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్, ఇప్పుడు అధికార పార్టీ వైసీపీలో రెడ్డి వర్గం దూకుడు పెంచింది. జిల్లా రాజకీయాలను తమ కనుసైగలతో శాసించే రెడ్డి వర్గం దూకుడుకు అడ్డుకట్ట వేస్తేనే తప్ప.. టీడీపీ పుంజుకునే అవకాశం లేదని పార్టీ అధిష్టానం భావిస్తోంది. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న రెడ్డి వర్గాన్ని ఆకర్షించాలని చంద్రబాబు భావిస్తున్నారట. జిల్లా రెడ్డి వర్గంలో చీలిక తెస్తే తప్ప నెల్లూరు జిల్లాలో పార్టీ బతికి బట్టకట్టదన్న క్లారిటీ చంద్రబాబుకు ఉందని టీడీపీ తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే అందుకు అనుగుణంగా ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి.
అక్కడ కూడా రెడ్లకే……
అదే సమయంలో కమ్మ వర్గాన్ని సంతృప్తి పరచడం ఇప్పుడు కత్తి మీద సాములా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో మెట్ట ప్రాంతంలోని వెంకటగిరి, ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల నుంచి మాత్రమే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకులు టీడీపీలో చక్రం తిప్పుతున్నారు. అయితే, వీరిని సమూలంగా మార్చేసి.. రెడ్డి వర్గానికి ప్రాధాన్యం పెంచాలని భావిస్తున్నారు. అదే సమయంలో యువతకు కూడా ప్రాధాన్యం పెంచాలని చూస్తున్నారు. ఉదయగిరిని కమ్మకు ఇవ్వాలని బాబు మనసులో ఉన్నా ఇక్కడ రెడ్ల హవా ఎక్కువుగా ఉండడంతో దీనిని కూడా తప్పని పరిస్థితుల్లో రెడ్డి వర్గానికి కేటాయించాలని భావిస్తున్నారు.
రెండు నియోజకవర్గాల్లో….
గత మూడు ఎన్నికల్లోనూ ఉదయగిరి సీటు కమ్మ వర్గానికే చెందిన బొల్లినేని రామారావుకు కేటాయిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బొల్లినేని ఉదయగిరిని పట్టించుకోవడం మానేశారు. ఈ క్రమంలోనే ఈ సీటు కోసం రెడ్డి వర్గానికి చెందిన నేతను ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇక ఆత్మకూరులో బొల్లినేని కృష్ణయ్యకు అవకాశం ఇచ్చారు. ఈ రెండు సీట్లతో పాటు చంద్రబాబు కమ్మ నేతకు సీటు ఇచ్చిన వెంకటగిరిలోనూ పార్టీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీ పరిస్థితిపై అధ్యయనం చేసిన చంద్రబాబు.. అనూహ్యంగా ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలను రెడ్ల చేతిలో పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
వారిలో ఆందోళన…..
నిజానికి బొల్లినేని రామారావు ఉదయగిరిలో యాక్టివ్గా లేరు. ఇక, ఆత్మకూరులో బొల్లినేని కృష్ణయ్య విజిటింగ్ నాయకుడు అయిపోయారు. దీంతో వారిని తప్పించి.. రెడ్డి వర్గానికి ప్రాతినిధ్యం పెంచితే.. అధికార పార్టీ నుంచి కూడా అసంతృప్తులు ఇక్కడకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నెల్లూరు వైసీపీలో చాలా మంది రెడ్డి నేతలకు జగన్ పదవులు సర్దుబాటు చేయలేని పరిస్థితి ఉంది. వీరంతా ఇప్పుడ కాకపోయినా రేపైనా టీడీపీలోకి జంప్ చేసేందుకు ( నియోజకవర్గ ఇన్చార్జ్ ఇస్తేనే) రెడీగా ఉన్నారు. ఇక చంద్రబాబు ఉదయగిరి, ఆత్మకూరు రెడ్లకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటోన్న క్రమంలో జిల్లా కమ్మ వర్గంలో ఆందోళన మొదలైంది.
వెంకటగిరి మాత్రమే….
అప్పుడు వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఒక్కరు మాత్రమే కమ్మ నేతగా ఉంటారు. ఇక, రేపు జిల్లాల విభజన జరిగితే.. వెంకటగిరి తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోతుంది. అదే సమయంలో ప్రకాశం నుంచి కందుకూరు నియోజకవర్గం నెల్లూరులో కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు మినహా అన్నింటినీ రెడ్డి సామాజికవర్గానికి ఇస్తే.. పార్టీ పుంజుకునే అవకాశం ఉందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. జిల్లాల పునర్విభజన జరిగితే నెల్లూరు జిల్లాలో కమ్మలకు రాజకీయ భవిష్యత్తు కష్టమవుతుంది. ఈ చర్చలు బయటకు వస్తోన్న క్రమంలో జిల్లా కమిటీల్లో ఒక్క తెలుగు యువత తప్ప ఏ కమిటీల్లోనూ కమ్మలకు ప్రాధాన్యం లేకుండా చేశారని వారు గుస్సాతో ఉన్నారు. జిల్లాలో కమ్మ వర్గం నేతలను సొంత పార్టీ వాళ్లే ఓ వైపు తొక్కుతుంటే.. కమ్మ వర్గం నేతలు ఆశలు పెట్టుకున్న సీట్లు కూడా రెడ్ల చేతుల్లో పెట్టేస్తే రేపు మా భవిష్యత్తు ఏంటన్న ఆందోళన ఈ వర్గం నేతల్లో ఉంది.
