అచ్చెన్న విషయంలో బాబు దూకుడు.. తెరవెనుక రీజన్ ఇదే..!
టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో కొన్ని ఆసక్తికర విషయాలు.. ఇప్పుడు అదే పార్టీలో అంతర్గత చర్చకు దారితీస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు చెబుతున్నట్టుగానే టీడీపీ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో కొన్ని ఆసక్తికర విషయాలు.. ఇప్పుడు అదే పార్టీలో అంతర్గత చర్చకు దారితీస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు చెబుతున్నట్టుగానే టీడీపీ [more]

టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో కొన్ని ఆసక్తికర విషయాలు.. ఇప్పుడు అదే పార్టీలో అంతర్గత చర్చకు దారితీస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు చెబుతున్నట్టుగానే టీడీపీ నేతలపైనా.. మాజీ ఎమ్మెల్యేలపైనా పోలీసులు.. ఇతర అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. కొందరినైతే.. అరెస్టు లు చేసి జైల్లో కూడా పెట్టారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.. చింతమనేని ప్రభాకర్. ఆయనను దాదాపు 60 రోజుల పాటు జైలు నుంచి బయటకు రాకుండా పోలీసులు వివిధ కేసులు పెట్టి.. బెయిల్ వస్తూనే మరో కేసు పెట్టి జైలుకు తరలించారు. ఇక, రాజధాని విషయంలోనూ అనేక మందిపై పోలీసులు కేసులు పెట్టారు.
బాబు ఎందుకిలా?
ఇవన్నీ ఇలా ఉంటే.. ప్రకాశంలో మైనింగ్ అక్రమాలు అంటూ.. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు (ఇప్పుడు వైసీపీ)పై కేసులు పెట్టారు. రూ.400 కోట్లు ఫైన్ విధించారు. ఇక అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి విషయంలోనూ అధికారులు కన్నెర్ర చేశారు. అదే సమయంలో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విషయంలోనూ కేసులు ఉన్నాయి. విజయనగరం మాజీ ఎంపీ అశోక్ గజపతిని ఆయన కుటుంబంతోనే డమ్మీ చేసేశారు. ఇలా అనేక మంది టీడీపీ నాయకులు చంద్రబాబు చెప్పినట్టు వారి ప్రమేయం లేకుండానే జగన్ ప్రభుత్వం వేధించిందని అనుకుందాం. కానీ, అప్పట్లో చూపించనిదూకుడు ఒక్కసారిగా.. అచ్చెన్న విషయంలో ఎందుకు చంద్రబాబు చూపిస్తున్నారు? అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది.
అచ్చెన్నను గట్టిగా నమ్మడంతో…..
ఇదేదో బయట వారికి వచ్చిన సందేహం కాదు. సాక్షాత్తూ టీడీపీలోనే సాగుతున్న చర్చ. ఈ నేపథ్యంలో వారిలో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. పార్టీలో 2016 నుంచి అచ్చెన్నకు ప్రాధాన్యం పెరిగింది. మంత్రిగా ఉన్నప్పటికీ.. తొలి నాళ్లలో ఆయనను నమ్మని చంద్రబాబు తర్వాత ఆయనను నమ్ముతూ వచ్చారు. దీంతో పార్టీలో షార్ప్ షూటర్‌గా మారేలా చేశారు. కాపుల విషయంలో వెల్లువెత్తిన నిరసనలపై అచ్చెన్న ఆయుధాన్నే చంద్రబాబు అప్పట్లో వాడుకున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఇటీవల కాలంలో అచ్చెన్ననే వినియోగించారు. అక్కడ ఏ సమస్య వచ్చినా, అచ్చెన్నను నమ్మడం చంద్రబాబు ప్రారంభించారు. ఇక, గతప్రభుత్వంలో జరిగిన అనేక లొసుగులు కూడా అచ్చెన్నకు తెలుసుననే వాదన తమ్ముళ్లమధ్యే చర్చకు వస్తోంది.
అందుకోసమేనట…..
ఈ నేపథ్యంలో అచ్చెన్నకు ఇప్పుడు వచ్చిన కష్టం సమయంలో తనంటూ స్పందించకపోతే.. ఆయన నొచ్చుకుని ఎవరికైనా ఈ లొసుగులు చెప్పేస్తే.. ఏంటి పరిస్థితి? అనే బాధ చంద్రబాబులో ఉందని సీనియర్లు అనుకుంటున్నారు. అదే సమయంలో బీసీకార్డును వాడుతున్న చంద్రబాబు బీసీ నాయకుడికి ఎదురైన కష్టం సమయంలో తాను అండగా నిలిచిపోయిన బీసీ ఓట్లను తనవైపు మళ్లించుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా అంటున్నారు. మొత్తంగా.. అచ్చెన్న విషయంలో చంద్రబాబు స్పందన ఒకటి రాజకీయం.. రెండు వ్యక్తిగతం అనే చర్చ పార్టీలో జరుగుతుండడం గమనార్హం. అందుకే.. చంద్రబాబు సామాజిక వర్గం నేతలు సైలెంట్‌గా ఉన్నారనే వాదన కూడా వినిపిస్తోంది. మొత్తంగా పరిస్థితి ఎటు తిరుగుతుందో చూడాలి.

