సరే చూద్దాం కానీ…?
సమస్య సమసిపోతుందంటే రాజకీయపార్టీలు ఒప్పుకోవు. దానిని సాగదీసి ప్రజల్లో చర్చకు పెట్టి రచ్చ చేసి తమ పార్టీల ప్రయోజనాలకు అనుగుణమైన ఫలితం రాబట్టేవరకూ ఎత్తుగడలు వేస్తూనే ఉంటాయి. [more]
సమస్య సమసిపోతుందంటే రాజకీయపార్టీలు ఒప్పుకోవు. దానిని సాగదీసి ప్రజల్లో చర్చకు పెట్టి రచ్చ చేసి తమ పార్టీల ప్రయోజనాలకు అనుగుణమైన ఫలితం రాబట్టేవరకూ ఎత్తుగడలు వేస్తూనే ఉంటాయి. [more]

సమస్య సమసిపోతుందంటే రాజకీయపార్టీలు ఒప్పుకోవు. దానిని సాగదీసి ప్రజల్లో చర్చకు పెట్టి రచ్చ చేసి తమ పార్టీల ప్రయోజనాలకు అనుగుణమైన ఫలితం రాబట్టేవరకూ ఎత్తుగడలు వేస్తూనే ఉంటాయి. వ్యూహాలు పన్నుతూనే ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ తరహా ధోరణులు పతాకస్థాయికి చేరుకున్నాయి. విధానపరంగా చూస్తే ప్రజాసమస్యలను తమ ఆలోచనలు, దార్శనికత మేరకు పరిష్కరించి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే యంత్రాంగమే రాజకీయం. అధికార,ప్రతిపక్షాలు పోషించాల్సిన పాత్ర ఇదే. అసలు సమస్యే లేకపోతే రాజకీయమే లేదు. అందుకే సాధ్యమైనన్ని ఎక్కువ సమస్యలను టేకప్ చేసి వాటిపై ఆందోళన చేస్తుంటారు రాజకీయ నాయకులు. అధికారంలో ఉన్నవారు అన్నిటినీ పరిష్కరిస్తున్నామని చెబుతుంటారు. ప్రతిపక్షాలు అందులోని లోపాలను వెదుకుతుంటాయి. పోరాటం మాత్రం నిరంతరం సాగుతూనే ఉంటుంది. సైద్ధాంతిక విభేదాలు, భావ సంఘర్షణ తో గతంలో రాజకీయాలు నడుస్తుండేవి. ఒక సమస్య పరిష్కారానికి భిన్నమైన మార్గాలను అనుసరిస్తుండటమే అభిప్రాయ భేదాలుగా వ్యక్తమవుతుండేవి. రాజకీయాల్లో ఈ పద్ధతి పాతబడిపోయింది. లేని సమస్యను తామే సృష్టించి దాని చుట్టూ రాజకీయాన్ని కేంద్రీకరించడం కొత్త ట్రెండ్. ఈ విషయంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు పరస్పరం పోటీలు పడుతున్నాయి.
పట్టు వదలడు…
వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు రూపుదిద్దుకోవడం ప్రాంతీయపార్టీల్లో కొత్తేమీ కాదు. ఆయా నాయకులే తమ పార్టీలకు చుక్కానిగా, కేంద్రంగా ఉంటారు. కరకట్ట మీద చంద్రబాబు నాయుడి నివాసం అన్నది రాష్ట్రంలోని సవాలక్ష అక్రమ కట్టడాల్లో ఒకటి. కానీ అధికార,విపక్షాలు ఇప్పుడు అదో పెద్ద విషయం చేసేశాయి. అధికార వైసీపీ తన పంతాన్ని నెగ్గించుకోవాలనే ధోరణిలోకి వచ్చేసింది. ప్రభుత్వ యంత్రాంగంతో తెగేదాకా లాగించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిపక్షం దీనిపైనే ఫోకస్ పెట్టి కక్ష సాధింపు ధోరణిని ఎస్టాబ్లిష్ చేయాలని పట్టుదలకు పోతోంది. రెవిన్యూ, ఇరిగేషన్, మునిసిపల్, సీఆర్డీఎ యంత్రాంగాలు అన్నీ ఈవిషయంలో తలమునకలైపోతున్నాయి. న్యాయవ్యవస్థ ఆధారంగానూ పోరాటం మొదలైంది. కృష్ణా,గుంటూరు జిల్లాల్లో నివాసం కల్పించుకోవడం చంద్రబాబు నాయుడికి పెద్ద సమస్య కాదు. అనుమతులు లేవని సర్కారు తేల్చిచెప్పిన తర్వాత కూడా అదే ప్రాంతంలో నివాసం కొనసాగించడంలో ఆంతర్యమేమిటి? అక్కడే రాజకీయం దాగి ఉంది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి శైలిని, సైకాలజీని పూర్తిగా అర్థం చేసుకున్న ప్రతిపక్షనేత ఇందులో ఎంతోకొంత పొలిటికల్ మైలేజీ పార్టీకి, తనకు లభిస్తుందనే అంచనాకు వచ్చారు. దాంతో పట్టు బిగించారు. అక్రమ నిర్మాణమని అధికారపార్టీ గగ్గోలు పెడుతున్నప్పటికీ చంద్రబాబు స్పందించడం లేదు. వరద బాధితుల సంగతి పక్కనపెట్టి చంద్రబాబు నివాసంపై వరద సమయంలోనే మంత్రులు కేంద్రీకరించారనే విమర్శలు వచ్చాయి. ఇటువంటి అంశాలు ఎంతగా చర్చనీయమైతే ప్రతిపక్షానికి అంతగానూ ప్రయోజనదాయకమని తెలుగుదేశం ఎదురుచూస్తోంది. అందుకే చంద్రబాబు అదే నివాసంలో ఉంటున్నారు. బలవంతంగా ఖాళీ చేయించి తాను రోడ్డుమీద పడాల్సిన పరిస్థితి వస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో ప్రతిపక్ష నేతకు బాగా తెలుసు. కచ్చితంగా రాష్ట్రప్రజల మీద సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. అంతవరకూ ఎదురుచూడాలని నిశ్చయించుకోవడంతోనే ఖాళీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు .
గుట్టువిప్పడు…
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయించాలని మంత్రులు, యంత్రాంగం ఒక నిర్ణయానికి వచ్చేశాయి. ఇప్పుడు వెనక్కి వెళితే కొంత అవమానభారమే. అందువల్లనే న్యాయస్థానంలో సైతం భవన యజమానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తోంది సర్కారు. ఉన్నతస్థాయి సమీక్షలకు అనుకూలంగా ఉన్న కోట్ల రూపాయల విలువైన ప్రజావేదికను కూల్చివేయడంలోనే ప్రభుత్వ ఉద్దేశం స్పష్టమైపోయింది. చంద్రబాబు నాయుడు నివాసముంటున్న కరకట్టభవనాన్ని కూల్చడంతోనే ముఖ్యమంత్రి లక్ష్యం నెరవేరుతుంది. యంత్రాంగం ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిర్మాణ సమయంలో అనుమతులు ఇచ్చిన పంచాయతీ, నీటిపారుదల శాఖ సమాధానం చెప్పుకోవాల్సిన స్థితి. ఈ భవనం తొలగింపుతో సమస్య సద్దుమణిగిపోతుంది. పూర్తిగా రాజకీయ రంగు పులుముకుని అధికార, ప్రతిపక్షాలకు ప్రతిష్ఠాత్మకంగా మారిపోయింది. రాష్ట్రంలోని కృష్ణా,గోదావరి నదులను చేర్చి ఉన్న 70వేల గృహాలు, ఇతర అనధికార ఆక్రమణల అంశాలు మరుగున పడిపోతాయి. ఈ కూల్చివేత పూర్తయ్యేవరకూ మిగిలిన వాటి సంగతేమిటనే ప్రశ్న తలెత్తుతూనే ఉంటుంది. అందుకే కూల్చివేయకుండా నిరోధించే యత్నాల్లో ప్రతిపక్షం, కూల్చివేసి తీరాల్సిందేనని అధికారపార్టీ పట్టు బట్టుకు కూర్చున్నాయి.
తాడో ..పేడో…
అన్నింటా రాజకీయాన్నే నొల్లుకోవాలని చూస్తున్న అధికార వైసీపీ,ప్రతిపక్ష టీడీపీలు నిజమైన ప్రజాసమస్యలపై పోరాటం చేసే సత్తువను , పరిష్కరించాల్సిన సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. సర్కారుకు కావాల్సింది చేసి పెడితే చాలు అన్న ధోరణిలో యంత్రాంగం యోచిస్తుంది. ప్రజలు ఎదుర్కొంటున్న రియల్ ఇష్యూస్ మీద ఫోకస్ తగ్గించి తమ పార్టీ, అధినేత చంద్రబాబు అంటూ టీడీపీ కోణంలోనే పరిమితమైపోతోంది ప్రతిపక్షం. నిజంగా అన్యాయానికి గురవుతున్నది ప్రజలే. భవనయజమాని ముఖ్యమంత్రిని ఉద్దేశించి రాసిన లేఖ కొన్ని నగ్న సత్యాలను బయటపెట్టింది. పారిశ్రామికవేత్తలు, వ్యాపార వర్గాలు ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి వత్తాసు పలుకుతారు. వారికి మాత్రమే సానుకూలంగా వ్యవహరిస్తారనే నిజాన్ని ప్రత్యక్షంగానే లేఖలో అంగీకరించారు. కాంట్రాక్టర్లు సైతం అంతే. వివిధ ప్రాజెక్టులకు కొత్త ప్రభుత్వంలోనూ పాత గుత్తేదారులే పోటీపడి టెండర్లు దక్కించుకోవడం ఇందుకు నిదర్శనం. అందుకే అక్రమ కట్టడమా? కాదా? దాని యజమాని ఎవరు ? అన్నది ఇప్పుడు పెద్ద సమస్య కాదు. దాని కూల్చివేతలో ఎవరి పంతం నెగ్గుతుంది? ఎవరికి రాజకీయ ప్రయోజనం దక్కుతుందన్నదే పొలిటికల్ ఈక్వేషన్.
-ఎడిటోరియల్ డెస్క్

