గురి తప్పకుండా గోల్ కొట్టాలి
భారతీయ జనతాపార్టీని ఉత్తరాది పార్టీగా ముద్ర వేస్తుంటారు. కర్ణాటక మినహా దక్షిణాదిన ఎక్కడా స్థానం లేదంటూ ఇక్కడి పార్టీలు ప్రచారం చేస్తుంటాయి. ఇది నిన్నామొన్నటివరకూ వాస్తవమే కూడా. [more]
భారతీయ జనతాపార్టీని ఉత్తరాది పార్టీగా ముద్ర వేస్తుంటారు. కర్ణాటక మినహా దక్షిణాదిన ఎక్కడా స్థానం లేదంటూ ఇక్కడి పార్టీలు ప్రచారం చేస్తుంటాయి. ఇది నిన్నామొన్నటివరకూ వాస్తవమే కూడా. [more]

భారతీయ జనతాపార్టీని ఉత్తరాది పార్టీగా ముద్ర వేస్తుంటారు. కర్ణాటక మినహా దక్షిణాదిన ఎక్కడా స్థానం లేదంటూ ఇక్కడి పార్టీలు ప్రచారం చేస్తుంటాయి. ఇది నిన్నామొన్నటివరకూ వాస్తవమే కూడా. మూలాలు బలంగా లేకపోవడం, ప్రాంతీయ పార్టీలు ప్రధాన భూమిక పోషిస్తుండటంతో దక్షిణ భారతంలో నిలదొక్కుకోవడం బీజేపీకి సాధ్యం కాలేదు. తమిళనాడులో పూర్తిగా ప్రాంతీయ పార్టీల హవా నెలకొనడంతో అక్కడ జాతీయ పార్టీలు సొంతంగా సాధించగలిగేదేమీ లేకుండా పోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసు వర్సస్ తెలుగుదేశం అన్నది 2014 వరకూ ఉన్నపరిస్థితి. రాష్ట్ర విభజన, టీఆర్ఎస్ బలోపేతం కావడం, వైసీపీ కొత్తగా పుట్టుకురావడంతో కాంగ్రెసు సైతం డీలా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలే రెండు రాష్ట్రాల్లో తమిళనాడు తరహాలో రాజ్యం చెలాయిస్తాయనే భావన వ్యాపించింది. కానీ భారతీయ జనతాపార్టీ దేశవ్యాప్తంగా రాజకీయంగా ఏర్పడిన సానుకూల వాతావరణాన్ని ప్రాతిపదికగా చేసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని పావులు కదుపుతోంది. ఇందుకు అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు వ్యూహాత్మక తప్పిదాలతో కమలానికి కండువా వేస్తున్నాయనే చెప్పాలి.
అయాచిత వరం…
తెలంగాణలో పోటీ అంటే టీఆర్ఎస్, కాంగ్రెసు ప్రధాన పక్షాలు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే వైఎస్సార్ కాంగ్రెసుపార్టీ, తెలుగుదేశం పార్టీలు ప్రత్యర్థులు. మిగిలిన పార్టీలు గెలుసు సాధించేంతటి శక్తులు కావు అనేది ప్రజల మనస్సులో పాతుకుపోయిన అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికలు ఇదే విషయాన్ని నిరూపించాయి. కానీ ఈ లెక్కలు సరిచేయాలని తనకున్న జాతీయ ప్రాబల్యాన్ని, రాష్ట్రాల్లో రాజకీయ అవకాశం గా మలచుకోవాలని బీజేపీ చకచకా కదులుతోంది. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో టీఆర్ఎస్, వైసీపీలు తమకు తెలియకుండానే ఆ స్పేస్ ను కమలం పార్టీకి కల్పిస్తున్నాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ దాదాపు ప్రతిపక్షాలనేవే లేకుండా ఏకచ్చత్రాధిపత్యం సాధించాలనే తలపుతో అనేక నిర్ణయాలు తీసుకుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు, ప్రత్యర్థులపై నిర్బంధం, వ్యతిరేక శక్తుల బలహీనతలను ఆసరాగా చేసుకుంటూ అణచివేత ఎత్తుగడలతో అప్రతిహతంగా ఎదిగింది. ఒక రకంగా తెలంగాణ గడ్డపై గట్టి పట్టు సాధించింది. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రసాదించిన పార్టీగా కాంగ్రెసు చేసుకునే క్లెయిమును పెద్దగా పట్టించుకోకుండా రాష్ట్రం సాధించిన పార్టీగా టీఆర్ఎస్ కే పట్టం గడుతూ వస్తున్నారు ప్రజలు. ఈ విషయంలో బీజేపీ సైతం కొంత టీఆర్ఎస్ కు సహకరించిందనే చెప్పాలి. 2018లో తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగేలా కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీగా బీజేపీ సంపూర్ణ సహకారం అందించిందనే చెప్పాలి. 2019 లోక్ సభ ఎన్నికల నాటికి నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకోవడంతో బీజేపీకి అయాచిత వరం లభించినట్లయింది. తనకూ తెలంగాణపై ఆశలు పెరిగాయి.
తెలంగాణలో పట్టు…
తెలంగాణలో ఉండే రాజకీయ సమీకరణలే బీజేపీకి సహజ అవకాశం కల్పిస్తుంటాయి. రాష్ట్రంలో శాశ్వతమైన పట్టు సాధించాలనే తాపత్రయంలో టీఆర్ఎస్ కొన్ని పొరపాట్లు చేసింది. తెలంగాణ భావోద్వేగం, సంక్షేమ పథకాల దెబ్బతో కాంగ్రెసు కుదేలైపోయింది. ముస్లిం మైనారిటీలు 12 శాతం మేరకు రాష్ట్రంలో ఉన్నారు. హైదరాబాదు తర్వాత ఉమ్మడి నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, వరంగల్లు, రంగారెడ్డి వంటి జిల్లాలో 30 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగల సంఖ్యలో ముస్లింలున్నారు. ఎంఐఎం తో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే వారి ఓట్లన్నీ సంఘటితంగా టీఆర్ఎస్ వైపు మళ్లడానికి అవకాశం ఉంటుందనేది టీఆర్ఎస్ యోచన. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక భావంతో మైనారిటీలు కాంగ్రెసు వైపు మొగ్గు చూపుతారనే అంచనా ఉంది. తెలంగాణలో దీనికి అడ్డుకట్ట వేయాలనేది టీఆర్ఎస్ ఎత్తుగడ. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడితే టీఆర్ఎస్ కు రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసు ను దెబ్బతీసేందుకు మైనారిటీ ఓటు అటువైపు మళ్లకుండా ఎంఐఎంతో మైత్రి బంధాన్ని ఏర్పాటు చేసుకుంది. ఈ రాజకీయ అవగాహనను తనకు అనువుగా మార్చుకుంటూ బీజేపీ పావులు కదుపుతోంది. చారిత్రకంగా బీజేపీ బలపడటానికి అవసరమైన సామాజిక ప్రాతిపదికలు తెలంగాణలో ఉన్నాయి. హిందూ బావ సంఘటనకు పూనుకోవడం ద్వారా టీఆర్ఎస్ కు సవాల్ విసరాలని బీజేపీ భావిస్తోంది. అంతేకాకుండా అధికార పార్టీలో అసంతృప్తులు, అణచివేత చర్యలు ఎదుర్కొంటున్నవారందరికీ వల విసురుతోంది. వారందరికీ ఆశ్రయంగా మారడం ద్వారా బలపడాలని చూస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉండటం కమలం పార్టీకి అదనపు ఆకర్షణ. అధికార టీఆర్ఎస్ కాంగ్రెసు నాయకుల మీదకు వెళ్లినంత దూకుడుగా బీజేపీ నాయకుల జోలికి వెళ్లడం సాధ్యం కాదు. దీనినే తన రాజకీయ పెట్టుబడిగా బీజేపీ సద్వినియోగం చేసుకుంటోంది. కాంగ్రెసును శాశ్వతంగా బలహీనపరచాలనే టీఆర్ఎస్ ఎత్తుగడ వికటించి మరో రకంగా బీజేపీ ఎదుగుదలకు పరోక్షంగా సహకరిస్తోంది.
ఆంధ్రాలో ఆసరా…
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీలు రెండూ యుద్ధ శిబిరాలను తలపింప చేస్తున్నాయి. నిన్నామొన్నటివరకూ అధికారంలో ఉన్న టీడీపీ తమ పార్టీ నాయకులు, క్యాడర్ పై అణచివేత చర్యలకు పాల్పడిందనేది వైసీపీ ఆరోపణ. లెక్క సరిచేసుకోవాల్సిందేనని తలపోస్తోంది. ఎన్నికలకు ముందు బీజేపీపై తీవ్రమైన అభియోగాలు మోపిన టీడీపీకి కేంద్రం నుంచి కూడా పెద్దగా ఆసరా దొరికే అవకాశం లేదు. లోపాయికారీ మార్గంలో కమలం పార్టీతో టీడీపీ అధిష్ఠానం సత్సంబంధాలు నెలకొల్పుకున్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో ప్రభావం చూపదు. కేసులు, తీవ్ర అణచివేతల నుంచి తప్పించుకోవాలంటే బీజేపీని ఆశ్రయించాల్సిందేనని అనేక నియోజకవర్గాల్లో నాయకులు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు అందుతున్నాయి. రాజ్యసభ సభ్యులు ఇందుకు మార్గం చూపించారనే చెప్పాలి. బీజేపీకి రెండు రకాలుగా ఆంధ్రప్రదేశ్ లో అవకాశాలు కలిసి వస్తున్నాయి. టీడీపీ నాయకులను చేర్చుకోవడం ద్వారా ఆర్థికంగా, అంగబలం రీత్యా పార్టీ బలపడేందుకు అవకాశాలు ఏర్పడతాయి. అదే సమయంలో తెలుగుదేశం బలహీనపడుతుంది. వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ తయారు కావచ్చు. వైసీపీకి ప్రజల్లో గట్టి మద్దతు ఉన్నప్పటికీ అధినేత కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి అభియోగాలు ఎదుర్కొంటూ ఉండటం సహజ బలహీనతగా పరిణమించింది. అటు టీడీపీని బలహీనపరచడం, ఇటు వైసీసీ పర్కారును కంట్రోల్ చేయడమనే ద్విముఖ వ్యూహంతో బీజేపీ ఆంధ్రాలో పావులు కదుపుతోంది. టీడీపీకి, వైసీపీకి బలమైన సామాజిక వర్గాల మద్దతు లభిస్తోంది. కమలం పార్టీకి ఆ రకమైన ఏదో ఒక వర్గం మద్దతు దొరికితే ప్రత్యామ్నాయంగా ఎదగడం కష్టం కాబోదు. కర్ణాటకలో లింగాయత్ వర్గం మద్దతు అధికారానికి బాటలు వేసింది అదే తరహాలో ఆంధ్రాలో ఏదో ఒక ప్రధాన సామాజిక వర్గం మద్దతు కోసం ఎదురుచూస్తోంది బీజేపీ. అటు తెలంగాణలో హిందూమత భావన, జాతీయవాదం, ఇటు ఆంధ్రాలో సామాజిక సమీకరణ, అధికార విపక్షాల బలహీనతల పునాదులపై ఎదగాలనేది బీజేపీ ఎత్తుగడ. ఈ వ్యూహం ఎంతమేరకు ఫలితమిస్తుందో కాలమే తేల్చాలి.
– ఎడిటోరియల్ డెస్క్

