రివెంజ్ ఇలా ఉంటే…?
ఒకరిపై ప్రతీకారం మరొకరికి వరంగా మారుతుంది. ఒక పార్టీని గత తప్పిదాలకు శిక్షించాలన్న ప్రయత్నం మరొక పార్టీకి ఊతమిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న శతృత్వ రాజకీయాలు అనూహ్యమైన [more]
ఒకరిపై ప్రతీకారం మరొకరికి వరంగా మారుతుంది. ఒక పార్టీని గత తప్పిదాలకు శిక్షించాలన్న ప్రయత్నం మరొక పార్టీకి ఊతమిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న శతృత్వ రాజకీయాలు అనూహ్యమైన [more]

ఒకరిపై ప్రతీకారం మరొకరికి వరంగా మారుతుంది. ఒక పార్టీని గత తప్పిదాలకు శిక్షించాలన్న ప్రయత్నం మరొక పార్టీకి ఊతమిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న శతృత్వ రాజకీయాలు అనూహ్యమైన మలుపులతో నూతన రాజకీయ సమీకరణలకు తెర తీస్తున్నాయి. పార్టీలతో సంబంధం లేకుండా పొలిటికల్ పోలరైజేషన్ కు దోహదం చేస్తున్నాయి. అటు తెలంగాణలో కాంగ్రెస్ పై టీఆర్ఎస్ చేపట్టిన ఆపరేషన్ కమలం పార్టీ పట్టు బిగించేందుకు ఉపయోగపడుతోంది. ఆంధ్ర్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటున్న ప్రతికూలత బీజేపీ బలపడేందుకు బాటలు వేస్తోంది. ఈ క్రమంలో పాలిటిక్స్ కొత్త పంథాకు , సిద్దాంతాలకు కారణమవుతున్నాయి.
ప్రతీకారం ఫలిస్తుందా…?
రాజకీయాల్లో ప్రతీకార ధోరణులు ప్రాంతీయపార్టీల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే పరస్పరం శత్రు శిబిరాలుగా మోహరించి కొన్ని దశాబ్దాలుగా ఉప్పునిప్పుగా చిటపటలాడుతున్నాయి. ఆ ధోరణి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సైతం వ్యాపించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ దీనికి పరాకాష్ఠగా నిలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. తమ ఎమ్మెల్యేలను కోల్పోయింది. అయితే ఎమ్మెల్యేలను చేర్చుకుని టీడీపీని ఇబ్బంది పెట్టకూడదని సిద్దాంతపరంగా నిర్ణయం తీసుకుంది వైసీపీ. కానీ టీడీపీ నాయకులు, శ్రేణుల విషయంలో కఠినంగానే వ్యవహరిస్తోంది. నాయకులు, కార్యకర్తలపై పెండింగులో ఉన్న కేసులను వెలికి తీస్తోంది. దీంతో రక్షణ కవచంగా బీజేపీని వినియోగించుకోవాలని చూస్తున్నారు టీడీపీ నాయకులు. కరడు గట్టిన టీడీపీ నాయకులు సైతం బీజేపీలో చేరిపోయేందుకు సిద్ధమవుతున్నారు.
అడ కత్తెరలో …
టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులపై అనేక రకాలుగా కేసులున్నమాట వాస్తవమే. దానినే సర్కారు అడ్వాంటేజ్ గా చేసుకుంటూ పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం తెలుగుదేశానికి సవాల్ గానే చెప్పాలి. వైసీపీ తన పార్టీలో చేర్చుకోదు. అసెంబ్లీలో సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈమేరకు ప్రకటన చేశారు. అయితే బీజేపీలో చేరితో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్య తీసుకోమని టీడీపీనే ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే సభాపతి వారిపై చర్యలు తీసుకుని అనర్హులను చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ చర్యలకు సిఫార్సు చేయలేక మౌనం వహిస్తే బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉందనే సందేహాలకు టీడీపీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలుగుదేశం నుంచి ఎవరొచ్చినా ఆహ్వానించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలనేది ఆపార్టీ ఎత్తుగడ. సాంకేతికంగా తన పార్టీలో చేరిన వారిని కాపాడుకోవడం ద్వారా బలమైన సంకేతాలను ప్రజల్లోకి పంపదలచుకుంది. పరోక్షంగా వలసలు పెరగడానికి ఈ చర్య దోహదం చేస్తుంది. టీడీపీకి ఉన్న క్యాడర్ కమలం పరిపుష్టికి కచ్చితంగా దోహదం చేస్తుంది.
కమలం..హస్తం…
తెలంగాణలో కాంగ్రెసుపార్టీని టార్గెట్ చేసిన టీఆర్ఎస్ బీజేపీ పట్ల ఉదాసీనంగానే వ్యవహరించింది. కాంగ్రెసు పార్టీలో ఉండే వర్గ విభేదాలు ఆపార్టీకి తెలంగాణలో ఎక్కడికక్కడ అడ్డుకట్టలుగా మారుతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఒక నేతను తమ అధినేతగా అంగీకరించి మనస్ఫూర్తిగా సహకరించే క్రమశిక్షణ కాంగ్రెసుకు లేదు. అదే సమయంలో తమలో ఎన్ని విభేదాలున్నప్పటికీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే బీజేపీలో అందరూ శిరసావహిస్తారు. ఈ విధేయత కారణంగానే బీజేపీ తెలంగాణలో సైతం బాగా పుంజుకొంటోంది. కాంగ్రెసు బలహీనపడుతోంది. హుజూర్ నగర్ ఎన్నిక లో కాంగ్రెసు ఘోరపరాజయం పార్టీ స్థితిని మరింతగా దిగజార్చే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్గత వైరుద్ధ్యాలు, వర్గ విభేదాలు మరింతగా ముదురుపాకాన పడతాయి. దీనిని బీజేపీ అడ్వాంటేజ్ గానే చూస్తోంది.
ఆగి చూడండి…
మహారాష్ట్ర, హర్యానాల ఫలితాలు అన్నిపార్టీలకూ బ్రేకులు వేసినట్లుగానే చెప్పుకోవాలి. ఇకపై ప్రాంతీయపార్టీల విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందు జాతీయపార్టీలు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. పరిస్థితులు ఏకపక్షంగా లేవనే విషయం స్పష్టమైంది. మహారాష్ట్ర, హర్యానాల ఫలితాలు అన్ని రాజకీయపార్టీలకు హెచ్చరికతో పాటు సందేశాన్ని సైతం ఇచ్చాయి. కష్టపడితే ప్రతిపక్షాల అవకాశాలకు కొదవ ఉండదు. ప్రాంతీయపార్టీలు సమగ్ర వ్యూహాన్ని అనుసరిస్తే వాటి మనుగడకు వచ్చే ప్రమాదమేమీ లేదు. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ప్రజల సమస్యలు, ఆందోళనలను పట్టించుకోకపోతే ఇబ్బందులు తప్పవనే సంకేతమూ ప్రజాతీర్పులో దాగి ఉంది.
-ఎడిటోరియల్ డెస్క్

