స్నేహమంటే ఇదేరా....!

అటల్ బిహారీ వాజ్ పేయి, లాల్ కృష్ణ అద్వానీ.... ఒక తల్లి బిడ్డలు కాదు. కనీసం వరుసకు కూడా అన్నదమ్ములు కారు. ఆ మాటకు వస్తే ఇద్దరూ ఒక దేశ పౌరులు కాడు కాదు. కానీ వారి మధ్య గల అనుబంధం అనన్యమైనది. వారి స్నేహానికి అవినాభావ సంబంధం ఉండే వారి స్నేహం అవిభాజ్యమైనది. అనిర్వచనీయమైనది. వారి స్నేహానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఒకరు మితవాది. మరొకరు అతివాది. అయినప్పటికీ ఒకరంటే మరొకరికి అపరిమితమైన గౌరవం, ప్రేమ, అభిమానం. ఒకరి అభిప్రాయాలు, మరొకరి అభిప్రాయాలు వేర్వేరు కావచ్చు. అంతమాత్రాన వారు విభేదించుకోలేదు. వ్యక్తిగత జీవితంలో, రాజకీయ ప్రయాణంలో పరిణితిని ప్రదర్శించారు. పరస్పరం అర్థం చేసుకున్నారు. అందుకనే వారి దశాబ్దాల పాటు కొనసాగింది. ఇద్దరూ ఆదర్శ స్నేహితులుగా మిగిలిపోయారు.
వేర్వేరు దేశాల్లో పుట్టినా.....
వాజ్ పేయి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించారు. రాజకీయంగా ఉత్తరప్రదేశ్ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అద్వానీ వాస్తవానికి ఇప్పటి పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన వారు. దేశ విభజన సమయంలో భారత్ కు వచ్చారు. గుజరాత్ ను తన రాజకీయ కార్యక్షేత్రంగా మలచుకున్నారు. ఇద్దరి దారులు వేరు కావచ్చు. కానీ గమ్యం ఒక్కటే. ఇద్దరి విధానాలు వేర్వేరు కావచ్చు. కానీ లక్ష్యం ఒక్కటే. "నా రాజకీయ జీవితంలో అటల్ జీ ది అగ్రస్థానం. ఆయన నాయకత్వాన్ని అన్ని వేళలా నేను అంగీకరిస్తాను. ఆయనతో సహచర్యాన్ని అమూల్య సంపదగా భావిస్తాను" అంటూ తన ఆత్మకథను ప్రారంభించారు. "అద్వానీ ఆప్తమిత్రుడు. ఆయనతో నా అనుబంధానికి ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. ఆయన నా కుడిభుజం. వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఆయన నిర్వహించిన క్లిష్టమైన పాత్రలు గుర్తుకువస్తాయి." అద్వానీ ఆత్మకధకు ముందుమాటలో రాసిన మాటలివి. అద్వానీతో అనుబంధం ఎంతబలమైనదో ఈ మాటలు చెబుతాయి.
ఆర్ఎస్ఎస్ నుంచి......
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), భారతీయ జన్ సంఘ్, జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీల్లో ఇద్దరూ కలసి పనిచేశారు. వీటిల్లో కొన్ని పార్టీలకు సారథ్య బాధ్యతలను నిర్వహించారు. వాటిని బలోపేతం చేయడానికి అవిశ్రాంతగా శ్రమించారు. ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. అయిదో దశకంలో ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల నుంచి 2004 లోక్ సభ ఎన్నికల వరకూ ఇద్దరూ కలసి పనిచేశారు. ఎవరు ఏ స్థానంలో ఉన్నా హోదాలకు అతీతంగా వ్యవహరించారు. ఇద్దరూ కలసి సరదాగా సినిమాలు చూసేవారు. వాజ్ పేయి కవితలను అద్వానీ శ్రద్థగా వినేవారు. కష్టకాలంలో ఒకరికి ఒకరు అండగా నిలబడ్డారు. హవాలా కుంభకోణంలో అద్వానీ పేరు వెలుగులోకి వచ్చినప్పుడు అటల్జీ హతాశులయ్యారు. వెంటనే తేరుకుని అండగా నిలబడ్డారు. అప్పట్లో ఆయన చూపిన సంఘీభావం, విశ్వాసం నాపై ప్రగాఢ ప్రభావాన్ని చూపాయి. పార్టీ అగ్రశ్రేణి నాయకులకు బలమైన సందేశాన్ని పంపామని అద్వానీ తరచూ గుర్తు చేసుకునే వారు.
ఒకరంటే ఒకరికి గౌరవం......
అద్వానీ కూడా అటల్జీ పట్ల అమితమైన గౌరవ ప్రతిపత్తులను చూపేవారు. ఆయన తన నాయకుడినని అంగీకరించేందుకు వెనుకాడే వారు కాదు. 1995లో ముంబయిలో పార్టీ మహాసభలు జరుగుతున్నాయి. అప్పట్లో అధ్యక్షుడిగా ఉండేవారు. సమావేశంలో అద్వానీ హఠాత్తుగా ఓ ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మా ప్రధాని అభ్యర్థి వాజ్ పేయి అని బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సభలో నిశ్శబ్దం నెలకొంది. సహజంగా ఏ పార్టీలో అయినా అధ్యక్షుడే ప్రధాని అభ్యర్థి అవుతారు. కానీ అటల్ జీ నాయకత్వ పటిమ, ఆయన వ్యక్తిత్వంపై గల గౌరవంతో ఈ ప్రకటన చేశాను. ఈ ప్రకటనతో గొప్ప త్యాగం చేశారని అప్పట్లో అద్వానీ వద్ద కొందరు ప్రస్తావించగా ఆయన కొట్టిపారేశారు. అటల్ జీకి గల అపారమైన ప్రజాదరణ దృష్ట్యా ఆయనే సరైన వ్యక్తి అని అద్వానీ అన్నారు. పదవుల కోసం అపరిమితమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఒక నాయకుడు మనస్ఫూర్తిగా మరో నాయకుడి పేరు ప్రతిపాదించడం అసాధారణమని చెప్పకతప్పదు.
వేర్వేరు అభిప్రాయాలైనా.....
అటల్, అద్వానీల మధ్య అభిప్రాయ బేధాలు లేకపోలేదు. భిన్న భావాలకు ప్రతీకగా ఉండేవారు కాబట్టే విభేదాలు సహజం. సమస్యలు, సంఘటనలపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. అంతర్గత ప్రజాస్వామ్యానికి పట్టం గట్టే వ్యవస్థలో ఇది సాధారణమే. ఇద్దరూ పరిణితి లో వ్యవహరించడం వల్ల విభేదాలు సమసి పోయేవి. అయోధ్య అంశం, గోద్రా అల్లర్ల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ తొలగింపు తదితర విషయాల్లో ఇద్దరి ఆలోచనలు కలిసేవి కావు. అయోధ్య ఘటన జరిగి ఉండాల్సింది కాదన్నది అటల్ జీ అభిప్రాయం. కానీ అద్వానీ వాదన భిన్నంగా ఉండేది. 2002 లో గోద్రా అల్లర్ల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ని తొలగించాలని వాజ్ పేయి భావించారు. ఇందుకు అద్వానీ అయిష్టతను ప్రదర్శించారు. అప్పట్లో గోవాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాజీనామా ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తమయింది. దీంతో వాజ్ పేయి పార్టీ మాటను గౌరవించారు. ఇలా చాలా విషయాల్లో విభేదించినప్పటికీ వ్యక్తిగతంగా తీసుకోకుండా వాస్తవిక థృక్పథంతో వ్యవహరించేవారు. దీంతో సమస్యలు సమసి పోయేవి.
జ్ఞాపకాలను మరిచేదెలా?
అటల్ బిహారీ వాజ్ పేయి అస్తమయం అందరికన్నా ఎక్కువ నష్టం లాల్ కృష్ణ అద్వానీకే. ఆరుదశాబ్దాల అనుబంధం గల సహచరుడిని కోల్పోవడం సాధారణమైన విషయం కాదు. బంధాలు, అనుబంధాలు, జ్ఞాపకాలు, అనుభవాలు, అభిప్రాయాలను ఒక్కసారిగా మార్చిపోవడం కష్టమైన విషయమే. ఎనిమిది పదుల వయసులోనూ జీవిత చరమాంకంలో ఉన్న అద్వానీని ఎప్పుడూ అటల్ జీ జ్ఞాపకాలు వెన్నాడుతుంటాయి. అయిదో దశకంలో ఇద్దరూ కలసి ఢిల్లీలో సినిమా చూసిన రోజులు, సంఘ్ పరివార్ ను పటిష్ట పర్చడానికి పడిన శ్రమ, అత్యవవసర పరిస్థితికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలు, బీజేపీని బలమైన జాతీయ పార్టీగా తీర్చిదిద్దడంలో చూపిన శ్రద్థ, విలువల పరిరక్షణకు చేసిన కృషి గుర్తుకు రావచ్చు. దేశ హితం కోసం ప్రభుత్వంలో కలసి పనిచేసిన రోజులు మదిలో నుంచి అంత త్వరగా తొలగిపోవు. ప్రధానిగా, డిప్యూటీ ప్రధానిగా ఇద్దరూ కలసి పనిచేసిన రోజులు చిరస్మరణీయమైనవి. దేశంలోనే కాక ప్రపంచ చరిత్రలో ఇద్దరి నేతల మధ్య అనుబంధం అజరామంగా నిలిచిపోతుంది.
-ఎడిటోరియల్ డెస్క్

