ఆదిత్యను అందుకోసమే?
ఆదిత్య థాక్రే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు నిజంగా చెప్పాలంటే థాక్రే కుటుంబం నుంచి తొలిసారి ప్రత్యక్ష్య ఎన్నికల్లో పాల్గొనిందీ ఆదిత్య ఠాక్రేనే. అయితే ఒక్కసారి ఎమ్మెల్యేగా [more]
ఆదిత్య థాక్రే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు నిజంగా చెప్పాలంటే థాక్రే కుటుంబం నుంచి తొలిసారి ప్రత్యక్ష్య ఎన్నికల్లో పాల్గొనిందీ ఆదిత్య ఠాక్రేనే. అయితే ఒక్కసారి ఎమ్మెల్యేగా [more]

ఆదిత్య థాక్రే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అసలు నిజంగా చెప్పాలంటే థాక్రే కుటుంబం నుంచి తొలిసారి ప్రత్యక్ష్య ఎన్నికల్లో పాల్గొనిందీ ఆదిత్య ఠాక్రేనే. అయితే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఆదిత్య థాక్రేను మంత్రిగా చేసేశారు తండ్రి ఉద్ధవ్ థాక్రే. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఆదిత్య థాక్రే ను మంత్రివర్గంలోకి తీసుకోవడం నిజంగా సంచలన నిర్ణయమే. అదీ సంకీర్ణ సర్కార్ లో ఇటువంటి నిర్ణయాలు చాలా అరుదుగా తీసుకుంటారు.
ముఖ్యమంత్రిగా చేయాలనుకున్నా…..
ఆదిత్య థాక్రే గత ఎన్నికల్లో వర్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అంతకు ముందు ఆదిత్య థాక్రే పాదయాత్ర కూడా చేశారు. అలా రాజకీయ అరంగేట్రం చేసిన ఆదిత్య థాక్రే తొలిసారే అదరగొట్టారు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన నెలన్నర రోజుల్లోనే మంత్రి పదవిని చేపట్టారు. నిజానికి ఆదిత్య థాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలన్నది ఉద్దవ్ థాక్రే ఆలోచన. అయితే ఈ ఆలోచనకు ఆదిలోనే అడ్డుకట్ట ను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వేశారు.
మిత్రులు అంగీకరించకపోవడంతో…
యువకుడు కావడం, రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకోకపోవడంతో అతి పెద్ద పదవి ఇవ్వ వద్దని మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీ సూచించాయి. అసలే కూటమి ప్రభుత్వం మిత్రుల మాటలను కాదనలేక శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే అప్పుడు మిన్నకున్నారు. అయితే విస్తరణ సమయంలో ఆయన ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఆదిత్య థాక్రేను మంత్రివర్గంలోకి తీసుకుని మిత్రులకు షాక్ ఇచ్చారు. ఇది ఎవరూ కాదనలేరు. శరద్ పవార్ కుటుంబ సభ్యుడైన అజిత్ పవార్ కూడా డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టడంతో ఆయన కూడా నో చెప్పలేని పరిస్థితి.
అనుభవం కోసం…..
ఇక శివసేన పార్టీలో థాక్రే కుటుంబానిదే ఆధిపత్యం. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే మాతృశ్రీ భవన్ ఎదుట ఆదిత్య థాక్రే ముఖ్యమంత్రి అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. అంతేకాకుండా ఆదిత్య థాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలంటూ శివసేన ఎమ్మెల్యేలు డిమాండ్ కూడా చేశారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కష్టంగా మారడంతో ఆ ప్రతిపాదనను ఉద్ధవ్ థాక్రే పక్కన పెట్టేశారు. చివరకు తనయుడు ఆదిత్య థాక్రేను మంత్రిగా చేసి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. రాజకీయ అనుభవంతో పాటు పాలనలో పట్టును ఆదిత్య థాక్రే తెలుసుకుంటారని ఉద్ధవ్ థాక్రే భావించే ఈ నిర్ణయం తీసుకున్నారు.

