2018 రాజస్థాన్ రాయల్స్ ఎవరు?

రాజస్థాన్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కమలనాధులకు కలవరం కలిగించాయి. రెండు లోక్ సభ స్థానాలు, ఒక అసెంబ్లీ స్థానానికి గత నెల 29న జరిగిన ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం భారతీయ జనతా పార్టీకి మింగుడుపడని పరిణామం. అల్వార్, అజ్మీర్ సిట్టింగ్ లోక్ సభ స్థానాలు, మండల్ ఘర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుపు బీజేపీ రాష్ట్ర, కేంద్ర పెద్దలకు శరాఘాతం వంటిది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతుంది. సాధారణంగా ఎక్కడైనా ఉప ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అధికారం చేతిలో ఉండటం, ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకపోవడం యావత్ పార్టీ యంత్రాంగాన్ని మొహరించడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి. కాని రాజపుత్రుల రాష్ట్రంలో ప్రజల ముందు ఈ పప్పులేవీ ఉడకలేదు. సిట్టింగ్ అభ్యర్థుల మరణం కారణంగా వారి బంధువులను రంగంలోకి దించినప్పటికీ ప్రజలు తిరస్కరించడం గమనార్హం. ప్రజల అసంతృప్తికి దర్పణం ఈ ఫలితాలు.
భారీ ఓట్ల మెజారిటీతో....
అల్వార్ లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థి కరణ్ సింగ్ యాదవ్ లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించడం కాంగ్రెస్ శ్రేణుల్లో కొండంత ఉత్సాహాన్ని నింపింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మహంత్ రెండు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. అంతటి మెజారిటీ మంచుముద్దలా ఇప్పుడు కరిగిపోయింది. అజ్మీర్ లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థి రఘుశర్మ 84 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సన్వర్ లాల్ లక్ష 71 వేలకు పైగా ఓట్లతో ఇక్కడ విజయం సాధించడం గమనార్హం. నాటి బీజేపీ భారీ మెజారిటీ ఇప్పుడు కకా వికలమయింది. ఇక మందల్ ఘర్ అసెంబ్లీ స్థానంలో కూడా బీజేపీకి భంగపాటు తప్పలేదు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంలో కూడా బీజేపీకి ఆశాభంగం ఎదురయింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కీర్తి కుమారి 18 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ దకర్ అప్పట్లో ఓడిపోయారు. ఇప్పుడే అదే అభ్యర్థి వివేక్ 12వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించడం విశేషం.
అన్ని ఎన్నికల్లో గట్టి పోటీ....
2013 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాలకు గాను 163 స్థానాలను సాధించిన బీజేపీ తనకు తిరుగులేదని చాటింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాలను గెలుచుకుని మళ్లీ తన పట్టును కాపాడుకుంది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిసారిగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 21 స్థానాలను సాధించిన కాంగ్రెస్ క్రమంగా బలపడసాగింది. మొత్తం 3,351 మున్సిపల్ వార్డులకు గాను బీజేపీ 1435 వార్డులను గెలుచుకోగా, 1,162 వార్డుల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసి గట్టి పోటీ ఇచ్చింది. ఎన్సీపీ 19, బీఎస్పీ 16, సీపీఐ 5, సీపీఎం ఒక్కస్థానాన్ని గెలుచుకున్నాయి. 113 మున్సిపాలిటీలకు గాను 62 కమలం పార్టీ ఖాతాలోకి వెళ్లగా, 25 చోట్ల హస్తం పార్టీ విజయకేతనం ఎగువేసింది. 12 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 15నగరపాలక సంస్థలకు గాను కాంగ్రెస్ ఎనిమిదింటిని చేజిక్కించుకోగా, బీజేపీ కేవలం 4 చోట్ల విజయం సాధించడం విశేషం. మొత్తం మీద ఈ ఎన్నికల్లో బీజేపీది పై చేయి అయినప్పటికీ గట్టిపోటీ ఇచ్చిన కాంగ్రెస్ తనను తక్కువ అంచనా వేయొద్దని పరోక్షంగా తెలియజేసింది. గతఏడాది చివర్లో జరిగిన నాలుగు జిల్లా పరిషత్ ఎన్నికల్లో హస్తం పార్టీ మళ్లీ విజయకేతనం ఎగురవేసింది. తద్వారా ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వనున్నట్లు సంకేతాలు పంపింది.
రాజే నాయకత్వంపై.....
తాజా ఉప ఎన్నికల ఫలితాలు పార్టీ కేంద్ర నాయకత్వానికి షాక్ నిచ్చాయి. ముఖ్యంగా రాజ్ పుట్ ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్న అజ్మీర్ లోక్ సభ నియోజకవర్గంలో ఓటమి పార్టీని కుంగదీసింది. సిట్టింగ్ స్థానాల్లో ఓడిపోవడం.. అది భారీ తేడాతో పరాజయం పాలవ్వడం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయని పార్టీ ఆందోళన చెందుతోంది. ముఖ్యమంత్రి వసుంధర రాజే నాయకత్వంపై పార్టీలో అంతర్గతంగా ఆందోళన వ్యక్తమవుతుంది. ఆమె ప్రజలకు అందుబాటులో ఉండరని, ఏకపక్ష విధానాలను అనుసరిస్తారన్న విమర్శ ఉంది. గుజ్జర్ల రిజర్వేషన్ల ఉద్యమం పార్టీ దెబ్బతీసిందన్న అభిప్రాయం ఉంది. పద్మావత్ చిత్రం విషయంలో రాజే తమ పక్షాన నిలవలేదన్న అసంతృప్తి రాజపుత్ర వర్గాల్లో ఉంది. పార్టీ నాయకుల ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయలేం. లోపాల్ని సరిదిద్దక పోతే వచ్చే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోలేమన్న భావన పార్టీ శ్రేణుల్లో కనపడుతోంది. ఉప ఎన్నికల ఫలితాలు హస్తం పార్టీకి ఎడారిలో ఒయాసిస్సులా ఉన్నాయి. పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ ఊపుతో కమలం పార్టీని కంగుతినిపిస్తామన్న ధీమాను పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ వ్యక్తం చేస్తున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్

