వెంకన్న సన్నిధిలో అవినీతి వరద

తిరుమల వెంకన్న సన్నిధిలో అవినీతి రాజ్యమేలుతోంది. టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీబీసీ ఛానల్ అక్రమాల పుట్ట అని తేలింది. దీనిపై విజిలెన్స్ అధికారులు చర్యలకు దిగారు. ఎస్వీబీసీ ఛానల్ కార్యాలయంలో ఉన్న ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్వీబీసీ ఛానల్ కు ఏడాదికి 25 కోట్ల రూపాయలు టీటీడీ కేటాయిస్తుంది. అయితే ఈ నిధులను పెద్దయెత్తున పక్కదారి పట్టించారన్న ఆరోపణలు వచ్చాయి. ఎస్వీబీసీ ఛానల్ లో పాత కార్యక్రమాలకు కొత్త యాంకర్లను పెట్టి కొత్త కార్యక్రమాలుగా చూపించి వాటిని సొమ్ము చేసుకున్న వైనం బయట పడింది.
ఎస్వీబీసీ ఛానల్ లో అక్రమాలు....
అలాగే వాస్తవానికి టీటీడీ పరిధిలో కాంట్రాక్టు ఉద్యోగిని నియమించుకోవాలంటే టీటీడీ ఎగ్జిక్యూటివ్ అధికారి అనుమతి తప్పనిసరి. అయితే దీనికి విరుద్ధంగా 80 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఛానల్ సీఈవో నియమించుకున్నారన్న ఆరోపణలు బయటపడ్డాయి. దీనిపై ఈవో సయితం సీరియస్ అయ్యారని తెలిసింది. సీఈవో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఛానల్ కు కేటాయించిన నిధులను పక్కదోవపట్టించారన్న ఆరోపణలపై టీటీడీ విజిలెన్స్ విచారణ ప్రారంభించింది. దాదాపు ఆరు గంటల పాటు ఎస్వీబీసీ కార్యాలయంలో సోదాలు జరిగాయి. ఛానల్ కు వచ్చే యాడ్స్ విషయంలో కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని అధికారులు నిర్ణయించారు. ఎస్వీబీసీ ఛానల్ అక్రమాలపై రాయలసీమ హక్కుల వేదిక నిరసన కార్యక్రమం చేపట్టింది. ఎస్వీబీసీ ఛానల్ లో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. మొత్తం మీద దేవుడి సన్నిధిలో జరుగుతున్న అక్రమాలపై రాష్ట్ర్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
- Tags
- ఎస్వీబీసీ ఛానల్
