వంశీకి ఎమ్మెల్యే టిక్కెట్ ఎందుకు కష్టం...?

వల్లభనేని వంశీమోహన్ ఈ పేరు తెలుగు రాజకీయాలకు సుపరిచితం. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంశీ ఓ ఎమ్మెల్యే అయినా క్రేజ్‌లో మాత్రం మంత్రులు, సీనియర్లకు ఏ మాత్రం తీసిపోడు. ప్రస్తుతం గన్నవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వంశీకి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ సులువుగానే వస్తుందా ? లేదా పెద్ద ఫైటింగ్ చేయాలా ? అన్నది చూడాలి. ప్రస్తుతం నియోజకవర్గంలో వంశీకి తిరుగులేదు. విపక్ష వైసీపీ కూడా బలహీనంగానే ఉంది. మరి అలాంటప్పుడు వంశీ టిక్కెట్ కోసం ఎందుకు ఫైటింగ్ చేయాలన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. అయితే ఇందుకు గన్నవరం నియోజకవర్గ టీడీపీలో ఉన్న ఓ సెంటిమెంటే కారణంగా కనిపిస్తోంది.
టిక్కెట్ అంటే పెద్ద ఫైటింగ్ చేయాల్సిందే...
గన్నవరం నియోజకవర్గంలో గత ఐదుసార్లు కూడా టీడీపీ టిక్కెట్ దక్కించుకునేందుకు పోటీ చేసే అభ్యర్థులు పెద్ద ఫైటింగ్ చేయాల్సి వస్తుంది. 1994, 1999, 2004, 2009, 2014 ఇలా ఈ ఐదు ఎన్నికల్లోను టీడీపీ నుంచి పోటీచేసిన అభ్యర్థులు పెద్ద యుద్ధం చేస్తే గాని టిక్కెట్ రాలేదు. అక్కడ ఈ ఐదు పర్యాయాలు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేవాళ్లకు టిక్కెట్ కేటాయించే విషయంలో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఎప్పుడూ ఏదో ఒక చిక్కువచ్చిపడుతోంది.
1994లో చక్రం తిప్పిన లక్ష్మీపార్వతి...
1994లో ఎన్నికలకు ముందు యువకుడిగా ఉన్న గద్దే రామ్మోహన్ పలు సేవా కార్యక్రమాలతో నియోజకవర్గ ప్రజలకు బాగా దగ్గరై వారిలోకి చొచ్చుకుపోయారు. ఎన్టీఆర్ కూడా ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని అనుకున్నారు. అయితే లక్ష్మీపార్వతి చక్రం తిప్పి విజయ ఎలక్ట్రికల్స్‌కు చెందిన దాసరి జై రమేష్ సోదరుడు దాసరి బాలవర్థన్‌రావుకు టిక్కెట్ ఇప్పించారు. అయితే ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన గద్దే రామ్మోహన్ ఎన్టీఆర్ గాలిని తట్టుకుని 10 వేల ఓట్ల తేడాతో ఓడించి అందరికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఆ తర్వాత గద్దే టీడీపీలో చేరిపోయారు.
1999లో దాసరికి గన్నవరం...గద్దేకు....
1999లో చంద్రబాబుకు గన్నవరం అసెంబ్లీ సీటు ఇవ్వడం ప్రశ్నగా మారింది. అప్పుడు ఎమ్మెల్యే సీటు కోసం సిట్టింగ్ హోదాలో గద్దేతో పాటు దాసరి బాలవర్థన్‌రావు కూడా పోటీపడ్డారు. అప్పుడు దాసరి బాలవర్థన్‌రావుకు గన్నవరం ఎమ్మెల్యే సీటు ఇచ్చి, గద్దేను విజయవాడ ఎంపీగా పోటీ చేయించడంతో ఇద్దరి మధ్య వివాదాన్ని బాబు పరిష్కరించారు. ఆ ఎన్నికల్లో ఇద్దరూ విజయం సాధించారు.
2004లో అశ్వనీదత్ ఎంట్రీతో....
2004లో మరోసారి గన్నవరం సీటు విషయంలో బాబుకు మళ్లీ చిక్కు తప్పలేదు. సినీనిర్మాత అశ్వనీదత్ విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని బాబును కోరడంతో గద్దే తిరిగి గన్నవరం మీద దృష్టిపెట్టారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ దాసరి ఉన్నారు. దీంతో చంద్రబాబు మళ్లీ మధ్యేమార్గంగా దాసరికి గన్నవరం సీటు కొనసాగించి, అశ్వనీదత్‌కు విజయవాడ ఎంపీ సీటు ఇచ్చి, గద్దే రామ్మోహన్‌ను కంకిపాడు బరిలో ఉంచారు. ప్రభుత్వ వ్యతిరేక గాలితో ఈ ముగ్గురూ ఓడిపోయారు.
2009లో వంశీ ఎంట్రీతో మళ్లీ చిక్కుముడే....
2009 ఎన్నికల్లో వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వంశీకి సీటు కోసం ఇటు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు అటు పరిటాల సునీత కూడా చంద్రబాబుపై ప్రెజర్ తెచ్చారు. అయితే అటు దాసరి బాలవర్థన్‌రావు కోసం చాలా మంది సీనియర్లతో పాటు ఆయన సోదరుడు జై రమేష్ కూడా బాబుపై ఒత్తిడి తెచ్చారు. దీంతో దాసరికి గన్నవరం అసెంబ్లీ, వంశీకి విజయవాడ ఎంపీ సీటు ఇచ్చారు. దాసరి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధిస్తే, వంశీ విజయవాడ ఎంపీగా స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.
2014లో దాసరికి క్లైమాక్స్ టచ్...
రెండు దశాబ్దాలుగా గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్లాన్‌తో ఉన్న వల్లభనేని వంశీ కోరిక ఎట్టకేలకు 2014 ఎన్నికల్లో నెరవేరింది. ఈ ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో బాలవర్థన్‌రావు తనకే మరోసారి సీటు ఇవ్వాలని బాబును కోరారు. అయితే బాబు ఆయనకు విజయ డెయిరీలో పదవి ఇస్తామని నచ్చచెప్పి వంశీకే ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. వంశీ గెలిచి తొలిసారి చట్టసభల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఈ ఐదుసార్లు గన్నవరం టీడీపీ టిక్కెట్ ఇచ్చే విషయంలో ఎన్టీఆర్ టు చంద్రబాబు వరకు చిక్కులు తప్పలేదు. మరి 2019 ఎన్నికల్లో వంశీకి ఎలాంటి పోటీ లేకపోయినా గన్నవరం టీడీపీ టిక్కెట్ దక్కాలంటే ఫైటింగ్ చేయాల్సిందే అన్న సెంటిమెంట్‌ను వంశీ సులువుగా దాటతాడా ? లేదా కష్టంగా దాటతాడా ? అన్నదే కాస్త సస్పెన్స్.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- ఎమ్మెల్యే వంశీ

