మోడీ...మణినగర్ ఈసారి ఎవరికి?

మణినగర్... గుజరాత్ ప్రజలకు అత్యంత సుపరిచితమైన అసెంబ్లీ నియోజకవర్గం ఇది. మూడున్నరేళ్ల క్రితం వరకూ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీకి మద్దతుగా నిలిచిన నియోజకవర్గమది. పార్టీ పదవి నుంచి నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మోడీ మొదట్లో రాజ్ కోట్ నుచంి అసెంబ్లీకి ఎన్నికయినప్పటికీ అనంతర కాలంలో మణినగర్ ను తన రాజకీయ కేంద్రంగా చేసుకున్నారు. అహ్మదాబాద్ నగరానికి తూర్పువైపున గల మణినగర్ పూర్తిగా పట్టణ ప్రాంతం. అహ్మదాబాద్ నగరపాలకసంస్థలోని 36, 43 వార్డులు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ఇక్కడి నుంచి 86,373 భారీ మెజారిటీతో ఎన్నికయ్యారు. మోడీ ప్రధానిగా ఎన్నిక కావడంతో 2014 సెప్టంబరు 16న జరిగిన ఉప ఎన్నికల్లో మణినగర్ లో బీజేపీ అభ్యర్థి సురేష్ భాయ్ పటేల్ విజయం సాధించారు. ఇప్పుడు కూడా ఆయనే పోటీ చేస్తున్నారు. రాజకీయంగా మణినగర్ కాషాయ పార్టీకి కంచుకోట. 1990 నుంచి ఇక్కడ బీజేపీ విజయపరంపర కొనసాగిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా 34 ఏళ్ల మహిళ శ్వేత బ్రహ్మభట్ పోటీ చేస్తున్నారు. ఆమె రాజీకీయాలకు పూర్తిగా కొత్తకావడం విశేషం.
పూర్తిగా పట్టణ ప్రాంతం....
నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 2,43,596 మంది కాగా వారిలో 1,16,847 మంది మహిళలు, 1,26,749 మంది పురుషులు. అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. ముస్లింలు, మరాఠీలు, బ్రాహ్మణులు, క్రైస్తవులు, పటేళ్లు, ఉత్తర, దక్షిణ భారతీయులు గల మణినగర్ మినీ భారత్ ను తలపిస్తుంది. అహ్మదాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో మణినగర్ ఉంది. పట్టణ ప్రాంతమైనప్పటికీ మౌలిక సౌకర్యాల కొరత ఇక్కడ ప్రతిసారీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మారుతోంది. నోట్ల రద్దు, జీఎస్టీ, పాటీదార్ల రిజర్వేషన్ల ఉద్యమం, ప్రభుత్వ వ్యతిరేకత ఎంతగా ఉన్నప్పటికీ రేపటి ఎన్నికల్లో కాషాయదళం విజయకేతనం ఎగురవేయడం ఖాయం. ఇప్పటి వరకూ మొదటి దశ ఎన్నికలపై దృష్టిపెట్టిన మోడీ తదితర బీజేపీ నాయకులు ఈనెల 14న ఇక్కడ జరుగుతున్న రెండోదశ ఎన్నికలలో ప్రచారాన్ని ఉధృతం చేయనున్నారు.
ప్రజల మనోగతం ఇదే....
చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మోడీ ప్రధానిగా ఢిల్లీ వెళ్లడం రాష్ట్రానికి లోటని ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. సరైన పరిపాలన కొరవడిందని కూడా విశ్వసిస్తున్నారు. మోడీ లేని లోటు నియోజకవర్గంలో కూడా కనిపిస్తుందని చెబుతున్నారు. మోడీ మంచి నిర్ణయాలే తీసుకుంటున్నప్పటికీ ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని, వారి ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవడం లేదని మణినగర్ కు చెందిన 70 సంవత్సరాల నరేష్ భాయ్ పేర్కొన్నారు. విద్యుత్తు శాఖలో పనిచేసి పదవీ విరమణచేసిన నరేష్ భాయ్ మోడీకే తన మద్దతని చెబుతున్నారు. నియోజకవర్గ ప్రజలతో మోడీకి భావోద్వేగ సంబంధం ఉందని, కాంగ్రెస్ హయాంలో దాదాగిరి నుంచి ఆయన తమకు రక్షణ కల్పించారని లాల్జీ భాయ్ సిన్హా అనే వ్యాపారి పేర్కొనడం విశేషం. చిన్నపాటి సమస్యలున్నప్పటికీ కమలం విజయం ఖాయమని, తాను ఆ పార్టీకే ఓటేస్తానని మహేష్ భాయ్ చౌహాన్ అనే కారు డ్రైవర్ చెప్పారు. రాష్ట్రంలో ఫలితం ఎలా ఉన్నప్పటికీ మణినగర్ లో తమ మద్దతు బీజేపీకేనని మెజారిటీ ప్రజలు చెబుతున్నారు. 27 ఏళ్లుగా ఇక్కడి ప్రజలు బీజేపీతో మమేకమవతున్నారు.
దీనిపై కాంగ్రెస్ కు ఆశలు లేవా...?
హస్తం పార్టీకి ఈ నియోజకవర్గంపై ఎలాంటి ఆశలూ, ఎలాంటి అంచనాలు లేవు. పైకి గంభీర ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఫలితం గురించి వాస్తవాలు ారికి తెలియక పోలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్వేత బ్రహ్మ భట్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ నియోజకవర్గానికి పూర్తిగా కొత్త. ఉన్నత విద్య అభ్యసించిన 34 ఏళ్ల శ్వేత ఒక్కసారిగా విదేశాల నుంచి ఊడిపడ్డారు. లండన్ లో ఆమె మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. హాంకాంగ్ షాంఘై బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ గా పనిచేశారు. ఆమె తండ్రి నరేంద్ర బ్రహ్మ భట్ కాంగ్రెస్ నాయకుడే. 2012లోనే ఎన్నికల్లో పోటీకి తనకు అవకాశం వచ్చిందని, అయితే కెరీర్ పై దృష్టి పెట్టాలన్న లక్ష్యంతో వాయిదా వేసుకున్నానని శ్వేత చెబుతున్నారు. సామ్యవాదం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యం వంటి మంచి లక్షణాలు కాంగ్రెస్ లో ఉన్నందునే ఆ పార్టీ పట్ల ఆసక్తి కనబరిచానన్నశ్వేత మాటల్లో ఎంత చిత్తశుద్ధి ఉందో తెలియని విషయం కాదు. మహిళా ఓటర్లలో 75శాతం 40 ఏళ్ల లోపు వారేనని, వారంతా తనకు అండగా ఉంటారన్న ధీమాను ఆమె వ్యక్తం చేస్తున్నారు.
వ్యతిరేకతే తనకు విజయమంటున్న....
యువత, మహిళల సాధికారికత తన లక్ష్యాలన చెబుతున్నారు. అంతా బాగుందన్నది బీజేపీ ప్రచారమేనని, ప్రజల్లో అసంతృప్తి, ఆవేదన, ఆందోళన ఉందని వీటి ఆధారంగా ప్రజల్లోకి వెళతానని శ్వేత చెబుతున్నారు. నోట్ల రద్దు జీఎస్టీ వంటి అంశాల సామాన్య, మధ్యతరగతి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశాయని, వీటి ప్రభావం ఎన్నికల్లో తప్పక ఉంటుందని ఆమె అంటున్నారు. నియోజకవర్గంలో నరేంద్రమోడీకి మంచిపేరున్నప్పటికీ, ఆయన పార్టీనాయకులకు అలాంటి పరిస్థితి లేదని ఇదే తనకు బాగా కలిసి వచ్చే అంశమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. శ్వేత మాటల్లో, చేతల్లో ధీమా విశ్వాసం కనపడుతున్నప్పటికీ పార్టీ శ్రేణుల్లో అది కనపడటం లేదు. ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో వారికి ఒక అవగాహన ఉంది.
-గుజరాత్ నుంచి ‘తెలుగు పోస్ట్’ ప్రత్యేక ప్రతినిధి
- Tags
- మోడీ మణినగర్

