మోడీ కోటలో ఎవరికి...ఎక్కడ మెజారిటీ?

గుజరాత్ ఓటర్ల వైఖరిలో స్పష్టమైన మార్పు కనపడుతోంది. పట్టణ, నగర ప్రాంతాల ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో పల్లె ప్రాంతాల ఓటర్లు హస్తం పార్టీకి మద్దతుగా నిలబడుతున్నారు. గత రెండు దశాబ్దాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మరీ 2015లో జరిగిన నగరపాలకసంస్థలు, జిల్లా పంచాయతీలు, బ్లాక్ పంచాయతీ ఎన్నికల్లో ఈ విషయం మరింత స్పష్టంగా వెల్లడైంది. ఈ విభజనపై రెండు పార్టీల్లో ఒకరకమైన అంతర్మథనం జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఏ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ రావడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏ ఒక్క వర్గం ఓట్ల ఆధారంగా అధికారం చేపట్టడం అసాధ్యం. తమ వర్గం ఓట్లను గంపగుత్తగా పొందుతూ ఇతర వర్గాల ఓటర్లను ఆకట్టుకున్నప్పుడే అధికారం హస్తగతమవుతుంది. అందుకే ఇప్పుడు ఈ దిశగా పార్టీలు పావులు కదుపుతున్నాయి.
పట్టణ ప్రాంతాల్లో బీజేపీ....
గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ఓటర్ల విభజన తీరు అర్థమవుతుంది. 2002లో జరిగిన ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ 45, బీజేపీ 80 సీట్లు సాధించాయి. గోద్రా అల్లర్ల అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన మొత్తం సీట్ల 60 లోపే కాగా ఒక్కగ్రామీణ ప్రాంతాల్లోనే అది సింహభాగం సీట్లను చేజిక్కించుకుంది. 2007 నాటి ఎన్నికల్లో బీజేపీ తన బలం 80 సీట్లను గ్రామీణ ప్రాంతాల్లో కాపాడుకోగా కాంగ్రెస్ 45 స్థానాల నుంచి 50 స్థానాలకు పెరగడం గమనార్హం. గ్రామీణ ఓటర్లు హస్తం పార్టీకి ఒకింత అండగా నిలబడ్డారనడానికి సీట్ల పెరుగుదలే నిదర్శనం. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విభజన మరింత స్పష్టంగా కనపడింది. కాంగ్రెస్ స్థానాలు యాభై నుంచి 52 కు పెరగగా, బీజేపీ 80 స్థానాల నుంచి 70కి పడిపోవడం ఓటర్ల వైఖరిలో వచ్చిన మార్పునకు అద్దంపడుతోంది. మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ మొత్తం సీట్లు 60లోపే కావడం గమనార్హం. వీటిల్లో సింహభాగం గ్రామీణ ప్రాంతాల్లో గెల్చినవే. 2015లో జిల్లా, బ్లాక్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రాంత ఓటర్లు కమలాన్ని ఆదరించగా, గ్రామీణ ప్రజలు పూర్తిగా హస్తం పార్టీ వైపే నిలబడ్డారు. మొత్తం 31 జిల్లాల్లో పంచాయతీలకు గాను కాంగ్రెస్ 23 చోట్ల విజయకేతనం ఎగుర వేసింది. 193 తాలూకా పంచాయతీల్లో 113 కాంగ్రెస్ ఖాతాల్లో జమయ్యాయి. బీజేపీ మొత్తం 8 నగరపాలకసంస్థలనూ చేజిక్కించుకుంది. అహ్మదాబాద్, రాజ్ కోట్, గాంధీనగర్, వడోదర, జామ్ నగర్, భవ్ నగర్, సూరత్, బరోడా నగరపాలకసంస్థలు కమలం ఖాతాలో పడ్డాయి. మున్సిపాలిటీల్లోనే కాషాయదళానిదే పై చేయి అయింది. 71.32 శాతం పోలింగ్ జరిగిన 2012 ఎన్నికల్లో బీజేపీ నగర ప్రాంతాల్లోనే ఎక్కువ సీట్లను గెలుచుకుంది. సూరత్ జిల్లాలోని 16 సీట్లలో 15, అహ్మదాబాద్ జిల్లాలోని 17 సీట్లకు గాను 15 స్థానాలు బీజేపీ వశమయ్యాయి. రాజ్ కోట్ లో నాలుగు స్థానాలకు మూడు, గాంధీనగర్ లోని మొత్తం రెండు స్థానాలకు రెండు, వడోదర, భావ్ నగర్ లోని మొత్తం 10 స్థానాలు కమలం ఖాతాలోనే చేరిపోయాయి. 41 గిరిజన స్థానాల్లో బీజేపీ 18 చోట్ల గెలిచింది.
పల్లె ప్రాంతాలపై పట్టున్న కాంగ్రెస్...
సాగునీటి సౌకర్యం కొరవడటం, పత్తి తదితర పంట ఉత్పత్తులకు మద్దతు ధర కొరవడటం, కరవు పరిస్థితులు కారణంగా జిల్లా, బ్లాక్ పంచాయతీఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలయిందన్న వాదన ఉంది. మోడీ ఆహార్యం, వ్యవహార శైలి సహజంగానే పల్లెల కన్నా పట్టణ ప్రాంత ఓటర్లకే దగ్గరగా ఉంటుంది. ఆయన కార్పొరేట్ వర్గాల అభిమాన పాత్రుడన్న పేరు కూడా ఉంది. ఇవన్నీ గ్రామీణ ప్రాంత ఓటర్లు బీజేపీకి దూరమవ్వడానికి కారణమన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. రిజర్వేషన్ల కోసం పాటీదార్ల ఆందోళన కూడా పల్లెల్లో బీజేపీ విజయావకాశాలపై ప్రభావం చూపాయి. మోడీ ఢిల్లీ వెళ్లడం కూడా ఈ పరిస్థితికి కొంత కారణంగా చెప్పొచ్చు. పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పరాజయానికి కారణాలు అనేకం. పార్టీకి పట్టణ, నగర ప్రాంతాల్లో సరైన నాయకత్వం లేదు. సంస్థాగతంగా సరైన యంత్రాంగం కూడా కరువే. పార్టీ శ్రేణులను సమన్వయ పరిచి, ముందుకు నడిపించే నాయకులు లేరు. ఉన్న కొద్దిమందికి కూడా ప్రజాదరణ పూజ్యం. పార్టీలో అగ్రశ్రేణి నాయకులుగా చెలామణి అవుతున్న శక్తి సింహ్ గోహిల్, సిద్దార్థ పటేల్, మోహన్న సింహారత్వా, తుషార్ చౌదరి వంటి నేతలు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే. క్షత్రియ, హరిజన, ఆదివాసీ, ముస్లిం ఓటు బ్యాంకుపై ఆధారపడిన కాంగ్రెస్ తన పరిధిని పెంచుకోలేక పోతోంది. ఇప్పుడిప్పుడే ఇతర ఓటు బ్యాంకుపై దృష్టి సారిస్తోంది. కాంగ్రెస్ ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో వేచి చూడాలి.
-ఎడిటోరియల్ డెస్క్

