మంచు రాష్ట్రం మోడీకి అండగా నిలిచేనా?

విపరీతమైన చలి, మంచు కారణంగా హిమాచల్ ప్రదేశ్ వణికిపోతోంది. అందుకే పర్వత ప్రాంతమైన ఇక్కడ పోలింగ్ ను గుజరాత్ కన్నా ముందు నవంబర్ 9న ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. అభ్యర్థుల ప్రచారానికి వాతావరణం ఆటంకం కలుగుతోంది. ఎక్కువగా మధ్యాహ్నం వేళ ప్రచారం జరుపుతున్నారు. మరొకపక్క రాజకీయ వాతావరణం కూడా ఇందుకు ధీటుగా వేడెక్కుతోంది. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మురం చేస్తున్నారు. పరస్పర విమర్శలు, ఆరోపణలుతో రాజకీయ వాతావరణాన్ని రగిలిస్తున్నారు. జాతీయ పార్టీల రంగస్థలమైన హిమాచల్ ప్రదేశ్ లో అధికార పార్టీని ఓడించి, విపక్షానికి పీఠం అప్పగించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. 68 అసెంబ్లీ స్థానాలు గల రాష్ట్రంలో 49,05,677 మంది ఓటర్లున్నారు. 7500 కు పైగా పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. వంద శాతం ఓటరు గుర్తింపు కార్డులు జారీ అయ్యాయి. సుమారు 71 లక్షల జనాభా గల రాష్ట్ర్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఇది పదమూడోసారి.
పోటాపోటీగా ప్రచారం....
అధికార కాంగ్రెస్ ప్రచారం మొత్తం ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ చుట్టూ తిరుగుతుంది. ఆరుసార్లు సీఎంగా పనిచేసిన ఆయనపైనే అధిష్టానం బరువు బాధ్యతలను మోపింది. తమ ముఖ్యమంత్రి అభ్ర్థిగా పార్టీ యువరాజు రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించారు. బీజేపీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ ప్రకటించలేదు. ఎన్నికల అనంతరం ఆ విషయం పరిశీలిస్తామని అంటోంది. సర్వ్లేల్లో బీజేపీకి అనుకూలంగా పరిస్థితి ఉన్న్ట్లట్లు వెల్లడవ్వడంతో సీఎం పదవికి పోటీ పెరిగింది. క్షత్రియుడైన మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్, బ్రాహ్మణ వర్గానికి చెందిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా ప్రస్తుతానికి బరిలో ఉన్నారు. 1992లో బీజేపీకి చెందిన బ్రాహ్మణుడైన శాంతకుమార్ రాజీనామా చేశాక క్షత్రియ వర్గానికి చెందిన అటు కాంగ్రెస్ నాయకుడు వీరభద్ర సింగ్, బీజేపీ నాయకుడు ప్రేమ్ కుమార్ ధుమాల్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తూ వచ్చారు. ఈసారి బీజేపీలో ధుమాల్ కు బ్రాహ్మణుడైన నడ్డా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇద్దరూ అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. నడ్డాకు కేంద్ర పెద్దల ఆశీస్సులున్నాయని చెబుతున్నారు. ఒక దశలో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి వినిపించింది. ధుమాల్ పాతతరం నేత. రాష్ట్ర్రంలో 38 శాతం క్షత్రియ వర్గానికి చెందిన ఠాకూర్లు ఉండగా, 18శాతం జనాభా గల బ్రాహ్మణులు కింగ్ మేకర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈసారి పదవి చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో వారున్నారు.
కాంగ్రెస్ లోనూ విశ్వాసం....
హిమాచల్ ప్రదేశ్ లో గెలవడం ద్వారా సానుకూల వాతావరణంలో అధ్యక్ష్య బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్న రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ తో సర్దుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అందువల్లే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన పేరు ప్రకటించడంతో పాటు, పీసీస అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ కు ప్రాధాన్యత తగ్గించారు. పీసీసీ చీఫ్ ను తొలగించకపోతే ఎన్నికల్లో పోటీ చేయనని ఒక దశలో ప్రకటించిన వీరభద్రసింగ్ ను బుజ్జగించారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, అవినీతి ఆరోపణలకారణంగా సింగ్ ప్రతిష్ట అడుగంటిందని భావించిన అధిష్టానం మొద్లలో మళ్లీ ముఖ్యమంత్రిగా ఆయన పేరును ప్రకటించడానికి తటపటాయించింది. అయినా అనుభవజ్ఞుడైన సింగ్ ను కాదనలేక, ఆయనకే నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. సింగ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిమ్లా గ్రామీణ నియోజకవర్గాన్ని కుమారుడు విక్రమాదిత్య సింగ్ కు కేటాయించారు. ఆయన అర్కి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు సుఖు నదేన్ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. కుటుంబ రాజకీయాలను అడ్డుకునే లక్ష్యంతో ఒక కుటుంబానికి ఒక టిక్కెట్ అన్న నినాదాన్ని కాంగ్రెస్ అధిష్టానం తెరపైకి తీసుకు వచ్చినప్పటికీ అమలు చేయలేకపోయింది. కాని యువజన కాంగ్రెస్ అధ్యక్షుడైన ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ అభ్యర్థిత్వాన్ని కాదనలేకపోయింది. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు కొంపముంచుతోందని కాంగ్రెస్ భయపడుతోంది. అదే సమయంలో పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజల్లో వ్యతిరేకత కనపడుతోందని, ఇది తమకు లాభిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. యాపిల్ రైతుల సమస్యలు, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ పతనం వంటి సమస్యలు ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయి. అయినప్పటికీ ఈ సమస్యను అధిగమించగలనన్న ధీమాతో వీరభద్రసింగ్ ఉన్నారు. యశ్వంత్ సింగ్ పర్మర్ తర్వాత సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించిన సీఎంగా సింగ్ చరిత్ర సృష్టించారు.
బీజీపే నమ్మకం వీటిపైనే.....
రెండు దశాబ్దాలుగా రాష్ట్ర్రంలో బీజేపీకి అన్నీ తానై వ్యవహరిస్తున్న ప్రేమ్ కుమార్ ధుమాల్ సుజన్ పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. 73 ఏళ్ల వృద్ధుడైన ధుమాల్ కు వయస్సు అడ్డంకిగా ఉంది మళ్లీ ముఖ్యమంత్రిగా అవ్వడానికి. ఈ కారణంగానే కేంద్రమంత్రి నడ్డా పేరును పరిశీలించే అవకాశంల లేకపోయింది. 2012 ఎన్నికల్లో ధుమాల్, నడ్డా మధ్య విభేదాల కారణంగా పార్టీ ఓటమి పాలయిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. 68 స్థానాలు గల అసెంబ్లీలో గత ఎన్నికల్లో 28 స్థానాల వద్ద పార్టీ ఆగిపోయింది. 2014లో లోక్ సభ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాలైన సిమ్లా, మండి, కంగ్రా, హమీర్ పూర్ లలో విజయఢంకా మోగించింది. సిమ్లా నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా ఇటీవల విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా గల నరేంద్ర మోడీ ప్రభావం కూడా తమకు ఉపయోగపడుతుందని పార్టీ భావిస్తోంది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు తమకు చికాకులు సృష్టిస్తాయన్న భయం లేకపోలేదు. ఠాకూర్లు, బ్రాహ్మణులు, ఓబీసీలు, దళితులు, మైనార్టీలు రాష్ట్రంలో ప్రధాన ఓటు బ్యాంకు. కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు వీరభద్రసింగ్, దుమాల్ ఇద్దరూ ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన వారే. అదనంగా బ్రాహ్మణవర్గం తమకు అండగా నిలుస్తుందని బీజేపీ అంచనా వేస్తుంది. ఓబీసీలు, దళితులు, మైనారిటీలు కాంగ్రెస్ వైపు ఉంటారని భావిస్తున్నప్పటికీ వారి ఓట్ల శాతం తక్కువే. మొత్తం మీద రాష్ట్ర్ర రాజకీయాలు జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గుజరాత్ కే ప్రాధాన్యం ఉన్నప్పటికీ హిమాచల్ ను విస్మరించేందుకు జాతీయ పార్టీలు సిద్ధంగా లేవు. ఇక్కడ గెలుపునూ అవి సీరియస్ గా తీసుకుంటున్నాయి.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- హిమాచల్ ప్రదేశ్

