ప్రతిపక్షాలకు పగ్గాలిచ్చేశారా?

తెలుగు రాష్ట్రాల చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్షాల వాణి మూగబోయింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ తనంతతాను నిషేధాన్ని విధించుకుంటే, తెలంగాణలో సభానియమాల ఉల్లంఘన కింద కాంగ్రెసు సభ్యులపై వేటు పడింది. అత్యంత కీలకమైన రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఆమోదం పొందనున్న సమయంలో ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి కొంత మేరకు భంగపాటే. వివిధ పథకాల అమలులో ప్రభుత్వ లోపాలను ఎండగట్టడంతోపాటు ప్రజాసంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేసే అరుదైన అవకాశాన్ని వైసీపీ తనంతతాను కోల్పోయింది. పర్యవసనాల గురించి ఆలోచించకుండా దుందుడుకు ధోరణితో వ్యవహరించి తెలంగాణ శాసనసభ నుంచి బహిష్కరణకు గురైంది కాంగ్రెసు. రాజకీయపరమైన అంశాలు, విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు పక్కనపెడితే చట్టసభలో ఇదో కొత్త పంథా. ప్రజాస్వామ్యంలో అధికార, విపక్షాల మధ్య పెరుగుతున్న అసహనానికి పరాకాష్ట. ప్రజాస్వామిక విలువలకు నీళ్లొదిలేసేలా ఏకపక్ష నిర్ణయాలతో కఠినవైఖరిని అవలంబించడం ఇరుపక్షాలకూ మంచిదికాదు. గవర్నర్ ప్రసంగాన్నే సహించలేక అరాచకం సృష్టించడం ప్రతిపక్షం ప్రతిష్ట పెంచే విషయం కాదు. సభలో జరిగిన దాడిని రాజకీయకోణంతో చూస్తూ వేటు వేయించడం అధికార పక్షానికీ అలంకారం కాబోదు. అటు ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే తృటిలో తప్పిన అధికారాన్నే నిరంతరం తలచుకుంటూ పీఠం ఎక్కేవరకూ సభ గడపతొక్కకూడదని జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించుకోవడమూ డెమొక్రటిక్ స్ఫూర్తికి విరుద్దమైనదే. 2019 ఎన్నికలకు సన్నాహక సమరంగా సభలు మారుతున్నాయి. ఒకపార్టీ అంటే మరొక పార్టీకి పొడగిట్టని స్థితి రాజ్యం చేస్తోంది. చట్టసభల పనితీరునూ ఇది ప్రభావితం చేస్తోంది.
పెద్దరికం...మంట గలిసింది...
పెద్దలు జానారెడ్డి గారు , అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి ద్వారా తీయని గౌరవపూరిత సంభాషణలు ఒకానొకప్పుడు ప్రతిపక్ష నాయకునికి శ్రవణానందం కలిగించి ఉంటాయి. నాలుగేళ్ల తర్వాత అదే సభానాయకుని సూచనల మేరకు అదే గౌరవనేతకు సభా బహిష్కార శిక్ష విధించారు. రాజకీయ అవసరాలే తప్ప మర్యాదమన్నన అన్నవి మాటల మూటలే అన్నది జానారెడ్డికి అర్థమై ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెసును కలుపుకుని పోవడానికి, ఉద్యమానికి కలిసి రావాలని ఆహ్వానించడానికి ఇదే జానారెడ్డి ఇంటికి వెళ్లి మరీ కేసీఆర్ మంతనాలు జరిపారు. కాంగ్రెసు అధిష్టానాన్ని ధిక్కరించాల్సిన అవసరాన్ని నూరిపోశారు. కలుపుగోలుతనంతో మాట కలిపారు. ఉద్యమానికి మీరే సారథ్యం వహించమని పెద్దరికం కట్టబెట్టజూశారు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనూ సుహృద్భావం కొనసాగింది. కానీ ఎన్నికలకు ఏడాది ముందు సీన్ మారింది. అదే జానా నేడు కానివాడైపోయారు. బడ్జెట్ సెషన్ ప్రారంభసభలో జరిగిన గందరగోళానికి జానాను కూడా బాధ్యుడిని చేసింది అధికార పక్షం. ఆయనపైనా వేటు పడింది. పెద్దరికం మంటగలిసిపోయింది. ఒకానొక సమయంలో టీఆర్ఎస్ సర్కారు పట్ల మెతక ధోరణి అవలంబిస్తున్నారని కాంగ్రెసు నాయకులు జానాను అనుమానించి అవమానించారు. నేడు అదే టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం ప్రతిపాదించి బడ్జెట్ సెషన్ సభా ప్రవేశానికే జానారెడ్డిని అనర్హుడిని చేసింది.
ఇదెక్కడి సంప్రదాయం...
ప్రజాస్వామ్యంలో చర్చలకు, భావప్రకటనకు, విధాననిర్ణయాలకు, చట్ట నిర్మాణానికి వేదిక శాసనసభ. పరిపాలన వ్యవహారాలు చూసుకునే ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షం కూడా తన వాదనను వినిపించి కీలకమైన భూమిక పోషించేందుకు ఇక్కడ అవకాశం ఉంటుంది. ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు, నిలదీసేందుకు ప్రతిపక్షానికి బాధ్యత, అధికారమూ ఉంటుంది. అందుకే సభను ఎక్కువ రోజులు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండు చేస్తుంటాయి. సభను సాద్యమైనంత తొందరగా ముగించేయాలని ప్రభుత్వం భావిస్తుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రతిపక్షాల వాణికి విలువనిచ్చే సరైన ప్లాట్ ఫామ్ చట్టసభలే. అటువంటి వేదికను ఎంత గరిష్టంగా వినియోగించుకుంటారన్నదే ప్రతిపక్షాల సామర్ధ్యానికి నిదర్శనం. అధికార పార్టీ విపక్షాలను లెక్క చేసే సందర్భమంటూ ఉందంటే అది కేవలం శాసనసభ మాత్రమే. ప్రతి పక్షాల నాయకులు అవమానాలకు గురైన సందర్భాల్లో సభను బహిష్కరించిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఎన్టీరామారావు, జయలలిత వంటి వారిని ఇందుకు ఉదాహరణలుగా చెప్పాలి. అయితే వారు లేకపోయినా సభలో తమ సభ్యులు ప్రజాసమస్యలను వినిపించేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెర లేపారు. తాను సభలో లేకుండా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తన సభ్యులూ సభకు వెళ్లడం లేదు. పాదయాత్రలో వచ్చిన ప్రజాసమస్యలు, బడ్జెట్ లోపాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని జగన్ వదిలేసుకోవడం పై ఏ రాజకీయ పార్టీ కూడా సమర్థించలేకపోతోంది. ఈ రకంగా ఏపీలో విపక్షం పాత్ర నిర్వీర్యమైపోయింది. తెలంగాణ విషయానికొస్తే టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు అసెంబ్లీలో తీవ్రమైన ఆందోళనలే చేసింది. కానీ ఇప్పుడు మండలి ఛైర్మన్ పై దాడి అంటూ కాంగ్రెసు ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలనుంచి బహిష్కరించడం , ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయడం వంటివి తీవ్రమైన చర్యలుగానే ప్రజాస్వామ్యహితైషులు పేర్కొంటున్నారు.
సంక్షోభంలో అవకాశం...
కాంగ్రెసు పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తోంది. ఇప్పుడు అసెంబ్లీలో బహిష్కరణ అస్త్రాన్ని రాజకీయంగా వినియోగించుకునేందుకు మంచి అవకాశమని పరిశీలకులు పేర్కొంటున్నారు. బహిష్కరణ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయాలనే సూచన వినవస్తోంది. సభ్యత్వ రద్దునకు గురైన ఎమ్మెల్యేల సీట్లపై దృష్టి పెట్టి కాంగ్రెసు ఉపఎన్నికలను గెలిపించుకోగలిగితే 2019లో టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు ముందస్తు సంకేతాలు పంపినట్లవుతుందని కొందరు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ తమ బలాబలాలను నిరూపించుకొనేందుకు టీఆర్ఎస్ ఒక సవాల్ విసురుతోంది. దానిని అందిపుచ్చుకునేందుకు కాంగ్రెసు సిద్దమైతే 2019 కి సన్నాహకంగా ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ఇద్దరూ కాంగ్రెసు తరఫున బలమైన అభ్యర్థులే. అంతేకాదు, కాంగ్రెసుకు బలమైన మద్దతుగా ఉన్న రెడ్డి, దళిత సామాజిక వర్గాలకు ప్రతినిధులు కూడా. ఓటు బ్యాంకు పోలరైజేషన్ కు , రాష్ట్రవ్యాప్తంగా సానుభూతి తరంగాలను స్రుష్టించుకోవడానికి కాంగ్రెసుకు కలిసొచ్చేఅవకాశం ఇది. సంక్షోభంలోనూ అవకాశాన్ని వెదుక్కోవడమే రాజకీయం. దానిని ఏ రకంగా అందిపుచ్చుకుంటుందన్న అంశంపైనే తెలంగాణలో కాంగ్రెసు ఫ్యూచర్ ఆధారపడి ఉంది.
-ఎడిటోరియల్ డెస్క్

