త్రిపురలో మళ్లీ ఆ పార్టీ జెండాయేనా?

త్రిపుర.... దేశానికి మారుమూలన, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో గల ఈ చిన్న రాష్ట్రం ఎన్నికలు ఎప్పుడూ జాతీయ ప్రాధాన్యం సంతరించుకుంటాయి. ఇక్కడ ఎప్పుడూ జాతీయ పార్టీల మధ్యే పోటీ ఉండటమే ఇందుకు కారణం. నిన్న మొన్నటి వరకూ సీపీఎం, కాంగ్రెస్ ల మధ్య పోరాటం కొనసాగింది. మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ బదులు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించింది. ఫిబ్రవరి 18న జరిగే ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. సిద్ధాంతరీత్యా ఉప్పు నిప్పులా ఉండే సీపీఎం, బీజేపీలు ఈ ఎన్నికల్లో ముఖాముఖి తలపడపోతున్నాయి. 60 స్థానాలు గల రాష్ట్రంలో గిరిజనులు, హిందువులు దాదాపు సరిసమానంగా ఉన్నారు. 20 స్థానాలు గిరిజనులకు, పది స్థానాలు ఎస్సీలకు రిజర్వ్ చేశారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం 51 స్థానాలను గెలుచుకుంది. నాటి ఎన్నికల్లో కేవలంల 1.4 శాతం ఓట్లు సాధించిన బీజేపీ కనీసం ఒక్కస్థానాన్నీ గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వైఫల్యం నేపథ్యంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి అధికార సీపీఎంను సవాల్ చేసే స్థాయికి ఎదగడం సాధారణమైన విషయం కాదు. మొత్తం 25,69,216 లక్షల ఓటర్లలో 12,65,785 మంది పురుషులు, 13,03,431 మంది స్త్రీలు ఓటర్లగా ఉన్నారు.
రెండున్నర దశాబ్దాల నుంచి....
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఏకచ్ఛద్రాధిపత్యంగా పాలన సాగిస్తున్న సీపీఎం క్షేత్రస్థాయిలో బలంగా ఉంది. సుశిక్షితులైన క్యాడర్, నాయకులు దాని బలం. 2014 లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని రెండు లోక్ సభ స్థానాలనూ సీపీఎం కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ నీతి, నిజాయితీ, నిరాడంబరత పార్టీకి అదనపు బలం. దేశంలో అత్యంత పేద ముఖ్యమంత్రిగా ఆయన గుర్తింపు పొందారు. గతంలో ఇక్కడ పాలించిన నృపేన్ చక్రవర్తి, దశరథ్ దేవ్ లు పార్టీకి గట్టి పునాదులు వేశారు. పాలన కూడా బాగానే ఉందన్నది రాజీకీయ విశ్లేషకుల భావన. 97 శాతం అక్షరాస్యతతో ఇతర ఈశాన్య రాష్ట్రాలకు భిన్నంగా ఇక్కడ ఆదర్శంగా నిలిచింది. శాంతి భద్రతల పరిస్థితి సంతృప్తికరంగా ఉంది. అందువల్లే 2015లో రాష్ట్రంలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించింది. శిశుమరణాల రేటు బాగా తగ్గింది. అవినీతి ఛాయలు లేవు. ఇవన్నీ తమకు కలిసివచ్చే అంశాలని సీపీఎం భావిస్తోంది.
బీజేపీ పొత్తుతో....
బీజేపీ ఇక్కడ దూకుడు ప్రదర్శిస్తోంది. ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఉద్యోగులకు వేతన సవరణపై కూడా పార్టీ ప్రచారం చేస్తోంది. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నా నిరుద్యోగాన్ని పారదోలడంలో, పారిశ్రామికాభివృద్ధి సాధనలో బాగా వెనకబడిందని ధ్వజమెత్తుతోంది. కేంద్రంలో అధికారంలో ఉండటం, మోడీ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తమకు కలిసి వస్తాయని అంచనా వేస్తోంది. హిందుత్వ అంశం ఓటర్లపై ప్రభావం చూపుతుందని విశ్వసిస్తుంది. అయినప్పటికీ సీపీఎంను గద్దె దించడానికి తన సొంత బలం చాలదని గ్రహించింది. అందువల్లే గిరిజనుల్లో పట్టున్న ఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ)తో పొత్తుపెట్టుకుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఈ పార్టీ పట్టుబడుతోంది. రాష్ట్ర విభజనకు బీజేపీ వ్యతిరేకం అయినప్పటికీ, ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెట్టి దానితో కలిసి నడుస్తోంది. ఈ నినాదంతోనే ఈ పార్టీ ఇటీవల ఎనిమిదో నెంబరు జాతీయ రహదారిని దిగ్భంధించింది. రాష్ట్ర స్థాయిలో బీజేపీకి సమర్థులైన నాయకులు లేరు. అందువల్లే ఎన్నికల వ్యవహారాల పర్యవేక్షణకు అసోం ఆర్థిక మంత్రి హిమంత్ బిశ్వశర్మను ఇన్ ఛార్జిగా నియమించింది.
బీజేపీ వ్యూహం....
పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, సంస్థాగత వ్యవహారల నిపుణుడు రామ్ మాధవ్ క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు. అసోం రాజధాని దిస్ పూర్ లో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగిన ఆర్ఎస్ఎస్ సమ్మేళనం త్రిపురలో అనుసరించాల్సిన వ్యూహంపై లోతుగా చర్చించింది. నిన్న మొన్నటి దాకా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ల పరిస్థితి దయనీయంగా తయారైంది. క్షేత్ర స్థాయిలోని క్యాడర్ అంతా చెల్లాచెదురైంది. పార్టీని నడిపించగల సమర్థులైన నాయకులు కరువయ్యారు. జాతీయ నాయకత్వం కూడా త్రిపురపై పెద్దగా దృష్టి సారించినట్లు లేదు. పక్కనే ఉన్న మేఘాలయ ప్రభుత్వాన్ని కాపాడుకుంటే చాలన్న ధోరణిలో హస్తం పార్టీ ఉంది.
-ఎడిటోరియల్ డెస్క్

