‘జాతి’ పిలుస్తోంది..రాజనీతి వద్దంటోంది

మూడో ఫ్రంట్, సెక్యులర్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ పేరు ఏదైనా సీటు సిద్దంగా ఉంది. నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది. చంద్రబాబు సై అంటే జోడీ కట్టేందుకు ప్రాంతీయనేతలు సన్నద్ధంగానే ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని మాత్రం సెంటిమెంటు భయపెడుతోంది. ఎన్టీయార్ గుర్తుకు వస్తున్నారు. ఏపీ ప్రజలు ఏమనుకుంటారోనన్న బెంగ వెంటాడుతోంది. ఇంకా రాటుతేలని కుమారుడి రాజకీయమూ ఆటంకంగా మారుతోంది. జాతీయంగా కీలకభూమిక పోషించేందుకు అవసరమైన పాత్ర ఆహ్వానిస్తున్నప్పటికీ ఆంధ్రా సీఎం తటపటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ స్థానిక సమీకరణలు, తెలుగుదేశం భవిష్యత్తు, గత అనుభవాలు కారణంగా కనిపిస్తున్నాయి. జారవిడుచుకుంటే ఇప్పుడున్నంత సదవకాశం మళ్లీ చంద్రబాబు నాయుడికి జీవితకాలంలో దొరకకపోవచ్చు. సీజన్డ్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు నాయుడికి గతంలో ఒకానొక సందర్బంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం కలిసొచ్చింది. కానీ అప్పటికి ఇంకా యాభై ఏళ్లలోపు వయసు. అత్యున్నత పదవి అయిన ప్రధాని హోదా సంకీర్ణరాజకీయాల్లో స్వల్పవ్యవధి లో ముగిసిపోయే ప్రమాదం ఉంది. పీఎం పోస్టుతో ఏడాదికో రెండేళ్లకో పొలిటికల్ కెరియర్ కు ఫుల్ స్టాప్ పడుతుందనే ఉద్దేశంతో ఆ ఆలోచనకు స్వస్తి చెప్పేశారు. లేకపోతే దేవెగౌడ స్థానంలో చంద్రబాబు ప్రధాని అయ్యుండేవారు. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడం భావ్యం కాదు కాబట్టి రాజకీయాల్లో కొనసాగినా పార్టీ పదవుల్లోనే ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం పొలిటికల్ కెరియర్ దాదాపు ముగింపు దశగానే చూడాలి. జాతీయంగా క్రియాశీలకంగా వ్యవహరించాలంటే ఇంకా వయసు మీదపడితే కష్టం. ఇదే అదను. అందిపుచ్చుకుంటారా? లేదా? అన్నదానిపై భిన్న సమీకరణలు కనిపిస్తున్నాయి.
ఎన్టీయార్ సెంటిమెంటు...
కేంద్రంలో జనతా ప్రయోగం విఫలమైన తర్వాత ప్రతిపక్షాలన్నీ కకావికలమైపోయాయి. చిన్నాచితక పార్టీలు, గ్రూపులుగా మారిపోయాయి. కొన్ని ప్రాంతీయ పార్టీల రూపాన్ని సంతరించుకున్నాయి. 1984లో ఇందిరాగాందీ మరణం తర్వాత కాంగ్రెసుకు దేశప్రజలు మరింతగా మద్దతు ఇచ్చారు. రికార్డుమెజార్టీలు కట్టబెట్టారు. విపక్షాలు, వామపక్షాలు అన్నీ రెండంకెలు సాధించలేక చతికిలపడిన పరిస్థితి. అంతటి సానుభూతి పవనాల్లోనూ ఎన్టీయార్ మాత్రమే పొలిటికల్ హీరోగా నిలిచారు. 34 స్థానాలతో టీడీపీ లోక్ సభలో ప్రధానప్రతిపక్షంగా ఆవిర్బవించింది. ఆ తర్వాత విపక్షాలన్నీ ఎన్టీయార్ సారథ్యంలోనే నేషనల్ ఫ్రంట్ గా ఆవిర్భవించాయి. జాతీయంగా ఎన్టీయార్ కీలకమైన నాయకునిగా , అనుసంధానకర్తగా మారారు. అంతవరకూ లోక్ సభలో 400 పైచిలుకు స్థానాలున్నకాంగ్రెసు పార్టీ 1989లో ఘోరంగా ఓటమి పాలైంది. కానీ ఎన్టీయార్ ను దురదృష్టం వెన్నాడింది ఏపీలో తెలుగుదేశమూ ఓడిపోయింది. ఎన్టీయార్ రాజకీయ చక్రం తిరగబడింది. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్ గా ప్రధాని రేసులో ఉండాల్సిన వ్యక్తి ఏపీలో ప్రతిపక్ష నాయకునిగా మిగిలిపోయారు. విశ్వనాథ ప్రతాప్ సింగ్ ప్రధానిగా దేవీలాల్ ఉపప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అంతవరకూ కింగ్ లా వెలుగొందిన ఎన్టీయార్ ప్రభ ఆరిపోయింది. కనీసం ఉపప్రధాని పదవికి కూడా పరిశీలన చేయలేదు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఓటమే ఇందుకు కారణం. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే పనిలో బిజీ కావొచ్చు. అయితే ఏపీలో పరిస్థితులు తిరగబడి ఓటమి పాలైతే ఎన్టీయార్ తరహాలోనే తననూ ఎవరూ పట్టించుకోరనే యోచన చంద్రబాబును వెనక్కి లాగుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
ఏపీలో ఎదురుగాలి భయం...
రాజకీయంగా పరిస్థితులను ముందుగానే పసిగట్టడంలో నేర్పరి చంద్రబాబు నాయుడు. ఒకటి రెండు సార్లు తన అంచనాలు ఫలించకపోయినా భిన్న రాజకీయ సమీకరణాలే అందుకు కారణం. 1996లో యునైటెడ్ ఫ్రంట్ విషయంలోనూ ఆ తర్వాత 1998లో దానిని వదిలేసి ఎన్డీఏ చెంతకు చేరడంలోనూ, 1999లో వాజపేయి పై సానుభూతి, కార్గిల్ యుద్ధ ప్రభావాన్ని పసిగట్టి బీజేపీతో జోడీకట్టి టీడీపీని గెలిపించుకోవడం, 2014లో మోడీ వేవ్ వీస్తోందని గ్రహించి జతకట్టి టీడీపీని అధికారంలోకి తెచ్చుకోగలగడం వంటివన్నీ చంద్రబాబు రాజకీయ చాణక్యానికి నిదర్శనాలు. 2004లో టీడీపీ ఓటమికి వ్యవసాయ సంక్షోభం, విపరీతమైన సంస్కరణలు కారణంగా నిలిచాయి. 2009లో తిరిగి టీఆర్ఎస్ సహా విపక్షాలన్నిటినీ మహాకూటమి రూపంలోకి తేగలిగారు చంద్రబాబు. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పేరిట మూడో పక్షంగా రంగప్రవేశం చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. తన వ్యూహం ఫలించలేదు. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తుందని గ్రహించిన తర్వాతనే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావడంలో చంద్రబాబు రాజకీయ దార్శనికత ముడి పడి ఉంది. కానీ రాయల సీమలోని నాలుగు జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరుల్లో వైసీపీ బలంగా ఉండటమూ, 34 స్థానాలున్న ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం అధికంగా ఉంటుందని సర్వేలు చాటిచెప్పడంతో కొంత ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. బీజేపీకి వ్యతిరేకంగా యాంటీ సెంటిమెంటును ప్రయోగించినప్పటికీ కమలం పార్టీ రాష్ట్రంలో ప్రధానపక్షం కాదు. అందువల్ల బీజేపీ వ్యతిరేకత కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి లాభిస్తుందని చెప్పలేని పరిస్థితి. నాలుగేళ్లుగా తెలుగుదేశం బీజేపీతో కలిసి నడవటంతో ఆ వ్యతిరేకత వికటిస్తే టీడీపీపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదే జరిగితే జగన్, పవన్ కల్యాణ్ లకే రాజకీయ లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికే పవన్ విసిరిన పాచిక పనిచేయడం ప్రారంభించింది. విభజిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పనిచేస్తారని తెలుగుదేశానికి మద్దతునిస్తే పార్టీ పునర్నిర్మాణాన్ని చేసుకున్నారంటూ ఆరోపించారు. టీడీపీని విమర్శించేవారికి ఇదో బ్రహ్మాస్త్రంగా మారింది. పైపెచ్చు జాతీయరాజకీయాల్లో యాక్టివ్ అయిపోతే రాష్ట్రాన్ని గాలి కి వదిలేసి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి వెళ్లిపోయారనే విమర్శలూ వెల్లువెత్తవచ్చు. ఇది రాజకీయంగా నష్టదాయకం.
చినబాబు ఇంకా సీనియర్ కాలేదు..
లోకేశ్ పూర్తిస్థాయిలో పార్టీని నడపగల సామర్థ్యం సంతరించుకోలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని సీనియర్ నాయకు లమధ్య నియోజకవర్గాల్లో నెలకొన్న విభేదాలను శాంతింపచేసే విషయంలో లోకేశ్ సక్సెస్ కాలేకపోతున్నాడంటున్నారు. చంద్రబాబు జోక్యం చేసుకుంటే తప్ప నాయకులు దారికి రావడం లేదు. ప్రభుత్వ వ్యవహారాల్లోనూ పూర్తి పట్టు సాధించలేకపోతున్నారు. ఆర్థికమంత్రి యనమల, వ్యవసాయమంత్రి సోమిరెడ్డి, డిప్యుటీ సీఎం కేఈ వంటివారు తమ శాఖల్లో లోకేశ్ బాబుసిఫార్సులకు కొర్రీలు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. లోకేశ్ నడిపిన పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎదురుదెబ్బలు తగిలినట్లుగా చంద్రబాబు గమనించారు. ఓటుకు నోటు కేసు లో లోకేశ్ డ్రైవర్ ను పోలీసులు విచారించడాన్ని ఇందుకు ఉదాహరణగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్, పవన్ ల ధాటిని తట్టుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లగల శక్తిసామర్థ్యాలు లోకేశ్ కు అలవడాలంటే ఇంకా సమయం పడుతుందని టీడీపీ నాయకులే అంగీకరిస్తున్నారు. అందువల్ల 2019 ఎన్నికల్లో మరో అనుమానానికి తావు లేకుండా చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ నడిస్తేనే పార్టీకి మేలు చేకూరుతుందని మెజార్టీ నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లిపోయి లోకేశ్ బాబుకు రాష్ట్రాన్ని విడిచిపెట్టేశారన్న భావన ప్రజల్లోకి వెళితే కొంపమునిగిపోతుందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇది కూడా చంద్రబాబు జాతీయ రాజకీయాలకు ఒక ఆటంకమనే చెప్పాలి. మొత్తమ్మీద బాబు రిస్కు చేస్తారా? లేక రాష్ట్రం చాలనుకుని జాతీయ రాజకీయాల్లో సహాయకపాత్రకే పరిమితమవుతారా? అన్న అంశం వేచి చూడాలి.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- చంద్రబాబుే

