జడ్జిమెంట్ ఎవరికి అనుకూలం?

ఈనెల 27న ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ లో ప్రాంతీయ పార్టీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. జాతీయపార్టీలు ద్వితీయ స్థానానికే పరిమితమయ్యాయి. ఆ ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎన్నికల బరిలో పోరాడుతున్నాయి. అధికార నాగా పీపుల్స్ ఫ్రంట్ ప్రస్తుతం ఒంటరిగా పోటీ చేస్తుంది. మొత్తం 58 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. కాంగ్రెస్ కూడా ఒంటరిగానే పోరాడుతుంది.
బీజేపీకి అవకాశమే లేదా?
నిన్న మొన్నటి వరకూ ఎన్పీఎఫ్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ కొత్తగా పుట్టుకొచ్చిన నేషనలిస్ట్ డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోరాడుతుంది. వాస్తవానికి ఎన్పీఎఫ్, బీజేపీలు సుదీర్ఘకాలం మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. 2003 నుంచి వీరు ఉమ్మడిగా ఎన్నికల్లో పోరాడుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ సారథ్యంలోని ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా. అయితే సీట్ల పంపిణీ తదితర విషయాల్లో బీజేపీతో విభేదించి బయటకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి నైఫియు రియో సారథ్యంలోని నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రసివ్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఎన్డీపీపీ 40 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 20 స్థానాలతోనే సరిపెట్టుకుంది. నైఫియు ఎన్పీఎఫ్ పాత కాపే. పార్టీ అధినేత జెలియాంగ్ తో విభేదాల కారణంగా సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆయన ఆషామాషీ నాయకుడు కాదు. సుదీర్ఘ అనుభవజ్ఙుడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనది. 2003 నుంచి 2014 వరకూ రాష్ట్రానికి సారథ్యం వహించారు. ఆయన ప్రస్తుతం లోక్ సభ సభ్యుడు. 2014లో ఎన్డీఏ మంత్రివర్గంలో మంత్రి పదవిని ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు కూడా పూర్తి మెజారిటీ రానట్లయింతే మళ్లీ కేంద్రం వైపు చూసే అవకాశం లేకపోలేదు. తమ కూటమి గెలిస్తే నెఫియు రియో ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ బహిరంగంగా ప్రకటించింది. ఉత్తర అంగమ-2 నియోజకవర్గం నుంచి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.కూటమి గెలుపు కోసం బీజేపీ కేంద్ర పెద్దలు గట్టిగా కృషి చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల ఇన్ ఛార్జి రామ్ మాధవ్, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ఉధృతంగా పనిచేశారు. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్. పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. రిజిజు పూర్తిగా ఇక్కడే మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షించడం విశేషం. క్రిస్టియన్లకు జెరూసలెం యాత్ర అవకాశం కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
కాంగ్రెస్ కూ ఛాన్స్ లేదంటూ.....
అధికార ఎన్పీఎఫ్ 58 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బీజపీ విడిపోయినా భయపడ కుండా ముందుకుసాగుతుంది. సంపూర్ణ మెజారిటీ రానట్లయితే కాంగ్రెస్ మద్దతుతో గద్దెనెక్కాలని ఆలోచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే హస్తం పార్టీ నేతలతో చర్చించింది. బీజేపీకి తద్వారా సంకేతాలను పంపింది. ఇక కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉంది. 23 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ వారిలో అయిదుగురు నామినేషన్లను ఉపసంహరించుకోవడం పార్టీ దుస్థితికి దర్పణం పడుతోంది. బీజేపీని అడ్డుకోవడం కోసం ఎన్పీఎఫ్ కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తోంది. హోకిసెసేమా, కెఎల్ చిషు, ఎన్.పి. జమీర్ వంటి ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు ప్రచారం చేసినా పార్టీ కోరుకునే పరిస్థితి కనపడటం లేదు. జమీర్ ప్రస్తుతం ఒడిషా గర్నర్ గా ఉన్నారు. తమకు పది సీట్లు వస్తాయని పార్టీ పరిశీలకుడైన అస్సోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగయ్ కుమారుడు గౌరవ్ గొగయ్ చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రచారం జరిపినప్పటికీ పెద్దగా ఫలితం కనపడలేదు. ప్రధాని మోడీ ప్రచారంలో భాగంగా పలు సభల్లో పాల్గొన్నారు. కేంద్రం 500 కిలోమీటర్ల జాతీయరహదారుల వేసిందని, మరో పదివేల కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నామని తెలిపినా ఓటర్లలో పెద్దగా స్పందన లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీది అదే పరిస్థితి. 2013 ఎన్నికల్లో పార్టీ తరుపున గెలిచిన అయిదుగురు ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించారు. దీంతో పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ప్రస్తుత ఎన్నికలపై పార్టీకి పెద్దగా ఆశలు కూడా లేవు.
నాగా ఒప్పందం కీలకం.....
రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానిు మొత్తం 11,89,264 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 6,00,536 మంది పురుషులు. 5,88,728 మంది మహిళలు. 2013 ఎన్నికల తర్వాత ఓటర్లు 25,876 మంది పెరిగారు. మొత్తం 196 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో మహిళలు అయిదుగురే కావడం గమనార్హం. వీరిలో 59 మంది కోటీశ్వరులున్నారు. 555 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. నాగా ఒప్పందాన్ని అమలు చేయాలని అన్ని పార్టీలు కోరినప్పటికీ ముసాయిదా ఇంకా పూర్తిచేయలేదని కేంద్రం వెల్లడించింది. 2015లో మోడీ ప్రభుత్వం నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ వర్గంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద వివరాలను వెల్లడించకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని మొదట్లో పార్టీలు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత ప్రజా తీర్పుకు సిద్ధమయ్యాయి.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- నాగాలాండ్

