గుప్తా మామూలోడు కాదు... ప్రెసిడెంట్ కే ఎర్త్ పెట్టాడే...!

రాజకీయం, వ్యాపారం కలగాపులగమయ్యాయి. ఒకరికొకరికి అవినాభావ సంబంధం ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఇది మన రాష్ట్రంలోనో, దేశంలోనో మాత్రమే కాదు. విదేశాలకూ విస్తరించింది. అభివృద్ధి చెందిన, చెందని దేశాలంటూ ప్రత్యేక మైన నిబంధనలు లేవు. అంతటా విస్తరించింది. ఇందుకు తాజా నిదర్శనం దక్షిణాఫ్రికా. వ్యాపార, రాజకీయ వర్గాల మధ్య అనుచిత, అవాంఛనీయ సంబంధాల ఫలితంగా ఏకంగా అధ్యక్షుడు జాకబ్ జుమా పదవినే కోల్పోవలసి వచ్చింది. తొమ్మిదేళ్ల పాటు అధ్యక్షుడిగా వ్యవహరించిన జుమాను పార్టీ ఏకంగా గెంటివేసినంత పనయింది. చివరికి చేసిన తప్పునకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అసలు కధలోకి వెళితే ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి రాకమానవు. యూపీలోని షహరాన్ పూర్ కు చెందిన గుప్తా కుటుంబం దశాబ్దాల క్రితం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లింది. ఈ కుటుంబం మొదట్లో చిన్న వ్యాపారాలతో ప్రారంభించి ఇప్పుడు యావత్ దేశాన్ని నిర్దేశించే స్థాయికి చేరుకుంది. గుప్తా కుటుంబంలోని అతుల్, రాజేష, అజయ్ సోదరులు. వీరు మధ్య వయస్కులే. వారు చేయని వ్యాపారం లేదు. ఇంధనం, మీడియా, విమానయానం, ఐటీ, మైనింగ్ ఇలా వీరు ప్రవేశించని రంగం లేదు. అన్ని వ్యాపారాల్లోనూ అగ్రగామిగా ఉన్నారు. రాత్రికి రాత్రి ఏమీ పెద్దవాళ్లు కాలేదు. నిరంతర శ్రమ, వ్యాపార దక్షతతో పైకి వచ్చారు. ఇంతవరకూ అభ్యంతర పెట్టాల్సిందేమీ లేదు.
అధ్యక్షుడి రాజీనామాకు దారితీసిన.....
అన్నింటికీ మరో కోణం ఉంది. అదే రాజకీయ కోణం. ప్రభుత్వాలతో వారికి సన్నిహిత సంబంధాలున్నాయి. అధ్యక్షుడు జాకబ్ జుమా అండదండలు పుష్కలం. తమ వ్యాపార ప్రయోజనాల కోసం అనేక అంశాల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేశారు. తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా వత్తిడి తెచ్చేవారు. జుమా మూడో భార్యతో పరిచయాల ఆధారంగా ప్రభుత్వాన్ని పూర్తిగా తమ వైపు నకు మలచుకున్నారు. అధ్యక్షుడి కూతురు, కుమారుడు, సన్నిహిత బంధువులకు తమ కంపెనీల్లో ఉన్నత పదవులను కట్టబెట్టారు. తాజాగా పేద నల్లజాతి రైతుల కోసం ఉద్దేశించిన డెయిరీ ప్రాజెక్టులలో గుప్తా కుటుంబం అక్రమాలకు పాల్పడినట్లు పెద్దయెత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. విపక్షమైన డెమొక్రటిక్ అలయన్స్ తో పాటు సొంత పార్టీ అయిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి కూడా జాకబ్ జుమాపై తీవ్ర మైన వత్తిడులు వచ్చాయి. మొదట్లో జుమా మొండికేశారు. రాజీనామా చేయాలన్న పార్టీ అధిష్టానం హెచ్చరికలను లెక్కచేయలేదు. చివరికి బహిష్కరిస్తామని హెచ్చరించడంతో దిగివచ్చిన జుమా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడు రామ్ ప్రోనా అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టారు. ఈయనపై కూడా ఆరోపణలు ఉన్నందున తక్షణమే ఎన్నికలను నిర్వహించాలని విపక్షమైన డెమొక్రటిక్ అలయన్స్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా కొద్దికాలానికైనా ఎన్నికల నిర్వహణ అనివార్యంగా కనపడుతోంది. కీలకనాయకులు అవినీతి ఆరోపణల్లో మునిగి తేలుతున్నందున అంతకు మించిన మరో మార్గం లేదు.
వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిందిలా.....
దక్షిణాఫ్రికా స్వేచ్ఛా జీవితం ప్రారంభించిన 1993లో గుప్తా కుటుంబం అక్కడకు వలస వెళ్లింది. ముందుగా సహారా కంప్యూటర్స్ అనే సంస్థను స్థాపించింది. అప్పుడు సాఫ్ట్ వేర్ యుగం మొదలవుతోంది. ముందుగా సాఫ్ట్ వేర్ కు గల డిమాండ్ ను పసిగట్టిన గుప్తా కుటుంబం ఈ వ్యాపారంలో మంచి లాభాలను ఆర్జించింది. ఈ సంస్థలో జాకబ్ జుమా కూతురు కీలకమైన డైరెక్టర్ పదవిలో ఉన్నారు. తండ్రి అధికారంలో ఉండటంతో ఆమెకు పదవి సునాయాసంగా లభించింది. కొద్దికాలానికి గుప్తా కుటుంబం మైనింగ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఓక్బే రిసోర్స్ అండ్ ఎనర్జీ పేరుతో మైనింగ్ కంపెనీని ప్రారంభించారు. ఖనిజాలు, ఖనిజ ఉత్పత్తులు, బంగారం, ప్లాటినం, యురేనియం, వజ్రాలు, బొగ్గు తదితర వ్యాపారాలను ఈ కంపెనీ నిర్వహిస్తుంది. ఇందులో జుమా మూడో భార్య పనిచేస్తున్నారు. సహారా ఎస్టేట్స్ , పత్రికలు, టీవీ ఛానల్ ను గుప్తా కుటుంబం నిర్వహిస్తోంది. దేశంలో ఏడో అతిపెద్ద సంపన్న వ్యాపార కుటుంబంగా గుప్తా కుటుంబం పేరొందింది. కీలక రంగాల్లో వీరి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. సువిశాలమైన వ్యాపార సామ్రాజ్యం కారణంగా ప్రభుత్వాలను ప్రభావితం చేసే, అవసరమైతే తారుమారు చేసే శక్తి వీరికి ఉందన్న వాదన విన్పిస్తోంది. ప్రభుత్వాల్లో కీలక నియామకాలను వీరి కనుసన్నల్లోనే సాగుతుంటాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఇప్పటి వరకూ క్విడ్ ప్రోకో ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా వెనుకబడిన దక్షిణాఫ్రికా కూడా ఇందుకు మినహాయింపు కాదని ఇప్పుడు రుజువైంది. వ్యాపారి ఎక్కడున్నా వ్యాపారే. దేశమేదైనా అతని లక్ష్యమొక్కటే. నాలుగు రాళ్లు వెనకేసుకోవడమే అతని లక్ష్యం. ఇందులో భాగంగా అధికారానికి సన్నిహితంగా మసలుతుంటాడు. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో, దేశాల్లో జరుగుతున్నది ఇదే.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- దక్షిణాఫ్రికా

