‘కీ’ రోల్ లో..కేసీఆర్

‘దేశంలో రాజకీయాలు మారాలి. గుణాత్మకమైన మార్పు రావాలి. అది మూడో ఫ్రంట్ నా? మరేదైనా సంఘమా? అన్నది ముఖ్యం కాదు. ఒక ఉపకరణం అవసరం. అందుకు చొరవ తీసుకునేందుకు నాకు అభ్యంతరం లేదు.’ అంటూ తన పదునైన వ్యాఖ్యలతో కేసీఆర్ పరోక్షంగా తేల్చి చెప్పేశారు, మూడో ఫ్రంట్ ముచ్చటకు రంగం సిద్ధమవుతోందన్నమాటే. బీజేపీ, కాంగ్రెసులు ‘దొందూ దొందే’ మార్పునకు ఉపయోగపడవని కుండబద్దలు కొట్టేశారు. నూతన రాజకీయాలతో ప్రజల్లో మార్పునకు దోహదం చేసే ప్రత్యామ్నాయం అవసరమని తెలంగాణ సీఎం స్పష్టం చేశారు. సందర్బాన్ని బట్టి నాయకుడు పుడతాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో అలాగే జరిగింది. దేశ అవసరాల దృష్ట్యా నాయకత్వం అనేది అలాగే పుడుతుందంటూ తన రాజకీయ అంచనాను కూడా ప్రకటించారు. మొత్తమ్మీద దక్షిణా పథం నుంచి కొత్త సమీకరణలకు సంకేతాలు వెలువడుతున్నాయి. దీనిని గమనించిన బీజేపీ ముందస్తుగానే కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఇటీవల దాడిని ఉధృతం చేసింది.
పొత్తు రహస్యం...
గతంలో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు సంగతి ప్రస్తావనకు వచ్చినప్పుడు కరాఖండిగా కేసీఆర్ అటువంటి ప్రసక్తే లేదని చెప్పేవారు. దానిపై తాను జోస్యం చెప్పలేనని మీడియాకు సమాధానాన్ని దాటవేశారు. ఒక విషయంపై స్పష్టమైన విధానం, అవగాహనతో మాట్లాడే కేసీఆర్ ప్రశ్న నుంచి తప్పించుకోవడమంటే కచ్చితంగా తెరవెనక వ్యూహరచన సాగుతున్నట్టేనని పరిశీలకులు భావిస్తున్నారు. దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులపై తాను కొందరు ప్రముఖ రాజకీయనాయకులతో మాట్టాడిన విషయాన్ని కూడా సీఎం అంగీకరించారు. అంటే ప్రాథమిక సన్నాహాలు పూర్తయినట్లే చెప్పుకోవాలి. అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి ప్రకటన చేసే ముహూర్తం ఎప్పుడన్నదే రాజకీయంగా ఎదురుచూడాల్సిన ఘట్టం. ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ టీడీపీకి స్నేహహస్తం అందించారు కేసీఆర్. దోబూచులాట తగదంటూ ఇస్తామని మోడీ అంటే కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనన్నారు. అటు ఆంధ్రప్రదేశ్ కు, ఇటు తెలంగాణకు రాజ్యాంగ బద్దంగా రావాల్సిన నిధులే తప్ప ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీలేదని కూడా చెప్పడం ద్వారా మేమిద్దరం ఒకటే అన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించగలిగారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతల సమావేశంలో మాట్లాడుతూ పొత్తు తప్పదని తేల్చి చెప్పడం ఇటీవలనే చోటు చేసుకుంది. పార్టీని బ్రతికించుకునే క్రమంలో ఈ నిర్ణయం అవశ్యమన్నారాయన. కేసీఆర్ కూడా దానిని తోసిపుచ్చకుండా దోస్తానా విషయం సందర్భాన్ని బట్టి ఉంటుందన్నారు. మొత్తమ్మీద తెలుగు ముఖ్యమంత్రులు జట్టు కట్టే రాజకీయ పరిణామాలు క్రమేపీ తేటతెల్లమవుతున్నాయి.
పోరాటం తప్పదు...
మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్, అఖిలేష్ యాదవ్ వంటి ప్రాంతీయంగా ప్రాబల్యం కలిగిన నేతలతో కేసీఆర్ ఒక దఫా ఇప్పటికే మాట్టాడినట్లు తెలుస్తోంది. సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడిచే విధంగా విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్రాల పాత్ర నానాటికీ అడుగంటి పోతున్న తీరుపై వారంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారనేది పార్టీ ఉన్నత స్థాయి సమాచారం. ఒక వర్గంగా ఏర్పడి హక్కుల కోసం నినదించాలా? లేకపోతే రాజకీయ కూటమి కట్టాలా? అన్నవిషయంలో మాత్రం ఎవరూ స్పష్టమైన నిర్ణయానికి రాలేదనేది సీఎం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ కొంత బలహీన పడి, కాంగ్రెసు పూర్తిస్థాయిలో పుంజుకోకపోతే ఏర్పడే గ్యాప్ ను మూడో ఫ్రంట్ నింపవచ్చనేది కేసీఆర్ యోచన. 120 నుంచి 140 స్థానాల్లో ప్రాంతీయ పార్టీల సమాఖ్య బలమైన ప్రభావం చూపుతుందని నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ తరహాలో ప్రాంతీయ పార్టీలు ఆధిక్యం కనబరిచే రాజకీయ వాతావరణం కూడా ప్రస్తుతం ఏర్పడుతోందనేది పరిశీలకుల అంచనా. ఎత్తుగడల్లో కేసీఆర్ చాలా చాకచక్యం కనబరుస్తారు. మాటకారితనం, హిందీ, ఇంగ్లిషు భాషలలో వాగ్ధాటి కచ్చితంగా ఆయనకు అసెట్ గా నిలుస్తుంది. తెలంగాణలో చాలా కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నట్లుగా రెండు సర్వేల ద్వారా కేసీఆర్ కన్ఫమ్ చేసుకున్నారు. వ్యూహాత్మకంగా ముందుకెళితే జాతీయంగా తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యం కూడా పెరుతుందనే అంచనాతో మిగిలిన పక్షాలను ఏకతాటిపైకి తెచ్చే పథకానికి రూపకల్పన చేస్తున్నారాయన. బీజేపీకి కంటగింపుగా మారినా పోరాటానికి సిద్దపడే మోడీ, అమిత్ షా లను సైతం లెక్కపెట్టకుండా విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారనేది పరిశీలకుల అంచనా.
పొలిటికల్ రీ అలయన్స్...
రాజకీయ పునరేకీకరణలకు, సమీకరణలకు ప్రస్తుత పొలిటికల్ అట్మాస్ఫియర్ అనుకూలంగా మారిందని ప్రాంతీయ పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ దేశంలోని అతిపెద్ద పార్టీగా తన పరిధిని విస్తరించుకుంటూ పోతోంది. నిన్నామొన్నటివరకూ అస్తిత్వం లేని ప్రాంతాల్లో సైతం అధికారాన్ని సాధిస్తోంది. అదే సమయంలో దీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బలహీనపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. విస్తరణ కాంక్ష కారణంగా విపక్షాల పట్ల మోడీ,అమిత్ షాలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మిత్రులు కూడా శత్రువులుగా మారుతున్నారు. బీజేపీ పార్టీ పెరుగుతోంది. కానీ అవసరానికి చేయి అందించే వారిని దూరం చేసుకుంటోంది. వాజపేయి, అద్వానీల సమయంలో పార్టీ బలం కంటే విశ్వాసపాత్రమైన మిత్రపక్షాల మద్దతే కీలకంగా కనిపించేది. ఇప్పుడు మిత్రపక్షాల ను నమ్ముకునే పరిస్థితులు లేవు. పరస్పర విశ్వాసరాహిత్యం కొనసాగుతోంది. కత్తులు పక్కలో పెట్టుకుని కౌగిలించుకున్నట్లుంది పరిస్థితి. ఈ నేపథ్యంలో పొలిటికల్ రీ అలయన్స్ అవసరం ఏర్పడుతోంది. దీనిని సరైన సమయంలో వినియోగించుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. తనకున్న రాజకీయ ఇబ్బందుల దృష్ట్యా తన పాత్రను కుదించుకోవాల్సి వచ్చిన చంద్రబాబు నాయుడు సైతం కేసీఆర్ చొరవకు మద్దతిచ్చే వాతావరణమే కనిపిస్తోంది.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- కేసీఆర్

