కమలం కోటలో కులాలే కీలకం...!

భారత దేశంలో ఎన్నికలు అంటేనే కులాల కురుక్షేత్రం. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా కుల ప్రమేయంలేని ఎన్నికలను చూడలేం. స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజుల్లో దాని ప్రభావం పెద్దగా లేదు. కానీ క్రమంగా ఎన్నికల్లో కులమే కీలకమైంది. ఆధునిక భారతంలో కులం విలువ వెలకట్టలేనిది. అందుకే ఎన్నికల సమయంలో అన్ని పార్టీలూ కులం చుట్టూ తిరగడం అనివార్యమైంది. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీల వరకూ ఈ అంశాన్ని విస్మరించలేని అనివార్య పరిస్థితి ఏర్పడింది.
కూడికలు... తీసివేతతో...
ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలతో అందరి దృష్టీ ఆకర్షిస్తున్న గుజరాత్ లో ఈ పరిస్థితి ఒకింత ఎక్కువగానే ఉంది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన కూడికలు, తీసివేతలతో సతమతమవుతున్నాయి. గుజరాత్ పేరు చెప్పగానే ముందుగా ‘పటేల్’ సామాజిక వర్గం గుర్తుకు వస్తుంది. దేశ తొలి ఉప ప్రధాని, తొలి హోంమంత్రి ఉక్కుమనిషిగా గుర్తింపు పొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు స్ఫురణకు వస్తుంది. పటేల్ సామాజికవర్గం అండతోనే గత రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో బీజేపీ చక్రం తిప్పుతోంది. విద్య, ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్లు కావాలంటూ ఈ సామాజిక వర్గానికి చెందిన యువనేత హార్థిక్ పటేల్ రెండేళ్ల క్రితం రంగ ప్రవేశం చేయడంలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇందుకు బీజేపీ సుముఖంగా లేకపోవడంతో హార్థిక్ పటేల్ ఉద్యమ బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అధికార పార్టీలో ఆందోళన రేకెత్తించారు. పాటీదార్లుగా పిలవబడే వీరు రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉండొచ్చని అంచనా. మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 60 స్థానాల్లో గెలుపోటములను వీరు ప్రభావితం చేయగలరు. తాము గెలిస్తే పాటీదార్లకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీతో కాంగ్రెస్ పార్టీ ఆ వర్గం నాయకుడు హార్థిక్ పటేల్ ను తమవైపునకు తిప్పుకుంది. ప్రస్తుతం హార్థిక్ పటేల్ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ కాంగ్రెస్ తరుపున పరచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఠాకూర్లదీ కీలకపాత్రే....
మరో 70 నియోజకవర్గాల్లో ఠాకూర్లు, కోలీలు కీలక పాత్ర పోషించనున్నారు. కోలీలు దళితుల్లోని ఓ ప్రత్యేక వర్గం. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఈ వర్గం వారే. గుజరాత్ ఎన్నికల్లో ఈ వర్గం ఓట్లపై కన్నేసిన పరధాని మోడీ ముందుచూపుతోనే రాష్ట్రపతి అభ్యర్థిగా ఈ ఏడాది జూన్ లో రామ్ నాధ్ కోవింద్ పేరును ప్రకటించారన్న ప్రచారం ఉంది. దీనిని తోసిపుచ్చడం కూడా కష్టమే. ఠాకూర్లు ఆర్థికంగా సంపన్నులే. వారి ప్రాధాన్యతను విస్మరించడం పార్టీలకూకష్టమే. గుజరాత్ లో గెలుపునకు దీనిని ఆఖరి అవకాశంగా భావిస్తున్న కాంగ్రెస్ అన్ని వర్గాలనూ అక్కున చేర్చుకునేందుకు తంటాలు పడుతోంది. అడిగినవన్నీ ఇచ్చేందుకు ముందుకు వస్తోంది. చిన్నపాటి నాయకులకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. పాటీదార్ల నాయకుడైన హార్థిక్ పటేల్ తో పాటు దళిత ఉద్యమనేత జిగ్నేశ్ మెవాని, ఓబీసీల నాయకుడు అల్ఫేశ్ ఠాకూర్ లను తన వైపునకు తిప్పుకుంది. అల్ఫేశ్ ఠాకూర్ రాధన్ పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తుండటం విశేషం. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న జిగ్నేశ్ మెవానీపై తన అభ్యర్థిని కాంగ్రెస్ పోటీ పెట్ట లేదు.
కాంగ్రెస్ ఈ వ్యూహంతోనే....
కాంగ్రెస్ ప్రస్తుత వ్యూహం చూస్తుంటే 80వ దశకంలో ఆ పార్టీ అనుసరించిన ‘ఖామ్’ విధానం గుర్తుకు వస్తుంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడైన భరత్ సింగ్ సోలంకీ తండ్రి మాధవ్ సింగ్ సోలంకీ ఈ సూత్రం ఆధారంగా ఎన్నికలకు వెళ్లి రెండుసార్లు పార్టీకి ఘనవిజయం కట్టబెట్టారు. ‘ఖామ్’ అంటే క్షత్రియ, హరిజన, ఆదివాసీ, ముస్లిం కూటమి అని అర్థం. 1980లో ఈ కూటమి మద్దతుతతో కాంగ్రెస్ 141 స్థానాలను గెలుచుకుంది. 1985లో ఏకంగా 149 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్ర చరిత్రలో ఇంతటి ఘన విజయాన్ని ఇప్పటి వరకూ ఏ పార్టీ నమోదు చేయలేదు. ప్రస్తుతం ఈ నాలుగు సామాజిక వర్గాలతో పాటు పాటీదార్లు కూడా మద్దతు ఇస్తున్నందున హస్తం పార్టీ విజయం పై ధీమాతో ఉంది.
ఈసారి గడ్డుకాలమేనా...?
ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో బీజేపీ అన్ని సామాజిక వర్గాల మద్దతును పొందుతూ వస్తోంది. పటేళ్లు, ఓబీసీలు, క్షత్రియ, ఎస్సీ, ఎస్టీలు పార్టీకి అండగా ఉంటున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి ఉందా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. గత నాలుగు ఎన్నికల్లో బీజేపీ గెలుస్తున్నప్పటికీ దాని ఓట్ల శాతంలో పెద్దగా మార్పులేదు. 1995లో 42.5 శాతం ఓట్లను బీజేపీ సాధించగా అదేపట్టును కొనసాగిస్తూ వస్తోంది. 2012 ఎన్నికల్లో 47.9 శాతానికి పెరిగింది. రాష్ట్ర జనాభాలో 32 శాతం మంది ఓబీసీలు, క్షత్రియ, దళిత, ఆదివాసీలు 21 శాతం మంది, ఆదివాసీలు 14 శాతం మంది, ముస్లింలు 9 శాతం మంది ఉన్నారని అంచనా. 2012 ఎన్నికల్లో బీజేపీ కేవలం అయిదు వేల లోపు మెజారిటీతో 12 స్థానాల్లో విజయం సాధించింది. కులాల లెక్కలు కీలకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి స్తానాల్లో గెలుపు అంత తేలిక కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమర్థత, సచ్ఛీలత, సత్పరిపాలన స్థానంలో కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు కీలకంగా మారడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదం కాదా? అన్న సంగతిని ఆలోచించాలి.
-గుజరాత్ నుంచి ‘తెలుగుపోస్ట్’ ప్రత్యేక ప్రతినిధి

