ఈ మంత్రిగారి అడ్రస్ కొంచెం చెప్పరూ...!

ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంలో కొందరు కీలక మంత్రుల కేరాఫ్ ఎక్కడో కూడా అర్ధం కావడం లేదు. వారసలు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? వంటి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మంత్రి వర్గం ఎలా ముందుకు వెళ్తుంది? ఎలాంటి కార్యాచరణతో ప్రభుత్వ పథకాలను, పార్టీనీ ఏవిధంగా ముందుకు తీసుకువెళ్తారు ? ప్రజలకు పార్టీని ఎలా చేరువ చేస్తారు? అనే అనేక సందేహాలు ఉన్నాయి. మరి ప్రజలకోసం పదవులు చేపట్టామని, తమకు వ్యక్తిగతంగా పదవులతో పనిలేదని చెప్పుకొచ్చే మంత్రుల్లో కొందరు ఇప్పుడు భూతద్దం తెచ్చి వెతికినా కనిపించడం లేదనే విమర్శలు ఊపందుకున్నాయి. మరి ఈ విమర్శలు ఎదుర్కొంటున్నవారు ఎవరు? ఏ శాఖ చూస్తున్నారు.
కొల్లు గ్రాఫ్ పడిపోయిందా?
పార్టీ పరంగాను, వ్యక్తిగతంగానూ ప్రజల్లో ఉన్న పలుకబడి ఏంటి? టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద వీరికి ఉన్న గ్రాఫ్ ఏంటి? వంటి అనేక ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చూద్దాం. ఈ పరంపరలో తొలి మంత్రిగా రాజధాని ప్రాంత కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర గురించి తెలుసుకుందాం. యువకుడిగా, బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా మచిటీపట్నం రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1998లోనే మచిలీపట్నం తెలుగు దేశం పార్టీ యూత్ ప్రెసిడెంట్‌గా అరంగేట్రం చేసిన కొల్లు.. ఇంతింతై అన్నరీతిలో పార్టీలో పైకి వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన యువ నేతల్లో కొల్లు ఒకరు. 2009లో మచిలీపట్నం అసెంబ్లీ టికెట్‌ను పొందిన కొల్లు.. ఆ ఎన్నికల్లో పేర్ని నాని చేతిలో ఘోరంగా ఓడిపోయారు.
బీసీల నేత కావడంతో...
అయితే, 2014 ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన కొల్లు.. అదే వ్యక్తి పేర్ని నానిపై 15,800 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక, టీడీపీకి బీసీలే అండ అంటూ పదే పదే చెప్పుకొచ్చే బాబు.. ఈ క్రమంలోనే బీసీ వర్గం... మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొల్లును మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. వెనువెంటనే అత్యంత ప్రధానమైన శాఖలు చేనేత, ఎక్సైజ్, బీసీ సంక్షేమం, యువజన శాఖలను కొల్లుకు అప్పగించారు చంద్రబాబు. ఇన్ని శాఖలను చేతిలో పెట్టుకున్న ఎక్సైజ్ శాఖను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే, విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బార్లో జరిగిన మృతుల ఘటన ఏడాదిన్నర కిందట రాష్ట్రాన్ని కుదిపేసింది. కల్తీ మద్యం కేసులో ప్రభుత్వం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంది. అయినా కూడా చంద్రబాబు ఈ విషయాన్ని సర్దుబాటు చేశారు.
పట్టున్న శాఖ నుంచి తప్పించడంతో...
ఇక, ఇదే సమయంలో ఆ ఏడాది ఎక్సైజ్ ఆదాయం భారీ ఎత్తున తగ్గిపోయింది. దీంతో చంద్రబాబు ఈ శాఖను కొల్లు నుంచి తప్పించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కొల్లును కొన్ని శాఖలకే పరిమితం చేశారు. క్రీడలు, యువజన, న్యాయ శాఖల విధులు మాత్రం అప్పగించారు. ఈ పరిణామం ఊహించనిది కావడంతో మంత్రి కొల్లు బిత్తరపోయారు. అయినా కూడా అధినేతపై విమర్శలు చేసే ధైర్యం లేక మిన్నకుండి పోయారు. మచిలీపట్నంలో నిర్మిస్తున్న పోర్టుకు భూములు సేకరించలేకపోయాడని.. సమర్ధవంతంగా ఈ విషయాన్ని డీల్ చేయలేకపోయాడని బాబు భావించినట్టు సమాచారం. ఇక, ఈ క్రమంలోనే ఆయనను ఎక్సైజ్ శాఖ నుంచి తొలగించారు. దీంత తీవ్ర మనస్థాపానికి గురైన కొల్లు అప్పటి నుంచి ముభావంగానే ఉంటున్నారు.
మౌనంగా కొల్లు...
గతంలో రోజూ ఏదో ఒక విషయంపై మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పుడు అస్సలు మీడియా కంటికే కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏంటనే విషయంపై అందరూ దృష్టి పెట్టారు. తనకు ఇష్టమైన ఎక్సైజ్ శాఖను తప్పించడమే కారణమని తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖలో ఉండగా ఆయనకు ఉన్న పలుకుబడి, గౌరవం ఇప్పుడు లేవని, అదేవిధంగా రాబడి కూడా ఉండేదని పలువురు చెప్పుకొంటున్నారు. అయితే, వీటికి ఇప్పుడు కత్తెర పడడంతోనే కొల్లు అలిగారని సమాచారం. మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు ఉండడం, అనుకున్న విధంగా పరిస్థితి లేకపోవడం వంటి కారణంగా కూడా కొల్లు చప్పబడి పోయాడని అంటున్నారు. అందుకే ఎన్నికలు మరో ఏడాదిన్నర ఉందనగా కూడా ప్రజల్లో ఉండడం లేదని తెలుస్తోంది.
ఏదో మొక్కుబడిగా...
కేవలం మొక్కుబడిగా సమీక్షలు నిర్వహించడం, మమ అనిపించడం, ఏదో చేశాం అంటే చేశాం అనే తరహాలోనే వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. మరోపక్క, పార్టీ, ప్రభుత్వంలో అధినేత చంద్రబాబు సహా చినబాబు హడావుడి ఎక్కువ కావడం కూడా కొల్లుకు ఇగో ఫీలింగ్ కలిగేలా చేసిందని, ఇక, తాను చూస్తున్న శాఖల విషయాలను కూడా నేరుగా చంద్రబాబే సమీక్షిస్తుండడం వంటి కారణాలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. అయినా కూడా ఇటీవల మచిలీపట్నం పోర్టు పనులకు సంబంధించిన భూ సేకరణను మంత్రి పరిశీలించడం గమనార్హం. సో..ఏదిఏమైనా.. యువనేత మాత్రం ప్రస్తుతం ఇబ్బందిలోనే ఉన్నాడని తెలుస్తొంది. మరి అధినేత ఎలా ఊరడిస్తారో చూడాలి.
- Tags
- కొల్లు రవీంద్ర

