ఈయనో పవర్ లేని మంత్రిగారు....!

ఏపీ మంత్రుల్లో ఒకరైన పితాని సత్యనారాయణ గురించి రాజధాని అమరావతిలో ఆసక్తికర చర్చ సాగుతోంది. అపార రాజకీయ అనుభవం సొంతం చేసుకున్న పితాని గతంలోనూ మంత్రిగా వ్యవహరించడంతో ఇప్పుడు ఆయన గురించిన చర్చపై ఆసక్తి నెలకొనడం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆచంట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పితానికి రాజకీయం కొట్టిన పిండి! అయితే, ఇటీవల కాలంలో ఆయన చాలా మౌనంగా ఉంటున్నారు. బీసీ వర్గానికే చెందిన పితానికి కూడా సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. 2009లో కాంగ్రెస్‌లో ఉన్న పితాని.. అప్పట్లోనూ మంత్రి పదవిని అలంకరించారు.
హ్యాట్రిక్ కొట్టినా....
అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చక్రం తిప్పిన ఆయన బాగానే వెనకేసుకున్నాడనే వ్యాఖ్యలు వినిపించేలా చేసుకున్నారు. ఇక, ఆ తర్వాత విభజన నేపథ్యంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర లోకి వెళ్లి ఆ వెంటనే టీడీపీ జెండా పట్టుకున్నారు. దీంతో 2014 ఎన్నికల్లో పితానికి చంద్రబాబు ఛాన్స్ ఇచ్చారు. తిరిగి ఆచంట నుంచి పోటీ చేసిన పితాని.. అప్పటికి వైసీపీ అభ్యర్థి ప్రసాద రాజుపై 3 వేల అత్తెసరు మెజార్టీతో గెలుపొందారు. దీంతో పితాని 2004, 2009లో కాంగ్రెస్ నుంచి 2014లో టీడీపీ నుంచి వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇక 2014లో గెలిచిన వెంటనే ఏపీ ప్రభుత్వంలో మంత్రి సీటు దక్కుతుందన్న హామీతోనే ఆయన రాష్ట్ర విభజన సమయంలో బాబు చెంతకు చేరి సైకిలెక్కారు. అయితే, అనుకున్నది ఒక్కటి అయింది మరొక్కటి అన్నట్టుగా.. మారిపోయింది వ్యవహారం.
మంత్రి పదవి దక్కినా....
కేబినెట్ లో చోటు దక్కలేదు. దీంతో ఒకింత హర్ట్ అయిన పితాని.. మీడియా ముందుకు రావడానికి ఇష్టపడలేదు. ఇక, రాష్ట్రంలో కాపులను కరుణించాలని నిర్ణయించుకున్న చంద్రబాబు బీసీని ఒకరిని మంత్రిని చేయడం ద్వారా బీసీల కాక నుంచి బయట పడే ఛాన్స్ ఉందని ఆలోచించారు. అనుకున్నట్టుగానే చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పితానికి మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో చోటు కల్పించారు. ఫలితంగా కాపులకు తాను అనుకున్నది చేసినప్పటికీ బీసీల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకుంటారని బాబు భావించారు. అయితే, పితాని మాత్రం కేబినెట్ ర్యాంక్ తో ఉన్న పోస్టు ఇస్తారని భావిస్తే.. బాబు మాత్రం కార్మిక శాఖ ఇచ్చారు.
ఉన్నా ఒకటే..లేకున్నా ఒకటేనా?
ప్రస్తుతమున్న పొజిషన్ ఈ శాఖలో ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే.. కనీసం మంత్రి గారొస్తే.. గేటు తీసే వ్యక్తులు కూడా లేరని చెప్పుకొంటారు. దీనికి కారణం కార్మిక శాఖ మంత్రికి ఎలాంటి పవర్స్ లేకపోవడమేనని అంటున్నారు. అదీకాక, కార్మిక చట్టం కింద తీసుకునే నిర్ణయాలను హోం శాఖకు దఖలు పరచడం కూడా పితానికి నచ్చలేదు. గతంలో ఏదైనా ఫ్యాక్టరీలో సమస్య వస్తే.. నేరుగా మంత్రి జోక్యం చేసుకునే వెసులుబాటు ఉండేది. అయితే, ప్రస్తుతం ఏమీలేదు. నేరుగా సీఎంవో అధికారులే జోక్యం చేసుకుంటున్నారు. ఇక, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారు .. కార్మిక శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి.
సంతకానికి విలువ లేకుండా....
ఈ విషయంలోనైనా తన సంతకానికి విలువ ఉంటుందని భావించారు పితాని. కానీ, ఇక్కడ గమ్మత్తు ఏంటంటే.. రాష్ట్రానికి ఎవరెవరు వస్తున్నారో ? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నారో ? ఎంత మేరకు పెడుతున్నారో ? వంటి కనీస వివరాలు కూడా కార్మిక శాఖకు అందడం లేదు. మొత్తం అంతా సీఎం చంద్రబాబు అంతా తానై వ్యవహరిస్తున్నారు. దీంతో కార్మిక శాఖలో ఉన్నతాధికారులకే పనులు ఉండడం లేదు. ఉన్న పవర్స్ పీకేయడంతో మంత్రి గా ఉన్న పితాని ఏం చేయాలో తెలియక.. మౌనంగానే ఉంటున్నారని అంటున్నారు కార్యాలయ అధికారులు. లేకపోతే.. మంత్రిగా పితాని మీడియా ముందు గతంలో వ్యవహరించిన తీరు ఎలా ఉండేదో తెలిసిందే కదా ? అని కూడా అంటున్నారు.
కాపు రిజర్వేషన్లపై....
కాగా, ఇటీవల కాపులకు 5% రిజర్వేషన్ కల్పించడం తనకు కూడా బాధగానే ఉందని పితాని ఇటీవల తనను కలిసిన బీసీ నేతలతో అనడం వివాదానికి దారితీసింది. ఇంతలోనే మాట సవరించుకున్న పితాని.. బాబు ఎవరికీ ఏ ఒక్క వర్గానికీ అన్యాయం చేయరని చెప్పడం గమనార్హం. మొత్తంగా అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో? ఏం చేస్తున్నారో? కూడా తెలియని పరిస్థితి నెలకొందని అంటున్నారు. ఏదేమైనా పితాని మాట అటు జిల్లాలోను, ఇటు అసెంబ్లీలోనే కాదు, మీడియాలో కూడా ఎక్కడా వినపడడం లేదు. మంత్రిగా ఉండి ఆయన నియోజకవర్గంలోనే పనులు చక్కపెట్టుకుంటున్నారు.

