అవినీతి అదరహో

దేశంలో దొంగలు పడ్డారంటూ గతంలో ఒక చలనచిత్రం రికార్డులు సృష్టించింది. దాదాపు నలభై సంవత్సరాల తర్వాత అదే విషయాన్ని పదే పదే అంతర్జాతీయ సంస్థలు ధ్రువీకరిస్తున్నాయి. రాజకీయనేతలు,కాంట్రాక్టర్లు, సర్కారీ ఉద్యోగులు కుమ్మక్కై అవినీతిని రాజ్య మార్గం చేసేశారు. ప్రతిపనికీ లంచం, మామూలు, ఇచ్చిపుచ్చుకోవడాలు సర్వసాధారణ తంతుగా రూపుదిద్దారు. కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణలు, కంప్యూటరీకరణ, సమాచార చట్టం వంటివి చట్టుబండలుగా మిగిలిపోతున్నాయి. కొత్త రూటు పట్టి లంచావతారులు కోట్లకు పడగలెత్తుతున్నారు. దీనికి అడ్డుకట్ట పడే సూచనలు కనిపించడం లేదు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వమున్నా కథ షరామామూలే అన్నతంతులో సాగిపోతోంది.ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్ వెల్లడించిన నివేదికలో మనదేశం 81 వ స్థానం సాధించింది. జనాభాలో ప్రపంచంలో రెండో స్థానంలో, ఆర్థికాభివృద్ధిలో ఏడో స్థానంలో ఉన్న భారత్ అవినీతిలో మాత్రం మోత మోగిస్తోందనేందుకు ఇదే నిదర్శనం. కనిష్టస్థాయి మార్కుల ప్రమాణంతో చిన్నాచితక దేశాలకంటే కూడా నీతి విషయంలో వెనకబడి పోయింది. రాజకీయ, బ్యూరోక్రసీ, పారిశ్రామిక వేత్తల అక్రమ సంబంధాలు నానాటికీ పెచ్చరిల్లడమే దీనికి కారణమనేది భారతీయుల విశ్వాసం. కరప్షన్ పై అలుపెరుగని పోరాటమంటూ కేంద్రప్రభుత్వం చెబుతున్న మాటలు నీటిమూటలుగా మిగిలిపోతున్నాయి.
ఫలించని సంస్కరణలు....
అవినీతిని తగ్గించాలని చాలాకాలంగా దేశంలో ఉద్యమాలు సాగుతున్నాయి. ప్రభుత్వాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. తీవ్రంగా విసిగిపోయిన సందర్భాల్లో అధికార పార్టీలను కూలదోసి ప్రతిపక్షాలకు పగ్గాలు అప్పగిస్తున్నారు. అయినా మార్పు రావడం లేదు. ఎప్పటికప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పులిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాత్రం మారడం లేదు. బోఫోర్సు కుంభకోణంతో 1989లో కాంగ్రెసును కుప్పకూల్చి విపక్షాలకు పట్టం గట్టారు. కానీ ఆ మ్యాండేట్ ను ప్రతిపక్షాలు నిలబెట్టుకోలేక చేతులెత్తేసి తిరిగి అధికారం కాంగ్రెసు చేతిలో పెట్టాయి. 2004 నుంచి 2014 వరకూ అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాలతో ప్రజలు విసుగెత్తిపోయారు. తీవ్రమైన ఆగ్రహంతో 2014లో ఎన్డీఏకి పట్టం గట్టారు. నరేంద్రమోడీ ప్రజల్లో ఆశలు మొలకెత్తించారు. 2016లో నోట్ల రద్దును అవినీతిపై పోరాటంగా చిత్రీకరించారు. కేవలం ఈ సాకు కారణంగానే అష్టకష్టాలు పడ్డప్పటికీ ప్రజలు కేంద్రప్రభుత్వానికి సహకరించారు. 2017 లో ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో పారదర్శకత వస్తుంది . పన్నుల ఎగవేత తగ్గుతుంది. ఇది దీర్ఘకాలంలో రేట్లు దిగి రావడానికి దోహదం చేస్తుందని ప్రచారం చేశారు. కానీ ధరలు దిగిరాలేదు. పారదర్శకత ఊసే లేదు. పన్నుల ఎగవేతకు కొత్త మార్గాలు వెదుక్కున్నారు. నోట్ల రద్దుతో దాదాపు నాలుగు నెలలపాటు నడిరోడ్డుపై క్యూ కట్టిన వారి నోళ్లు మూతపడ్డాయి. తాజా నివేదికలో నీతిమంతమైన దేశాల్లో భారతదేశం ర్యాంకు మరో రెండు స్థానాలు దిగజారింది. అంటే మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ హయాంలో ప్రభుత్వపరమైన, సగటు మనిషితో ముడిపడిన అవినీతి పెరిగిందే తప్ప తగ్గుముఖం పట్టలేదనేది అంతర్జాతీయ సంస్థల నిర్ధారణ.
ప్రశ్నిస్తే ప్రాణాల మీదకే...
అవినీతిని ప్రశ్నించే వ్యవస్థలపై దాడులు, వ్యక్తులపై హత్యాయత్నాలు కొనసాగుతున్నాయని ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ అభిప్రాయపడింది. అటువంటి దేశాల జాబితాలో భారత్ ది కూడా ప్రముఖ స్థానమేనని తేల్చి చెప్పింది. సమాచార హక్కు వంటి చట్టాలు వచ్చిన తర్వాత ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరిగింది. సమాచారాన్ని కోరడం ద్వారా ప్రభుత్వ పనితీరును, సర్కారీ అలసత్వాన్ని నిలదీసే అవకాశం చిక్కింది. కానీ అటువంటివారిని అంతమొందించే ప్రయత్నాలూ పెరిగాయి. ముఖ్యంగా ప్రజలకు సమాచారం తెలపడాన్నే వృత్తిగా మార్చుకున్నజర్నలిస్టులపై దాడులు రోజురోజుకీ ఉద్ధృతమవుతున్నాయన్న విషయాన్ని ఆ సంస్థ గుర్తించింది. గణాంకాల సహా ఆయా వివరాలను వెల్లడిస్తూ, అవినీతి అధికంగా జరుగుతోందన్న దానికి ఇది కూడా ఒక కొలబద్దేనని పేర్కొనడం గమనార్హం. మొత్తమ్మీద దేశంలో పరిస్థితులు ఏమాత్రం నీతిమంతమైన పాలనకు అనువుగా లేవనేది నివేదిక సారాంశం. ప్రభుత్వంలో నెలకొన్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం(క్రోనీ కేపిటలిజం), ఇచ్చిపుచ్చుకోవడాలు (క్విడ్ ప్రో కో) , రాజకీయ నాయకులే కాంట్రాక్టర్ల రూపుదాల్చడం, బినామీ కాంట్రాక్టులు, నేతల బంధుప్రీతి వంటివి కూడా అవినీతి పెరగడానికి కారణాలుగా గుర్తించింది. పటిష్ఠమైన చట్టాలు చేయడంతోపాటు న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించుకోవాలి. పౌరసమాజానికి స్వేచ్ఛ కల్పించాలంటూ అవినీతిని నిరోధించడానికి అవసరమైన పారామీటర్లను కూడా ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్ సహేతుకంగా సూచించింది.
అంతా కుమ్మక్కు....
బారత్ వంటిదేశాల్లో అవినీతి పెరగడానికి ముఖ్య కారణం అన్నివ్యవస్థలూ కుమ్మక్కుకావడమే. దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన రాజకీయ నాయకులు, నిర్వహణపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారయంత్రాంగం, వ్యాపార, వాణిజ్య, కాంట్రాక్టు రంగాలకు చెందిన వ్యక్తులు స్వార్థం కోసం చేతులు కలపడంతో ప్రశ్నించేతత్వం తగ్గిపోతోంది. చెక్ పాయింట్లకు చెల్లుచీటీ పాడేస్తున్నారు. ప్రధానంగా దేశంలోని జీడిపీలో 15 శాతం సంపద కేవలం 101 మంది వ్యక్తుల చేతిలో కేంద్రీకృతమై ఉందన్నది చేదు వాస్తవం. విభిన్న మార్గాల్లో వారంతా అధికారాన్ని ఇన్ ఫ్లూయన్స్ చేయడం ద్వారా అనుచిత లబ్ధి పొంది లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తినట్లుగా ప్రజలు భావిస్తున్నారు. గతంలోపారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు రాజకీయవేత్తలకు విరాళాలు ఇచ్చి తమకు కావాల్సిన పనులు చేయించుకునేవారు. కానీ గడచిన రెండు దశాబ్దాలుగా ఈ పద్ధతిలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. వేరొకరిచేత రికమండేషన్ చేయించుకోవడమెందుకన్న భావనతో కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలే నాయకులుగా రూపుదాల్చుతున్నారు. రాజ్యసభ సభ్యత్వం వంటి పెద్దస్థానాలను ఆక్రమిస్తూ వ్యవస్థనే శాసిస్తున్నారు. ఇదో పెద్ద పెడ ధోరణి. తమ నిధులు, విరాళాల కోసం అన్ని రాజకీయ పార్టీలు కూడా దీనిని ప్రోత్సహిస్తున్నాయి. తమ పబ్బం గడిచిపోతే చాలు అనుకుంటూ వ్యవస్థలో అక్రమార్కుల ఎదుగుదలకు అండగా నిలుస్తున్నాయి. ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ చాటిచెప్పిన సత్యమిదే. బలమైన నాయకత్వం ఉన్నప్పుడే ఇటువంటి వాటికి అడ్డుకట్ట పడాలి. అందుకు ప్రధాని మోడీ వంటి వారు చొరవచూపడం ఎంతైనా అవసరం.
-ఎడిటోరియల్ డెస్క్
- Tags
- అవినీతి

