Tue Dec 30 2025 03:57:08 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు... వైకుంఠ ద్వార దర్శనానికి బారులు తీరి
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు తెల్లవారు జాము నుంచి ప్రారంభమయ్యాయి

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు తెల్లవారు జాము నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి వైకుంఠ ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనాలను పది రోజు పాటు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి, అలాగే మంగళవారం నుంచి ప్రారంభమయ్యే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుమలలో ప్రతి ఏడాది జరిగే ముఖ్యమైన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేస్తే పుణ్యం లభిస్తుందని, మోక్షం ప్రాప్తిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు...
సాంప్రదాయంగా వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వారం తెరిచేవారు. అయితే భక్తుల రద్దీని నియంత్రించేందుకు 2020 డిసెంబర్లో దర్శన కాలాన్ని పది రోజులకు పొడిగించారు. అప్పటి నుంచి అదే విధానం కొనసాగుతోంది. టోకెన్లు, టికెట్లపై దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించనుంది. భక్తుల భారీ రద్దీ దృష్ట్యా ప్రత్యేక దర్శనం భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు టిటిడి తెలిపింది. దర్శన షెడ్యూల్ ప్రకారం మొదటి మూడు రోజుల పాటు ముందుగా జారీ చేసిన టోకెన్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు దర్శన టికెట్లు లేకుండానే భక్తులకు దర్శనం కల్పించనున్నారు. దీంతో ముందస్తు బుకింగ్ లేని భక్తులకు కూడా అవకాశం లభించనుంది.
తిరుమలకు వచ్చే భక్తులు ఈ మార్గం నుంచే...
ఈ-డీఐపీ వ్యవస్థ ద్వారా కేటాయించిన టోకెన్ ప్రింట్ కాపీతో పాటు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని టిటిడి సూచించింది. మంగళవారం ఉదయం 1 నుంచి 11 గంటల మధ్య టోకెన్లు ఉన్నవారు కృష్ణతేజ ప్రవేశద్వారం నుంచి, 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏటీజీహెచ్ ప్రవేశద్వారం నుంచి, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశద్వారం నుంచి ప్రవేశించాల్సి ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజున స్వర్ణ రథంపై మాడ వీధుల్లో విహరిస్తూ శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వైకుంఠ ద్వాదశి రోజున తెల్లవారుజామున స్వామి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు.పండుగ సందర్భంగా తిరుమల కొండలను ప్రత్యేకంగా అలంకరించారు.
పద్దెనిమిది రకాల ఆహార పదార్ధాలతో అన్న ప్రసాదం...
ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలను 50 టన్నుల సంప్రదాయ పూలు, 10 టన్నుల పండ్లు, నాలుగు లక్షల పూలతోతో ముస్తాబు చేశారు. ప్రధాన ఆలయం వెలుపల అష్టలక్ష్మిలతో కూడిన శ్రీరంగనాథస్వామి ఆలయ నమూనా, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఏర్పాటు చేశారు.క్యూలైన్ల నిర్వహణ, భక్తుల సేవల కోసం శ్రీవారి సేవకులను నియమించారు. అన్నప్రసాదాల పంపిణీ, తాగునీటి సరఫరా బాధ్యతలు వారికి అప్పగించారు. భద్రత కోసం విజిలెన్స్ సిబ్బందితో పాటు దాదాపు మూడు వేల మంది జిల్లా పోలీసులను మోహరించారు.క్యూలో వేచి ఉన్న భక్తులకు పద్దెనిమిది రకాల ఆహార పదార్థాలు, అన్నప్రసాదం, వేడి పానీయాలు రోజంతా అందుబాటులో ఉంటాయని టిటిడి తెలిపింది. భక్తులు తొందరపడకుండా స్వామి వారిని దర్శించుకోవాలని కోరుతున్నారు.
Next Story

